అనంత పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు?
బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ అనే మహిళపై దారుణంగా దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నల్లచెరువు ప్రాంతానికి చెందిన సైకో నారాయణరెడ్డి అనే వ్యక్తిని నిందితునిగా గుర్తించినట్లు సమాచారం.
నారాయణరెడ్డి గతంలో 2008 సంవత్సరంలో ఓ మహిళ హత్య, చోరీ కేసులో నిందితుడు. పోలీసులు విడుదల చేసిన ఏటీఎం నిందితుడి ఫొటోతో.. సైకో నారాయణరెడ్డి పోలికలు చాలావరకు ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కూడా ఏటీఎం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పలుమార్లు కథనాలు వినిపించాయి గానీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేకపోయారు. పట్టుకున్న వారికి, సమాచారం ఇచ్చిన వారికి మూడు లక్షల రూపాయల నజరానా ఇస్తామని చెప్పినా కేసులో ముందడుగు పడలేదు. ఇప్పుడు ఈ కొత్త పేరు బయటకు వచ్చినా ఇది కూడా ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది.