‘ప్రైవేట్’ ఆగడాలకు చెక్
మే 31కి ముందే జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రతి ఏటా కాలేజీల్లో ప్రవేశాలు పూర్తయ్యాక ఆయా కాలేజీల అనుబంధ గుర్తింపునకు బోర్డు చర్యలు చేపడుతోంది. వీటిలో లోపాలున్నా.. మధ్యలో కాలేజీ మూసేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న సాకుతో కాలేజీలు తమ ఆగడాలను కొనసాగించాయి. ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మే 31లోగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.
గుర్తింపు లభించిన కాలేజీల్లోనే జూన్ 1 నుంచి ప్రవేశాలు చేపట్టనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ వెల్లడించారు. అలాగే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, లభించని కాలేజీల జాబితాను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. అనుబంధ గుర్తింపు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు, ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈసారికి మాత్రం షరతులతో అనుబంధ గుర్తింపు..
రాష్ట్రంలో 1,642 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిల్లో 1056 కాలేజీలకు 2016-17 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు లభించింది. మరో 586 కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధ గుర్తింపును ఇవ్వలేదు. అందులో 349 కాలేజీలు అనధికారికంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ చేసినవి ఉండగా, పక్కా భివనాలు లేకుండా షెడ్లలో కొనసాగుతున్నవి 85 ఉన్నాయి. 152 కాలేజీలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదు. వీటిపై బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపగా, షరతులతో అనుమతులు ఇవ్వాలని సూచించింది. దీంతో మూడు నెలల్లో ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ తెచ్చుకుంటామని, వచ్చే విద్యా సంవత్సరంలోగా పక్కా భవనాల్లోకి షిఫ్ట్ చేస్తామన్న షరతుతో బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది.