Sabitha Indra Reddy Announcement: All TS Inter First Year Failed Students Pass - Sakshi
Sakshi News home page

TS Inter 1st Year Result: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులంతా పాస్‌

Published Fri, Dec 24 2021 6:32 PM | Last Updated on Sat, Dec 25 2021 10:29 AM

Sabita Indra Reddy Says All Students Passed Inter First Year - Sakshi

ధైర్యం కోల్పోవద్దు..
పరీక్షలు ఫెయిలైన విద్యార్థులు ధైర్యంగా మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలే తప్ప పాస్‌ చేయాలని ఒత్తిడి తేవడం, ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదు. విద్యార్థి జీవితంలో ఇంటర్‌ కీలకమైన దశ. దీన్ని కూడా రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదు.

ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పాం
కరోనా కాలంలోనూ ఆన్‌లైన్‌ విద్యను అందుబాటులోకి తెచ్చాం. దూరదర్శన్, టీశాట్‌ ద్వారా పాఠాలు చెప్పాం. ఇంటర్‌ విద్య బలోపేతం ప్రభుత్వ లక్ష్యం. అందుకే 620 గురుకులాలు, 172 కస్తూర్బా కళాశాలలతోపాటు సంక్షేమ పాఠశాలలను ఇంటర్‌ స్థాయికి పెంచాం. అన్ని  మౌలిక సదుపాయాలు కల్పించాం. 

10 వేల మందికి 95% మార్కులు..
విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు పెట్టాం. ప్రభుత్వ కాలేజీల్లోనే తక్కువ ఫలితాలొచ్చాయనడం సరికాదు. ఆన్‌లైన్‌ విద్యపై నిందలేయడం సముచితం కాదు. 10 వేల మంది 95 శాతం మార్కులు తెచ్చుకున్నారు. – మంత్రి సబిత

ఇకపై కుదరదు
ఇప్పుడే చెబుతున్నాం. ఇక మీదట ఇలా పాస్‌ చేయడం కుదరదు. ఇప్పట్నుంచే విద్యార్థులు అందరూ కష్టపడి చదవండి. మంచి మార్కులు తెచ్చుకోండి. 

సాక్షి, హైదరాబాద్‌:  ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిల్‌ కావడంపై తలెత్తిన వివాదానికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

దీనివల్ల 2,35,230 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంత్రి సబిత అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికీ ఉంది. అందుకే గ్రేస్‌ మార్కులపై సమీక్షించాం. ఫెయిల్‌ అయింది 2.35 లక్షల మంది. 10 మార్కులు కలిపినా 8,076 మందే పాసయ్యేలా ఉన్నారు.

15 కలిపితే 24 వేలు, 20 కలిపితే 58 వేలు, 25 కలిపితే 72 వేలు, 30 మార్కులు కలిపితే 83 వేల మంది పాసవుతారు. అయినా పెద్ద సంఖ్యలో పాసయ్యే అవకాశం లేదు. అందుకే ఉత్తీర్ణతకు కనీస మార్కులైన 35ను ఫెయిలైన వారందరికీ ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు. విద్యార్థుల మనోవేదనను గుర్తించే పాస్‌ చేస్తున్నామని, ఇదే వ్యాకులతతో ఉంటే సెకండియర్‌ దెబ్బతింటుందని భావించి పాస్‌ చేశామని సబిత చెప్పా. అంతే తప్ప ఎవరో ఆందోళనలు చేశారని మాత్రం కాదన్నారు.  

వద్దనుకుంటే సొమ్ము వెనక్కి..: రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని వద్దనుకుంటే చెల్లించిన సొమ్మును తిరిగిస్తామని మంత్రి సబిత చెప్పారు. ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌ చేయించుకోవచ్చని, అప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వబోమన్నారు. విద్యార్థులు తమ ఐచ్ఛికాన్ని ఇంటర్‌ బోర్డుకు తెలియజేయవచ్చన్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా అందరినీ పాస్‌ చేశామని, ఇంటర్‌ సెకండియర్‌లో విద్యార్థులు వారి సామర్థ్యాలను మెరుగుపరుచుకొనేందుకే ఫస్టియర్‌ పరీక్షలు పెట్టామని సబిత తెలిపారు.

కానీ 51 శాతం విద్యార్థులు ఫెయిల్‌ కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం విచారకరమన్నారు. దీన్ని అడ్డుపెట్టుకొని కొన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు ఆందోళనలు చేపట్టడం న్యాయం కాదన్నారు. విలేకరుల సమావేశంలో ఇంటర్‌ విద్య అధికారులు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement