నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్య
–వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్
–ధవళేశ్వరంలో రాస్తారోకో
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): చిత్తూరు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆరోపించారు. నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక నారాయణరెడ్డిని అతి పాశవికంగా హత్య చేశారన్నారు. టీడీపీకి హత్యా రాజకీయాలు కొత్తకాదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఆధ్వర్యంలోని ఇసుక మాఫియాపై పోరాడినందుకే పథకం ప్రకారం నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేశారన్నారు. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా నారాయణరెడ్డిని నిరాయుధుడిని చేశారని దుర్గేష్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక‌్షన్ రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజల్లో నారాయణరెడ్డికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్చుకోలేక హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హత్యా రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలులో జరుగుతున్న బంద్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. హత్యకు పాల్పడిన వారిని, హత్య చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బడుగు ప్రశాంత్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.