తమాషా చేస్తున్నారా?
ప్రజా సమస్యలంటే అంత చులకనా..?
అధికారుల తీరుపై సబ్ కలెక్టర్ శ్రుతిఓజా ఆగ్రహం
వికారాబాద్: ‘ప్రజల సమస్యలంటే అంత చులకనా.. ఏం తమాషా చేస్తున్నారా’.. అని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ శ్రుతిఓజా వివిధ శాఖల అధికారులపై మండిపడ్డారు. వికారాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి గైర్హాజరైన సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు ఉద్యోగులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్, ఐటీడీఏ, ఐసీడీఎస్, తూనికలుకొలతలు, కార్మిక, ఆర్‌డబ్ల్యుఎస్, గ్రంథాలయ, మున్సిపల్, బ్యాంకింగ్ తదితర శాఖల అధికారులు తరచూ దర్బార్‌కు ఎగనామం పెడుతుండటంపై మండిపడ్డారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదుపై వెంటనే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ గౌతంకుమార్, ఎంపీడీవో సత్తయ్య ఉన్నారు.