వారిది 3 దశాబ్దాల వైరం
Published Wed, Feb 24 2016 12:33 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
వారి కోసం ఫ్యాక్షన్ కోరల్లో కూరుకుపోయిన ఎన్నో కుటుంబాలు
ఇకపై టీడీపీ నేతలుగా చలామణి కానున్న దేవగుడి సోదరులు
జీర్ణించుకోలేకపోతున్న గుండ్లకుంట వాసులు
ఫ్యాక్షన్‌తో నలిగిపోయిన సుగమంచుపల్లె, చింతకుంట, కోడిగాండ్లపల్లె, కొండాయపల్లె, జంగాలపల్లె, జె.కొట్టాలపల్లె, సుద్దపల్లె, నాగరాజుపల్లె, పాలూరు, బిటిపాడు, చిన్నముడియం, చిన్నపసువుల, పెనికలపాడు ఇలా చెప్పుకుంటూపోతే చాలా గ్రామాలకు చెందిన టీడీపీ శ్రేణులు దేవగుడి బ్రదర్స్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, కడప : ఆ రెండు కుటుంబాల వారు ఇన్నాళ్లూ ఉప్పు నిప్పులా జీవించారు. ఆధిపత్యం కోసం పరస్పర పోరు నడిపారు. వీరినే నమ్ముకొని వందలాది మంది ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి శల్యమయ్యారు. మరికొందరు ఇప్పటికీ జీవిత ఖైదీలుగా జైల్లో మగ్గుతున్నారు. ఫ్యాక్షన్‌కు నిలువెత్తు నిదర్శనంగా జమ్మలమడుగు నియోజకవర్గం నిలిచింది. తెలుగుదేశం పార్టీ వర్గీయులుగా గుండ్లకుంట శివారెడ్డి కుటుంబం కొనసాగుతుండగా వైరి వర్గంగా దేవగుడి నారాయణరెడ్డి కుటుంబం నిలిచింది. ఇలా మూడు దశాబ్దాలుగా గ్రామాల్లో ఆ రెండు కుటుంబాలకు చెందిన అనుచరుల మధ్య సైతం పరస్పర ఫ్యాక్షన్ నడిచింది. అంతటి చరిత్ర ఉన్న ఆ రెండు కుటుంబాలు ప్రస్తుతం పసువు జెండా నీడన చేరాయి.
‘గుండ్లకుంట శివారెడ్డి’ పేరు ఉచ్చరించగానే ఫ్యాక్షన్ రాజకీయాలు టక్కున గుర్తుకు వస్తాయి. 80వ దశకం పూర్తయ్యే వరకూ జమ్మలమడుగులో ఆయన హవా నడిచింది. జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో 1983, 85, 89లో జమ్మలమడుగు నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అనూహ్యంగా హైదరాబాద్‌లో హత్యకు గురయ్యారు. ఆపై వారసుడుగా శివారెడ్డి అన్న కుమారుడు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తెరపైకి వచ్చారు. 1994, 99లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి, చంద్రబాబు క్యాబినెట్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 1983 నుంచి 2004 వరకూ పొన్నపురెడ్డి కుటుంబానిదే పైచేయిగా నిలిచింది. కాగా, పుష్కరకాలంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి కుటుంబీకుల ఆధిపత్యం నడుస్తోంది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదినారాయణరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో అతి సునాయాసంగా టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని ఓడించారు. తర్వాత 2009, 2014లో సైతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎందరో నాయకుల తోడ్పాటు, మరెందరో కార్యకర్తల సహకారం అండగా నిలిచింది.
పసుపు కండువా కప్పుకున్న దేవగుడి బ్రదర్స్..
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పసువు కండువా ధరించారు. ఇప్పటివరకూ ఆ ప్రాంతంలో టీడీపీ అంటేనే పొన్నపురెడ్డి కుటుంబం. పొన్నపురెడ్డి కుటుంబం అంటే టీడీపీ అన్నట్లుగా ఉండేది. అలాంటి పరిస్థితిలో చదిపిరాళ్ల (దేవగుడి) బ్రదర్స్ టీడీపీలో చేరడాన్ని ఆ ప్రాంతపు టీడీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యక్తిగతంగా ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితిలో కొనసాగిన నేపథ్యమే ఇందుకు కారణంగా పలువురు భావిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల కారణంగా అనేక మంది హతులయ్యారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇప్పటికీ ఆ కుటుంబాలకు చెందిన అనుచరులు జీవిత ఖైదీలుగా వివిధ జైళ్లలో మగ్గుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో దేవగుడి సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం పొన్నపురెడ్డి వర్గీయులకు శరాఘాతంగా భావిస్తున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు.
కలిసి పనిచేయడం సాధ్యమేనా?
నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. కంప్యూటర్ యుగంలో సైతం పాత గొడవలు విస్మరించాలని, పొన్నపురెడ్డి వర్గీయులతో కలుపుగోలుగా వెళ్లేందుకు సమ్మతమేనని ప్రకటించారు. వాస్తవంలో అది అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే చేరిక అంశం తెరపైకి రాగానే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. ఎందుకోసం? ఎవరికోసం? ఏం ఆశించి పార్టీలోకి వస్తున్నావని నిలదీశారు. కేశవరెడ్డి విద్యా సంస్థల యజమాని ఆస్తులు కాపాడుకోవడమే లక్ష్యం కాదా.. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని బట్టి ఆ కుటుంబాల మధ్య వైరం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఒక ఒరలో రెండు కత్తులు ఇమడడం కష్టమేనని పలువురు చెప్పుకొస్తున్నారు.
ఫ్యాక్షన్ కారణంగా ఎన్నో ఇక్కట్లు పడ్డామని, ఆ ఇబ్బందులకు కారణమైన దేవగుడి బ్రదర్స్‌కు పార్టీలో ఎలా చోటు కల్పిస్తారంటూ నియోజకవర్గంలోని పలు గ్రామాల నేతలు టీడీపీ ఉన్నత స్థాయి నేతలను నిలదీస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఆయా గ్రామాల్లోని బాధితులు ఆ ఇరు కుటుంబాలతో కలిసి అడుగులు వేయడం అసాధ్యమేనని పలువురు విశ్వేషిస్తున్నారు.
Advertisement