మాట్లాడుతున్న నారాయణరెడ్డి, ఈశ్వరయ్య
బి.కొత్తకోట: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 220 ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల గుర్తింపును రద్దుచేయాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వెంబులూరు నారాయణరెడ్డి, బి.ఈశ్వరయ్య చెప్పారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్‌లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. 2022–23 విద్యాసంవత్సరంలో విద్య, బోధన సామర్థ్యంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించిందని చెప్పారు. దీనిపై ఇప్పటికే మూడుసార్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
ఎనిమిది ఐటీడీఏల పరిధిలోని రెండువేల పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేసేందుకుగాను ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మూడుశాతం బడిబయట పిల్లలున్నారని, వీరిని పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. అక్షరాస్యతలో జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.
గత ఏడాది రాష్ట్రంలో ఎల్‌కేజీ నుంచి ఇంటర్ చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అందిస్తున్న ప్రోత్సాహం, పాఠశాలల అభివృద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో పాఠశాల విద్యకు రూ.29 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు.
సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వృత్తివిద్య కోర్సులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులకు, ఫీజులపై తల్లిదండ్రులకు, అభ్యసన సామర్థ్యంపై విద్యార్థులకు త్వరలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల కమిటీలను బలోపేతం చేయడం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment