పది నిముషాల వరకు ఓకే
మినహాయింపునిచ్చిన ఇంటర్ బోర్డు సెక్రటరీ
విశాఖపట్నం : తొలి రోజు ఒక్క నిముషం ఎఫెక్ట్‌తో పరీక్ష రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థుల ఆవేదనను ఇంటర్మీడియట్ బోర్డు అర్థం చేసుకుంది. పది నిముషాలపాటు మినహాయింపునిస్తూ బోర్డు సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఇంటర్మీడియట్ తొలి ఏడాది విద్యార్థులు గగ్గోలు పెట్టిన విషయం పత్రికల్లో ప్రముఖంగా రావడంతో ఇంటర్మీడియట్ బోర్డు స్థానిక అధికారులు బోర్డు సెక్రటరీ ఎం.వి.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం పావుగంటైనా అనుమతించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అభ్యర్థన రావడంతో గురువారం నుంచి పది నిముషాలపాటు మినహాయింపునిచ్చారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
రెండో రోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు జిల్లాలో 49,655 మంది హాజరు కావాల్సి ఉండగా 48,422 మంది పరీక్ష రాశారు. 1233 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ కేటగిరి పరిధిలో 46,020 మందికి 45,040మంది, ఓకేషనల్ కేటగిరిలో 3635 మందికి 3382మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 110 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షల్లో రెండోరోజు ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. స్టేట్ అబ్జర్వర్ బి.దివాకర్, ఆర్జేడీ రూఫస్ కుమార్ పరీక్షలను పర్యవేక్షించారు.
ఇంటర్ విద్యార్థులకు ఊరట
Published Fri, Mar 4 2016 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement
Advertisement