ఇంటర్‌ ఫలితాలు.. అమ్మాయిలదే హవా | Girls top in intermediate exam results | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాలు.. అమ్మాయిలదే హవా

Published Sat, Apr 13 2024 4:02 AM | Last Updated on Sat, Apr 13 2024 4:02 AM

Girls top in intermediate exam results - Sakshi

ఇంటర్‌ ఫలితాలు విడుదల 

రెండో ఏడాదిలో 81 శాతం, మొదటి ఏడాదిలో 71% మంది బాలికల ఉత్తీర్ణత 

బాలురు, బాలికలు కలిపి మొత్తం 10,02,150 మంది పరీక్షలకు హాజరు 

6,63,584 మంది ఉత్తీర్ణత 

మొదటి ఏడాది 67 శాతం, రెండో ఏడాది 78 శాతం ఉత్తీర్ణత.. 90 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో కృష్ణా జిల్లా 

18 నుంచి 24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం.. మే 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మార్చి ఒకటి నుంచి 20 వరకు నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు బాలికలు, బాలురు కలిపి మొత్తం 10,02,150 మంది హాజరవగా 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,29,528 మంది (78 శాతం), మొదటి సంవత్సరం విద్యార్థులు 3,34,056 మంది (67 శాతం) ఉన్నారు. ఈ మేరకు ఫలితాలను శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్మీడియెట్‌ విద్యా మండలిలో కమిషనర్, కార్యదర్శి సౌరభ్‌ గౌర్, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వీవీ సుబ్బారావు సంయుక్తంగా విడుదల చేశారు.

పరీక్షలు ముగిశాక కేవలం 21 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. కాగా ఎప్పటిలాగే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 81 శాతం, మొదటి ఏడాదిలో 71 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురు రెండో ఏడాది 75 శాతం, మొదటి సంవత్సరంలో 64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2023 మార్చిలో ఇంటర్‌ మొదటి ఏడాది 4.33 లక్షల మంది పరీక్ష రాయగా 61 శాతం, ద్వితీయ సంవత్సరం 3.80 లక్షల మంది రాయగా 72 శాతం మంది పాసయ్యారు.

మొత్తం మీద గతేడాది కంటే ఈసారి 6 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. ఫలితాల్లో జిల్లాల వారీగా కృష్ణా మొదటి స్థానంలో (మొదటి సంవత్సరం 84 శాతం, ద్వితీయ సంవత్సరం 90 శాతం) సాధించగా, చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు (ఇంటర్‌ మొదటి ఏడాది), చిత్తూరు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. ఫలితాలను https://resultsbie.ap.gov.in లేదా www. sakshieducation.comÌ లో చూడవచ్చు.   

ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి..  
ఒకేషనల్‌ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు మొదటి ఏడాది 47 శాతం, రెండో ఏడాది 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్‌ విభాగంలో బాలికలు, బాలురు కలిపి మొదటి సంవత్సరం మొత్తం 38,483 మంది పరీక్షలకు హాజరు కాగా 23,181 మంది (60 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32,339 మంది హాజరవగా 23 వేల మంది (71 శాతం) విజయం సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ఏడాది 77 శాతం, రెండో ఏడాది 83 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. చివరి స్థానంలో వైఎస్సార్‌ (మొదటి ఏడాది), పల్నాడు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి.  

24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం 
ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్‌ బోర్డుకు తెలియజేయాలని కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ కోరారు. ఈ నెల 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మే 25 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు.  మార్కుల లిస్టులు డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇవి రెగ్యులర్‌ పత్రాలుగానే చెల్లుబాటవుతాయన్నారు.   

విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా ఉండాలి 
ఉత్తీర్ణులు కానివారు ఆందోళన చెందొద్దని సౌరభ్‌ గౌర్‌ సూచించారు. గతంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైనవారికి ‘కంపార్ట్‌మెంటల్‌’ అని సరి్టఫికెట్‌పై వచ్చేదని, ఇప్పుడు దాన్ని రద్దు చేశామన్నారు. ఇకపై సప్లిమెంటరీ కూడా రెగ్యులర్‌తో సమా­నంగానే ఉంటుందన్నారు. ఫెయి­లైన విద్యార్థులకు తల్లిదండ్రులు మనోధై­ర్యాన్ని అందించాలని సూచించారు.

బైపీసీలో విశాఖ అమ్మాయి పావనికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ 
ఇంటర్‌ ఫలితాల్లో విశాఖ జిల్లా గాజువాక చైతన్య కళాశాల విద్యార్థి శరగడం పావని సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును దక్కించుకుంది. పావని తండ్రి నాగగంగారావు గంగవరం పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేయడమే తన లక్ష్యమని పావని తెలిపింది.  
 
కిరణ్మయికి స్టేట్‌ సెకండ్‌ ర్యాంక్‌ 
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ఆలూరి కిరణ్మయి సీనియర్‌ ఇంటర్‌ బైపీసీలో 1000కి 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్‌ ర్యాంక్‌ దక్కించుకుంది. కిరణ్మయి విజయవాడలోని శ్రీ గోసలైట్స్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదివింది. కిరణ్మయి తండ్రి ఏవీ గిరిబాబు సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి విజయశాంతి గృహిణి. ఎంబీబీఎస్‌ చదివి న్యూరాలజిస్ట్‌ కావాలన్నదే తన చిరకాల కోరిక అని కిరణ్మయి వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement