సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీని ప్రకటించనున్నట్టు బోర్డు కమిషనర్ శృతి ఓజా ’సాక్షి’ప్రతినిధికి తెలిపారు.
ఆది, లేదా సోమవారం ఫలితాలను వెల్లడించాలనుకుంటున్నామని, ఎక్కువ శా తం సోమవారమే ఉండొచ్చని ఆమె చెప్పారు. ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని, ఎలాంటి లోటు పాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు.
మార్చి 6వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్ షీట్ల డీ కోడింగ్ చేశారు. మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment