Narayanareddy
-
220 ప్రైవేటు విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫారసు
బి.కొత్తకోట: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 220 ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల గుర్తింపును రద్దుచేయాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వెంబులూరు నారాయణరెడ్డి, బి.ఈశ్వరయ్య చెప్పారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్‌లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. 2022–23 విద్యాసంవత్సరంలో విద్య, బోధన సామర్థ్యంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించిందని చెప్పారు. దీనిపై ఇప్పటికే మూడుసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎనిమిది ఐటీడీఏల పరిధిలోని రెండువేల పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేసేందుకుగాను ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మూడుశాతం బడిబయట పిల్లలున్నారని, వీరిని పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. అక్షరాస్యతలో జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి ఇంటర్ చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అందిస్తున్న ప్రోత్సాహం, పాఠశాలల అభివృద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో పాఠశాల విద్యకు రూ.29 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిన ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వృత్తివిద్య కోర్సులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులకు, ఫీజులపై తల్లిదండ్రులకు, అభ్యసన సామర్థ్యంపై విద్యార్థులకు త్వరలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల కమిటీలను బలోపేతం చేయడం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. -
మళ్లించిన వరద నీటిని లెక్కలోకి తీసుకోవద్దు
సాక్షి, అమరావతి: దిగువ కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్న సమయంలో ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటా కింద లెక్కించకూడదని కృష్ణా బోర్డుకు ఏపీ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో నీటిని మళ్లించకుంటే వృథాగా సముద్రం పాలవుతుందన్నారు. దీన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లామని, మళ్లించిన వరద నీటిపై మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే పేర్కొన్నారు. ఏపీకి 95, తెలంగాణకు 83 టీఎంసీలు కేటాయించడానికి అంగీకరిస్తూ ప్రతిపాదనలు పంపితే నీటి విడుదలపై సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు కార్యాలయంలో సభ్య కార్యదర్శి రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఏపీ తరఫున ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున సాగర్ సీఈ నరసింహ హాజరయ్యారు. మార్చి 31 వరకూ సాగు, తాగునీటి అవసరాలకు 108 టీఎంసీలు కేటాయించాలని ఏపీ, 83 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ప్రతిపాదించాయి. శ్రీశైలంలో కనీస నీటి మట్టానికి దిగువన 807 అడుగుల వరకూ వెళ్లి నీటిని వినియోగించుకోవాలని ఏపీ ఈఎన్సీ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బోర్డు స్పందిస్తూ శ్రీశైలంలో 810, సాగర్‌లో 520 అడుగుల వరకు కనీస నీటి మట్టాలను నిర్వహించాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. క్యారీ ఓవర్ జలాలపై తేల్చేది ట్రిబ్యునలే.. ప్రస్తుత నీటి సంవత్సరంలో వినియోగించుకోలేని జలాలను వచ్చే నీటి సంవత్సరంలో వినియోగించుకుంటామని తెలంగాణ సీఈ నరసింహ బోర్డుకు విజ్ఞప్తి చేయడంపై ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని స్పష్టం చేశారు. క్యారీ ఓవర్ జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కులు ఉంటాయని తేల్చిచెప్పారు. క్యారీ ఓవర్ జలాల అంశాన్ని కేడబ్ల్యూడీటీ–2(కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్)లో తేల్చుకోవాలని బోర్డు సూచించింది. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ లీకులతో గత ఏడాది నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1వరకూ 17,313 క్యూసెక్కులు (1.49 టీఎంసీలు) సాగర్ కుడి కాలువలోకి చేరాయని, అవసరం లేకపోవడంతో ఆ నీళ్లన్నీ వృథా అయిన దృష్ట్యా వాటిని తమ వాటాగా లెక్కించకూడదన్న ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామని బోర్డు తెలిపింది. విశాఖలో కృష్ణా బోర్డు కార్యాలయం కోసం ఎంపిక చేసిన భవనాలను పరిశీలించామని,తరలింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. రాష్ట్ర హక్కులను కాపాడుకుంటాం: సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ త్రిసభ్య కమిటీ భేటీ ముగిసిన తర్వాత ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి విలేకరులతో మట్లాడారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్లో నీటి వినియోగానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కృష్ణా బోర్డును విశాఖకు తరలించాలని ప్రతిపాదించామన్నారు. దీనిపై తెలంగాణ సర్కారు అభ్యంతరాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ గోదావరి బోర్డు ప్రధాన కార్యాలయం కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌లో ఉంది కదా? అని పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికే ప్రాజెక్టులను చేపట్టామని స్పష్టం చేశారు. -
29–30 తేదీల్లో సమీకృత ప్రకృతి సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ
సెంటర్ ఫర్ ట్రెడిషినల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ సమీకృత ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఎల్. నారాయణరెడ్డి ఈ నెల 29, 30 తేదీల్లో బెంగళూరుకు సమీపంలోని దొడ్డబళ్లాపూర్, మరలెనహళ్లి, శ్రీనివాసపురం గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ వివరాల కోసం.. 94495 96039, 83101 99215, 99017 30600. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
విడపనకల్లు/శింగనమల(అనంతపురం): అప్పుల బాధ తాళలేక అనంతపురం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విడపనకల్లు మండలంలోని వేల్పుమడుగుకు చెందిన అల్దప్ప కుమారుడు హరికృష్ణ(28) ఐదారేళ్లుగా సొంత భూమి ఏడెకరాలు.. కౌలుకు తీసుకున్న మరో 20 ఎకరాల్లో మిరప, వేరుశనగ పంటలు సాగు చేశాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడికి చేసిన అప్పులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గత యేడాది కూడా కౌలుకు తీసుకున్న 20 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. సరైన ధర లేకపోవడంతో అప్పు రెట్టింపయింది. ఈ సంవత్సరం కూడా సొంత పొలంలో రెండు బోర్లు వేయించగా నీళ్లు పడలేదు. విడపనకల్లు సిండికేట్ బ్యాంకులో తల్లిదండ్రులు అల్దప్ప, లక్ష్మిదేవిల పేరిట క్రాపు లోను రు.1.50 లక్షలు తీసుకున్నాడు. బంగారంపై మరో రూ.2లక్షలు అప్పు చేశాడు. బంగారం మీద పైసా కూడా మాఫీ కాలేదని మృతుని తండ్రి అల్దప్ప ఆవేదన వ్యక్తం చేశారు. క్రాప్ లోన్‌లో మాత్రం రెండు దఫాలుగా రూ.29,500 ప్రకారం రు.59 వేలు మాఫీ అయ్యిందన్నారు. పంటల కోసం బయటి వ్యక్తులతో ఆరు çసంవత్సరాలుగా తీసుకున్న అప్పు రూ.9లక్షలకు చేరింది. పంటలు పండక.. అప్పులు తీర్చే దారి లేక శుక్రవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బళ్లారికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు విడపనకల్లు ఏఎస్ ఎర్రిస్వామి తెలిపారు. నాలుగు బోర్లు వేసినా పడని నీరు శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి(51)కి ఎనిమిది ఎకరాల పొలం ఉంది. భార్య రమాదేవి, ఒక కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి, కూతురు హరిత సంతానం. 2009వ సంవత్సరం వరకు చీనీ చెట్లు ఉండగా.. బోరులో నీళ్లు తగ్గిపోవడంతో చెట్లను కొట్టేశారు. అప్పట్లోనే ఉన్న భూమిని అమ్ముకుంటారని భావించిన నారాయణరెడ్డి తండ్రి పెద్ద నారాయణరెడ్డి.. మనవడు అనిల్‌కుమార్‌రెడ్డి పేరట భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సంవత్సరం నుంచి వర్షాధారం కింద వేరుశనగ సాగు చేస్తున్నారు. 2011లో కూతురు వివాహం చేశారు. 2013లో అప్పులు చేసి నాలుగు బోర్లు వేయించారు. ఒక్కో బోరు 350 నుంచి 400 అడుగుల వరుకు వేశారు. అయితే నీళ్లు పడలేదు. ఒక్కో బోరుకు రూ.40 వేల వరకు ఖర్చయింది. ఆ ఏడాది వేసిన వేరుశనగ పంటకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున ఎనిమిది ఎకరాలకు రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో రూ.70వేల నష్టం వచ్చింది. 2014లో వేరుశనగ సాగుకు రూ.1.50లక్షలు అప్పు చేయగా.. పెద్దగా దిగుబడి రాకపోవడంతో రూ.1.20లక్షలు నష్టపోయాడు. ఇలా మొత్తం అప్పు రూ.4లక్షలకు చేరుకుంది. అదే ఏడాది కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి బీటెక్ చేరడంతో రూ.50 వేలు అప్పు చేశారు. 2015వ సంవత్సరం నుంచి వేరుశనగ సాగుకు పెట్టుబడి పెట్టేందుకు అప్పు దొరక్క ఎనిమిది ఎకరాల పొలాన్ని బీడు పెట్టుకున్నారు. అప్పటి నుంచి భూమి సాగుకు నోచుకోకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయి ఆర్థికంగా చితికిపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించేలోగానే నారాయణరెడ్డి మరణించాడు. -
కన్నీరే మిగిలింది
కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంటలకు నీరందించేందుకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతానికి గురవుతున్నారు. బోర్లు మొరాయించడంతో ఫ్యూజులు సరిచేయడం, వైర్లు మరమ్మతులు చేసేక్రమంలో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరెంటు కాటుకు బాధిత రైతు కుటుంబాలు దిక్కులేనివవుతున్నాయి. బొమ్మనహాళ్: కొలగానహాళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మైలాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి (46) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... మైలాపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఏడు ఎకరాల పొలం ఉంది. మూడేళ్లుగా పంట చేతికందకపోవడంతో పెట్టుబడులు సైతం తిరిగి రాలేదు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో వరి నాట్లు వేశాడు. మరో రెండు ఎకరాల్లో వరినాట్లకు సిద్ధమయ్యాడు. మిగతా మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే పొలానికెళ్లాడు. రాత్రి వేసిన మోటార్‌ను పరిశీలించి ఫ్యూజ్‌క్యారియర్ తొలగించడానికి అటుగా ముందుకు కదిలాడు. అయితే అప్పటికే ఆ ప్రదేశం తేమగా ఉండటంతో అర్త్‌వైరు తగిలి నారాయణరెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదించారు. రైతు నారాయణరెడ్డి ఉద్దేహాళ్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.2లక్షలు, గ్రామంలో పలువురు రైతుల వద్ద రూ.3 లక్షల దాకా అప్పులు చేశాడు. మృతుడి భార్య లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమేదార్ లక్ష్మీనారాయణ తెలిపారు. -
ఆక్లాండ్‌లో ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి
ఆక్లాండ్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(టాంజ్) కమిటీ సభ్యులు ఆక్లాండ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ జయశంకర్ 6వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమస్పూర్తి జయశంకర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు మరువకూడదని టాంజ్ సభ్యులు పేర్కొన్నారు. అంతేకాకుండా మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల టాంజ్ సంతాపాన్ని తెలిపింది. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని సినారె ప్రపంచానికి తెలంగాణ గొప్పతనాన్ని చాటిచెప్పారని టాంజ్ సభ్యులు పేర్కొన్నారు. సినారె మరణం సినీ రంగానికి, సాహిత్య రంగానికే కాకుండా యావత్ తెలంగాణకు తీరని లోటని తెలిపారు. -
సాహితీ శిఖరానికి నివాళులు
డా.సి.నారాయణ రెడ్డి తన జీవితంలో రాసిన చిట్టచివరిగా రచించిన పాట "ఇంకెన్నాళ్లు" సినిమాలో 'ఏమి వెలుతురూ ఇది ఏమి వెలుతురూ.. పొద్దు పొడవక ముందే పూత వెలుతురూ, కొత్త పెళ్లి పడచు తలఎత్తగానే.. పల్లెనిండా పరుచుకుంది పసిడి వెలుతురూ ! జిమ్మరే జిమ్మరేజిమ్మా .. ముద్దుగుమ్మారే గుమ్మరే గుమ్మా !! .. ఇది సినారె చివరి పాటగా మిగిలి పోవడం బాధాకరం. అది తెలంగాణాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జరిగే పెళ్లి (లగ్గం) ఘట్టాలు.. ఆయనను తొలిసారి కలిసింది నా రెండో సినిమా "అవును నిజమే" ఆడియో ఫంక్షన్లోనే, అతనే చీఫ్ గెష్ట్, ఆ సినిమా పాటలను శ్రద్ధగా విని ఒక ప్రశంసపత్రం రాసుకొని వచ్చి వినిపించి ప్రోత్సహించారు అయన. మధ్యలో సారస్వత పరిష్యత్లో ఇంకెన్నాళ్లు డీవీడీ ని కూడా ఆవిష్కరించారు. చివరి సారి కలిసింది మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు వచ్చినప్పుడు తానే స్వయంగా నాకు ఫోన్ చేసి తన ఇంటికి ఆహ్వానించి తన లెటర్ హెడ్డుపై తన హస్తాక్షరాలతో నన్ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా కితాబు ఇస్తూ అభినందన పత్రం రాసిచ్చారు ఆ జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత. ఎంతో కల్మషంతో నిండిన ఈ వ్యవస్థలో ఇలాటి గొప్ప మనస్సుగల లెజెండరీ పెర్సొనాలిటీ, విశిష్ట కవితో నేను పనిచేయడం, ప్రశంశించబడడం నాలాంటివాడికి ఒక వారమే ! ఆయన ఇక భౌతికంగా జరిగి పోవడం ముమ్మాటికీ బాధ కారమే. అయన ఇచ్చిన ప్రోత్సాహం, ప్రశంశాపత్రం నాకో పెద్ద బహుమానంగా చిరకాలం ఉండిపోతాయి. ఇదంతా మా ఇద్దరి మధ్య ఎన్నడూ చెరపలేని అనుబంధ ముద్ర.. సినారేకు జోహారులు!! - సయ్యద్ రఫీ ఆయనో ధ్రువతార నింగి కెగసిన తెలుగు సాహితీ ధృవతార సినారె రాజ్యసభ సభ్యునిగా ఉండగా,అదే సమయంలో లోక్ సభ సభ్యునిగా ఉండడం నా అదృష్టం.మమకారం తో పాటు,స్వచ్ఛమైన తెలుగు నుడికారం ఆయన మాటల్లో ఇమిడిపోయేవి.పబ్లిక్ మీటింగులంటే ఇంక చెప్పనక్కరలేదు.ఆయన ప్రసంగం ఓ తెలుగు నదీ ప్రవాహమే.శ్రోతలు అందులో మునిగి తేలి ఆస్వాదించాల్సిందే కానీ వర్ణించడం కష్టం. అలాంటి ఆత్మీయ,ఆధునిక తెలుగు సాహితీ శిఖరం సినారె మరణించడం యావత్ జాతికి తీరని లోటు. ఆయన సాహిత్యం సర్వకాలీనం,విశ్వజనీనం.వ్యక్తి వికాసము మొదలు,విశ్వ మానవుని వికాసం వరకూ ఆయన కావ్య వస్తువులే.ఆయనకు జ్ఞాన పీఠం అందించిన కావ్యం విశ్వంభర విశ్వవిద్యాలయాల్లో పాఠం గా నిలవడం,వివిధ భాషల్లోకి అనువాదం కావడం గర్వకారణం.సాధారణ వాడుక భాషలో సినీ గీతాలైనా,గ్రాంధిక భాషలో పద్య,వచన కావ్యాలైనా ఒకే శ్రద్ధతో,అంకితభావం తో వ్రాయడంవల్ల పదికాలాలూ తెలుగు నేలపై అవి మనగలుగుతున్నాయి,మనగలుగుతాయి.'వేయి తోటలను నరికిన చేయి,పూయిస్తుందా ఒక్క పువ్వును' అని విశ్వంభర కావ్యంలో ప్రశ్నించిన సినారె ను తోడ్కొని పోయిన మృత్యుదేవతను ప్రశ్నించాలని ఉంది 'వేయి కవులను వెంటబెట్టుకుపోయిన కాలమా,తిరిగిస్తావా ఒక్క సినారె ను' అని. 'జగతి కి సన్ రే (sun ray ).. సాహితీ జగతి కి సినారె, తెలుగునేలపై ఆయనెన్నటికీ ధ్రువతారే. భళారే ! 'ఆయన మనవారే'' అని అనుకోగల అదృష్టవంతులు తెలుగు వారే. -డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపి,పార్వతీపురం. తలవంచని తెలుగు సాహిత్య శిఖరం ఓ కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, విద్యా రంగ పరిపాలనా దక్షుడిగా, పెద్దల సభలో నాయకుడిగా విభిన్న కోణాల్లో సినారె చేసిన సేవలు, ఆయన రాతలు చరిత్రలో చిరస్ధాయిగా మిగిలిపోతాయని జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ఆయన ఎవ్వరికీ తలవంచని తెలుగు సాహిత్య శిఖరం, తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఒక మహావృక్షం అని కీర్తించారు. అటువంటి మహానుభావుడికి వినమ్రతతో నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. గోల్కొండ వజ్రాన్ని కోల్పోయిన తెలుగు సాహిత్యం సాహిత్య ఎవరెస్టు శిఖరం నేల కూలింది. బహు భాషావేత్త ,కవి, రచయిత ,పరిపాలనాదక్షుడిని కోల్పోవడం బాధాకరమని తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమల రావు అన్నారు. తెలుగు విశ్వ విద్యాలయం తరఫున డా.బి.ఆర్ .అంబేద్కర్ రచనల అనువాద సంపుటాలు వెలువరించడంలో సినారెది కీలక పాత్ర అని చెప్పారు. అంతటి ఉద్దండ పిండాన్ని కోల్పోవడం తెలుగు జాతి దురదృష్టమని అన్నారు. సినారె లేని లోటు వందేళ్ళ వరకు వెంటాడుతుందని చెప్పారు. అవకాశాలు ఇచ్చారు.. సాహిత్యలోకంలో అన్ని ప్రక్రియల్లోనూ తనదైన శైలితో రచనలు చేసి సాహితీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్న ప్రముఖ సాహితీపరుడు డా. సీ నారాయణరెడ్డి మృతిపై నవ చేతన పబ్లిషింగ్ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పలువురు యువ సాహిత్యకారుల వెన్నుతట్టి వారి రచనలకు ముందుమాట రాసి ప్రోత్సహించేవారని సినారేను గుర్తు చేసుకుంది. ఆధునిక కవిత్వంతో సంప్రదాయాలు, ప్రయోగాలు అన్న అనేక రచనలను నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించే అవకాశాన్ని ఆయన కల్పించారని తెలిపింది. అటువంటి వ్యక్తి హఠాన్మరణం తెలుగు సాహితీ లోకానికే కాక నవ చేతన పబ్లిషింగ్ హౌస్‌కి కూడా తీరని దుఃఖాన్ని కలిగించిందని చెప్పింది. సినారె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని పేర్కొంది. -
నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్య
–వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ –ధవళేశ్వరంలో రాస్తారోకో ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): చిత్తూరు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆరోపించారు. నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక నారాయణరెడ్డిని అతి పాశవికంగా హత్య చేశారన్నారు. టీడీపీకి హత్యా రాజకీయాలు కొత్తకాదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఆధ్వర్యంలోని ఇసుక మాఫియాపై పోరాడినందుకే పథకం ప్రకారం నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేశారన్నారు. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా నారాయణరెడ్డిని నిరాయుధుడిని చేశారని దుర్గేష్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజల్లో నారాయణరెడ్డికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్చుకోలేక హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హత్యా రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలులో జరుగుతున్న బంద్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. హత్యకు పాల్పడిన వారిని, హత్య చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బడుగు ప్రశాంత్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు. -
గడువు ఆరు రోజులే!
రోడ్డు ప్రమాదంలో తలకు గాయం ఈ నెల 30 లోపు ఆపరేషన్ అత్యవసరమన్న వైద్యులు లేకుంటే మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం ఆపన్న హస్తం కోసం ఇల్లాలి వేడుకోలు నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబం... పంట చేలు పచ్చగా ఉంటే పనులు దొరుకుతాయి... కూలీ పనుల ద్వారా నాలుగు రాళ్లు చేతికి అందుతాయి. ఏ రోజు సంపాదన ఆ రోజుకే సరిపోతుంది. ఇలాంటి తరుణంలో విధి వారిని వెక్కిరించింది. సంపాదనపరుడైన ఇంటి పెద్దను ప్రమాదం రూపంలో దెబ్బతీసింది. తలకు తీవ్రగాయమైన అతనికి ఈ నెల 30 లోపు శస్త్రచికిత్స చేయకపోతే శాశ్వతంగా మతిస్థిమితం కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తన భర్తకు పునర్జన్మను ప్రసాదించాలని ఆ ఇల్లాలు వేడుకుంటోంది. చెన్నేకొత్తపల్లికి చెందిన సుజాతకు పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన నారాయణరెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఈ ఏడాది జులై 31న శెట్టిపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న నారాయణరెడ్డిని రాంపురం వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తలకు తీవ్ర గాయమైన అతన్ని పెనుకొండ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు చేస్తూ వచ్చిన సొమ్ముతో పాటు ఉన్న ఆస్తి అమ్ముకుని రూ. 6 లక్షల వరకు ఖర్చుపెట్టారు. మరో ఆపరేషన్ అత్యవసరం తలకు గాయమైన చోట వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే నవంబర్ 30 లోపు మేజర్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఇది కాకపోతే నారాయణరెడ్డి శాశ్వతంగా మతి స్థిమితం కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు. అయితే చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సుజాత... ఇంతకాలం భర్తకు మందులతో సరిపెడుతూ వచ్చింది. ఇటీవల అతని ప్రవర్తనలో మార్పులు రాసాగాయి. తనలో తానే మాట్లాడుకోవడం... పిల్లలపై చిరాకు పడడం మొదలైంది. దీంతో భయపడిన సుజాత తెలిసిన వారి వద్ద తన గోడు వెల్లబోసుకుంది. ఆర్థిక సాయం చేస్తే తన భర్తకు శస్త్రచికిత్స చేయిస్తానని అభ్యర్థించింది. వారు అందజేస్తున్న కొద్దిపాటి సొమ్ము అతని అత్యవసర మందులకు సరిపోతోంది. దీంతో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తన భర్తకు ఆపరేషన్ చేయించి, కుటుంబాన్ని ఆదుకోవాలని సుజాత వేడుకుంటోంది. దాతలు సాయం చేయదలిస్తే... పేరు ః సుజాత బ్యాంక్ ఖాతా ః స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చెన్నేకొత్తపల్లి శాఖ ఖాతా నంబర్ ః 32 98 97 75 679 సంప్రదించాల్సిన నంబర్ ః 98494 51737 -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌పై దాడి
పోలీసుల సమక్షంలో టీడీపీ నేత దాషీ్టకం రోడ్డుపై పార్టీ శ్రేణుల నిరసన పుట్టపర్తి టౌన్/ బుక్కపట్నం : తెలుగు దేశం నాయకులు దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దౌర్జన్యకాండకు పాల్పడుతున్న పచ్చచొక్కా నాయకులు తాజాగా మంగళవారం పుట్టపర్తిలో ప్ర జా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను పోలీసులు సమక్షంలోనే ఓ టీడీపీ నాయకుడు అనుచరులతో కలిసి దాడి చేసిన ఘటన పుట్టపర్తిలో ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు.. మంగళవారం మధ్యాహ్నం ప్రజామస్యలు చర్చించేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నారాయణరెడ్డి మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆయన లేకపోవడంతో మున్సిపల్ ఇంజనీర్ చాంబర్‌కు వెళ్లి ఇంజనీర్, మేనేజర్‌తో సమస్యలపై చర్చిస్తుండగా.. టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్ కోళ్ల రమణ అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆయన పాలకమండలి కౌన్సిలర్లు దద్దమ్మలని, చేతగానితనంతో పనులు జరగడడంలేదని తిట్ల దండకానికి పూనుకున్నాడు. అక్కడే ఉన్న కౌన్సిలర్నారాయణరెడ్డి అభ్యంతరం తెలిపాడు. దీంతో రెచ్చిపోయిన ఆయన నారాయణరెడ్డిపై చేయిచేసుకోవడంతోపాటు, దుర్భాషలాడాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడే ఉన్న ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, పోలీసులు ఇంజనీర్ కార్యాలయానికి చేరుకోవడంతో కౌన్సిలర్ నారాయణరెడ్డి పరిస్థితి వివరించారు. అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న కౌన్సిలర్ నారాయణరెడ్డిపై బయట వేచి ఉన్న టీడీపీ నాయకుడు కోళ్ల రమణ, ఆయన అనుచరులు పోలీసులు సమక్షంలోనే రెచ్చిపోయి దాడి చేశారు. నారాయణరెడ్డి మోహంపై కంటి సమీపంలో రక్తగాయాలయ్యాయి. వెంటనే పోలీస్‌స్టేçÙన్కు చేరుకున్న నారాయణరెడ్డి అప్పటికే అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్.హరికృష్ణ, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, మండల పట్టణ కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, ఇతర నాయకులతో కలసి కోళ్ల రమణఫై ఫిర్యాదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై నిరసన ఫిర్యాదుపై సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తక్షణమే చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్‌స్టేçÙన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి స్టేషన్‌కు చేరుకుని, బాధితుడికి న్యాయం చేస్తామని, దాడికి పాల్పడ్డ కోళ్ల రమణను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఇక్కడ న్యాయం జరగకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామన్నారు. -
పోలీసుల అదుపులో మోహన్‌రెడ్డి?
కరీంనగర్ క్రైం : కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నారాయణరెడ్డి తన చావుకు మోహన్‌రెడ్డే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే తమ తండ్రి ఆత్మహత్యతో మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమార్తె పోలీసులకు లిఖితపూర్వంగా రాసిచ్చిన విషయం విదితమే. అయినప్పటికీ ఈ కేసులో మోహన్‌రెడ్డిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
నారాయణరెడ్డి ఆత్మహత్య వెనుక ఆంతర్యమేమిటి?
మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమంటూ కూతురు ఫిర్యాదు తర్వాత పొరపాటుగా ఫిర్యాదు చేశామంటూ పోలీసులకు పిటిషన్ కానీ వారిద్దరే కారణమంటూ నారాయణరెడ్డి సూసైడ్ నోట్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం : కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య సర్వత్రా చర్చనీయాంశమైంది. అక్రమ ఫైనాన్స్ దందాతో సంచనలం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి, కరివేద శ్యాంసుందర్‌రెడ్డి అనే వ్యక్తుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి కుటుంబసభ్యులు ఆ తరువాత కొద్దిసేపటికే మాట మార్చారు. ఇందులో మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి ప్రమేయం లేదని, ఇతరుల మాటలు నమ్మి పొరపాటుగా ఫిర్యాదు చేశామని పేర్కొంటూ పోలీసులకు మళ్లీ పిటిషన్ ఇవ్వడం విశేషం. అయితే అప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఇతరుల మాటలు నమ్మి తొలుత పొరపాటుగా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మరోవైపు నారాయణరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని మోహన్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి(48) తన కుటుంబంతో గత కొంతకాలంగా కరీంనగర్ విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. కుమారుడు వంశీధర్‌రెడ్డి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తుండగా, కూతురు తిరుమల వివాహం కావడంతో వరంగల్‌లో నివాసం ఉంటున్నారు. నారాయణరెడ్డి సోమవారం రాత్రి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో నారాయణరెడ్డి మృతి చెందాడు. మంగళవారం ఉదయం నారాయణరెడ్డి కూతురు గంగ తిరుమల, తల్లి చాడ లక్ష్మితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమని, ఈ మేరకు తన తండ్రి సూసైడ్ నోట్ రాశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రికి స్వగ్రామంలోని సర్వే నంబర్ 293లో రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేదని, సుమారు ఐదేళ్ల క్రితం కుటుంబ అవసరాలకు శ్యాంసుందర్‌రెడ్డి ద్వారా ఏఎస్సై మోహన్‌రెడ్డి వద్ద ఆ భూమిని తనఖా పెట్టి రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడని పేర్కొన్నారు. తర్వాత వడ్డీతో కలిపి మొత్తం చెల్లించినా ఆ భూమి పత్రాలు తిరిగి ఇవ్వలేదని అందులో తెలిపారు. ఇదే విషయంపై తన తండ్రి నారాయణరెడ్డి బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీఐడీకి బదిలీ చేశారని, తర్వాత ఆ భూమిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఇదే విషయంపై తన తండ్రి బాధపపడుతుండేవాడని పేర్కొన్నారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చిన తన తండ్రి నోటి నుంచి నురగ రావడంతో ప్రతిమ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ పరీక్షించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు చెప్పారని, అప్పటికే అర్ధరాత్రి ఒంటి గంట అయ్యిందని పేర్కొన్నారు. తన తండ్రి జేబులో ‘మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి వేధింపుల వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని రాసి ఉన్న సూసైడ్ నోటు లభించిందని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు కుటుంబసభ్యులు పోలీసులకు అందజేసిన సూసైడ్ నోట్లో ‘నేను అందరూ నావాళ్లు అనుకుని సాయం చేసిన. కానీ నన్నెవరూ అర్ధం చేసుకోలేదు. మీ నుంచి నేను వెళ్లిపోతున్నందుకు క్షమించగలరు. నా చావుకు ముఖ్య కారకులు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి’ అని రాసి ఉండటం గమనార్హం. ఫిర్యాదు పొరపాటు... మోహన్‌రెడ్డి ప్రమేయం లేదు ఉదయం మోహన్‌రెడ్డి వల్లే తన తండ్రి చనిపోయాడని ఫిర్యాదు చేసిన నారాయణరెడ్డి కూతురు తిరుమల మధ్యాహ్నం తల్లి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరో పిటిషన్ ఇచ్చారు. ‘గత కొద్దిరోజులుగా తన తండ్రి కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. సోమవారం నొప్పి ఎక్కువకావడంతో ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. అది గమనించి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మా నాన్న చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లు ఎప్పుడూ మా నాన్నను వేధింపులకు గురి చేయలేదు. కావున వారిపై ఎలాంటి చర్య తీసుకోవద్దు. ఇది నేను ఆరోగ్యంగా మానసికంగా ఉండి రాసి ఇస్తున్నాను’ అని పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తొలుత మోహన్‌రెడ్డే కారణమంటూ ఎందుకు ఫిర్యాదు చేశారని విలేకరులు ప్రశ్నించగా... మోహన్‌రెడ్డి బాధిత సంఘం సభ్యులు వచ్చి ఆయనపై లేనిపోనివి కల్పించి చెప్పడంతో వారి మాటలు నమ్మి పొరపాటుగా తప్పుడు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. నాకు సంబంధం లేదు : మోహన్‌రెడ్డి నారాయణరెడ్డి చావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సస్పైండైన ఏఎస్సై మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కొందరు వ్యక్తులు తనపై పై కక్షకట్టి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు. -
వారిది 3 దశాబ్దాల వైరం
వారి కోసం ఫ్యాక్షన్ కోరల్లో కూరుకుపోయిన ఎన్నో కుటుంబాలు ఇకపై టీడీపీ నేతలుగా చలామణి కానున్న దేవగుడి సోదరులు జీర్ణించుకోలేకపోతున్న గుండ్లకుంట వాసులు ఫ్యాక్షన్‌తో నలిగిపోయిన సుగమంచుపల్లె, చింతకుంట, కోడిగాండ్లపల్లె, కొండాయపల్లె, జంగాలపల్లె, జె.కొట్టాలపల్లె, సుద్దపల్లె, నాగరాజుపల్లె, పాలూరు, బిటిపాడు, చిన్నముడియం, చిన్నపసువుల, పెనికలపాడు ఇలా చెప్పుకుంటూపోతే చాలా గ్రామాలకు చెందిన టీడీపీ శ్రేణులు దేవగుడి బ్రదర్స్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప : ఆ రెండు కుటుంబాల వారు ఇన్నాళ్లూ ఉప్పు నిప్పులా జీవించారు. ఆధిపత్యం కోసం పరస్పర పోరు నడిపారు. వీరినే నమ్ముకొని వందలాది మంది ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి శల్యమయ్యారు. మరికొందరు ఇప్పటికీ జీవిత ఖైదీలుగా జైల్లో మగ్గుతున్నారు. ఫ్యాక్షన్‌కు నిలువెత్తు నిదర్శనంగా జమ్మలమడుగు నియోజకవర్గం నిలిచింది. తెలుగుదేశం పార్టీ వర్గీయులుగా గుండ్లకుంట శివారెడ్డి కుటుంబం కొనసాగుతుండగా వైరి వర్గంగా దేవగుడి నారాయణరెడ్డి కుటుంబం నిలిచింది. ఇలా మూడు దశాబ్దాలుగా గ్రామాల్లో ఆ రెండు కుటుంబాలకు చెందిన అనుచరుల మధ్య సైతం పరస్పర ఫ్యాక్షన్ నడిచింది. అంతటి చరిత్ర ఉన్న ఆ రెండు కుటుంబాలు ప్రస్తుతం పసువు జెండా నీడన చేరాయి. ‘గుండ్లకుంట శివారెడ్డి’ పేరు ఉచ్చరించగానే ఫ్యాక్షన్ రాజకీయాలు టక్కున గుర్తుకు వస్తాయి. 80వ దశకం పూర్తయ్యే వరకూ జమ్మలమడుగులో ఆయన హవా నడిచింది. జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో 1983, 85, 89లో జమ్మలమడుగు నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అనూహ్యంగా హైదరాబాద్‌లో హత్యకు గురయ్యారు. ఆపై వారసుడుగా శివారెడ్డి అన్న కుమారుడు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తెరపైకి వచ్చారు. 1994, 99లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి, చంద్రబాబు క్యాబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 1983 నుంచి 2004 వరకూ పొన్నపురెడ్డి కుటుంబానిదే పైచేయిగా నిలిచింది. కాగా, పుష్కరకాలంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి కుటుంబీకుల ఆధిపత్యం నడుస్తోంది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదినారాయణరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో అతి సునాయాసంగా టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని ఓడించారు. తర్వాత 2009, 2014లో సైతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎందరో నాయకుల తోడ్పాటు, మరెందరో కార్యకర్తల సహకారం అండగా నిలిచింది. పసుపు కండువా కప్పుకున్న దేవగుడి బ్రదర్స్.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పసువు కండువా ధరించారు. ఇప్పటివరకూ ఆ ప్రాంతంలో టీడీపీ అంటేనే పొన్నపురెడ్డి కుటుంబం. పొన్నపురెడ్డి కుటుంబం అంటే టీడీపీ అన్నట్లుగా ఉండేది. అలాంటి పరిస్థితిలో చదిపిరాళ్ల (దేవగుడి) బ్రదర్స్ టీడీపీలో చేరడాన్ని ఆ ప్రాంతపు టీడీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యక్తిగతంగా ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితిలో కొనసాగిన నేపథ్యమే ఇందుకు కారణంగా పలువురు భావిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల కారణంగా అనేక మంది హతులయ్యారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇప్పటికీ ఆ కుటుంబాలకు చెందిన అనుచరులు జీవిత ఖైదీలుగా వివిధ జైళ్లలో మగ్గుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో దేవగుడి సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం పొన్నపురెడ్డి వర్గీయులకు శరాఘాతంగా భావిస్తున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. కలిసి పనిచేయడం సాధ్యమేనా? నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. కంప్యూటర్ యుగంలో సైతం పాత గొడవలు విస్మరించాలని, పొన్నపురెడ్డి వర్గీయులతో కలుపుగోలుగా వెళ్లేందుకు సమ్మతమేనని ప్రకటించారు. వాస్తవంలో అది అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే చేరిక అంశం తెరపైకి రాగానే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. ఎందుకోసం? ఎవరికోసం? ఏం ఆశించి పార్టీలోకి వస్తున్నావని నిలదీశారు. కేశవరెడ్డి విద్యా సంస్థల యజమాని ఆస్తులు కాపాడుకోవడమే లక్ష్యం కాదా.. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని బట్టి ఆ కుటుంబాల మధ్య వైరం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఒక ఒరలో రెండు కత్తులు ఇమడడం కష్టమేనని పలువురు చెప్పుకొస్తున్నారు. ఫ్యాక్షన్ కారణంగా ఎన్నో ఇక్కట్లు పడ్డామని, ఆ ఇబ్బందులకు కారణమైన దేవగుడి బ్రదర్స్‌కు పార్టీలో ఎలా చోటు కల్పిస్తారంటూ నియోజకవర్గంలోని పలు గ్రామాల నేతలు టీడీపీ ఉన్నత స్థాయి నేతలను నిలదీస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఆయా గ్రామాల్లోని బాధితులు ఆ ఇరు కుటుంబాలతో కలిసి అడుగులు వేయడం అసాధ్యమేనని పలువురు విశ్వేషిస్తున్నారు. -
నారాయణరెడ్డికి వైఎస్సార్సీపీ ఘన నివాళి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి నారాయణరెడ్డికి జిల్లా ప్రముఖులు నివాళులర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురువారం ఉదయం రాజుపాళెం మండలం కొర్రపాడులోని ఆయన నివాసానికి వైఎస్సార్ జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేలు శివప్రసాదరెడ్డి, రఘురామిరెడ్డి, పార్టీ జిల్లా నేత సంబటూరు ప్రసాదరెడ్డి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. నారాయణరెడ్డి మృతదేహంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. -
అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు బంద్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు బంద్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంక్ యజమానులు, ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ సంయుక్తంగా బంద్ ప్రకటించాయి. దీంతో ఏపీలో 2,800 పెట్రోల్ బంక్ లు మూతపడనున్నాయి. ఈ కారణంగా ఇప్పటికే బంక్ ల వద్ద భారీగా వాహనదారులు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంక్ లు బంద్ ప్రకటించగా.. విశాఖ పెట్రోల్ బంక్ లు బంద్ లో పాల్గొనడం లేదని సమాచారం. ఈ విషయాన్ని విశాఖ పెట్రోల్ డీలక్స్ అసోసియేషన్ సెక్రటరీ నారాయణరెడ్డి తెలిపారు. -
వాకాటికి తప్పలేదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శాసన మండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డిని నెల్లూరు నుంచి లోక్‌సభ బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గురువారం సాయంత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ తన అభ్యర్థిని తేల్చడంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగే ప్రధాన అభ్యర్థులెవరో తేలిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఈయనకు బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించడం కోసం ఎదురు చూస్తున్న టీడీపీకి రాష్ట్ర విభజన కారణంగా ఆదాల ప్రభాకరరెడ్డి దొరికారు. కావలి ఎమ్మెల్యే స్థానం మీద కన్నేసి టీడీపీలో చేరాలనుకున్న ఆయన ఆశలు నెరవేరక పోవడంతో చివరకు లోక్‌సభకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో జిల్లాలో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికే బలమైన అభ్యర్థులు దొరకని స్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని లోక్‌సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచించారు. ఈ ప్రతిపాదనకు రామనారాయణరెడ్డి ససేమిరా అంటూ తాను మరోసారి ఆత్మకూరు శాసనసభ స్థానం నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. మరో అభ్యర్థి కోసం అన్వేషించిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి దిక్కయ్యారు. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఈ ప్రతిపాదన రాగానే వాకాటి తన నిరాసక్తతను వెల్లడించారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కోరారు. అయితే నెల్లూరు లోక్‌సభ బరిలోకి దూకడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో కాంగ్రెస్ హై కమాండ్ బలవంతంగా వాకాటి మెడలో గంట కట్టింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన పేరు ఖరారు చేశారు. అంతా అయ్యాక వాకాటి మళ్లీ ఉహూ అనకుండా ఉండేందుకు పార్టీ ముఖ్య నేతలు ఆయన్ను ఒప్పించే పనిలో పడ్డారు. తిరుపతికి చింతానే ఇదిలా ఉండగా తిరుపతి లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ చింతామోహన్ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన జాబితాలో ఆయన పేరు చేర్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఇదే స్థానం నుంచి పోటీ తప్పదనే అంచనాతో చింతా మోహన్ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. -
పోలీసుల అదుపులో ఏటీఎం నిందితుడు?
-
అనంత పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు?
బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ అనే మహిళపై దారుణంగా దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నల్లచెరువు ప్రాంతానికి చెందిన సైకో నారాయణరెడ్డి అనే వ్యక్తిని నిందితునిగా గుర్తించినట్లు సమాచారం. నారాయణరెడ్డి గతంలో 2008 సంవత్సరంలో ఓ మహిళ హత్య, చోరీ కేసులో నిందితుడు. పోలీసులు విడుదల చేసిన ఏటీఎం నిందితుడి ఫొటోతో.. సైకో నారాయణరెడ్డి పోలికలు చాలావరకు ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కూడా ఏటీఎం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పలుమార్లు కథనాలు వినిపించాయి గానీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేకపోయారు. పట్టుకున్న వారికి, సమాచారం ఇచ్చిన వారికి మూడు లక్షల రూపాయల నజరానా ఇస్తామని చెప్పినా కేసులో ముందడుగు పడలేదు. ఇప్పుడు ఈ కొత్త పేరు బయటకు వచ్చినా ఇది కూడా ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. -
ఎమ్మెల్సీ వాకాటి ఇళ్లపై ఐటీ దాడులు
చేనిగుంట (తడ), న్యూస్‌లైన్ : నెల్లూరు, తడ, సూళ్లూరుపేటలోని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇళ్లల్లో ఆదాయపన్నులశాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు రెండు కార్లలో వచ్చిన ఐటీ అధికారులు, పోలీసు బృంద సభ్యులు తడ మండలంలోని చేనిగుంటలోని వాకాటి స్వగృహానికి వెళ్లి సోదాలు చేశారు. ఇంటిలోపల ఉన్న పనివాళ్లతో సహా ఎవరినీ బయటకు, వెలుపలి వ్యక్తులను లోపలికి అనుమతించలేదు. మధ్యాహ్నం తర్వాత పనివాళ్లను మాత్రం వెలుపలకు పంపారు. అర్ధరాత్రి వరకు అణువణువు గాలించి వివరాలను నమోదు చేశారు. ఇంట్లో ఉన్న వాకాటి తల్లి బుజ్జమ్మ, ఆమెను చూసేందుకు విజయవాడ నుంచి వచ్చిన వాకాటి సోదరిని కూడా విచారించి నగలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇంట్లోనే బంధించినట్టుగా చేయడంతో వాకాటి తల్లి అనారోగ్యానికి గురై కలత చెందినట్టు తెలుసుకున్న గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార సేకరణకు చేనిగుంటకు వెళ్లిన మీడియాను అధికారులు ఇంటిలోనికి అనుమతించలేదు. వాకాటి అనుచరుడి ఇంటిపై... సూళ్లూరుపేట : ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు కళత్తూరు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇళ్లపై ఇన్‌కంటాక్స్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయాన్నే ఒక బృందం కిరణ్‌కమార్‌రెడ్డి ఇంటికి, మరో బృందం తడ మండలం చేనిగుంటలోని వాకాటి ఇంటికి వెళ్లింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ వాకాటి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడంపై పలు అనుమానా లు వ్యక్తమవుతున్నాయి.