shruti ojha
-
ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీని ప్రకటించనున్నట్టు బోర్డు కమిషనర్ శృతి ఓజా ’సాక్షి’ప్రతినిధికి తెలిపారు. ఆది, లేదా సోమవారం ఫలితాలను వెల్లడించాలనుకుంటున్నామని, ఎక్కువ శా తం సోమవారమే ఉండొచ్చని ఆమె చెప్పారు. ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని, ఎలాంటి లోటు పాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. మార్చి 6వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్ షీట్ల డీ కోడింగ్ చేశారు. మార్కులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. -
వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా శృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతి ఓజా బదిలీ అయ్యారు. ఆమెను వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2013 బ్యాచ్‌కు చెందిన శృతి ఓజా గతేడాది కాలంగా వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, తాండూరు రెవెన్యూ డివిజన్‌కు సబ్‌కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా(2014)ను నియమించారు. ముస్సోరీలో ఐఏఎస్ శిక్షణను పూర్తి చేసుకున్న ఝాకు ఇదే తొలి పోస్టింగ్. జిల్లాల పునర్విభజనలో భాగంగా తాండూరు కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆవిర్భవించింది. ఈ క్రమంలో ఐఏఎస్ స్థాయి అధికారిని సబ్‌కలెక్టర్‌గా నియమించడం గమనార్హం. -
తమాషా చేస్తున్నారా?
ప్రజా సమస్యలంటే అంత చులకనా..? అధికారుల తీరుపై సబ్ కలెక్టర్ శ్రుతిఓజా ఆగ్రహం వికారాబాద్: ‘ప్రజల సమస్యలంటే అంత చులకనా.. ఏం తమాషా చేస్తున్నారా’.. అని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ శ్రుతిఓజా వివిధ శాఖల అధికారులపై మండిపడ్డారు. వికారాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి గైర్హాజరైన సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు ఉద్యోగులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఎక్సైజ్, ఐటీడీఏ, ఐసీడీఎస్, తూనికలుకొలతలు, కార్మిక, ఆర్‌డబ్ల్యుఎస్, గ్రంథాలయ, మున్సిపల్, బ్యాంకింగ్ తదితర శాఖల అధికారులు తరచూ దర్బార్‌కు ఎగనామం పెడుతుండటంపై మండిపడ్డారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదుపై వెంటనే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ గౌతంకుమార్, ఎంపీడీవో సత్తయ్య ఉన్నారు.