rastharoko
-
ఇది ఆమోదయోగ్యం కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చేపట్టే ఆందోళనలు, ధర్నాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జనజీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా రాస్తారోకోలు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అదే విధంగా ఆందోళనకారులను బహిరంగ ప్రదేశాల నుంచి ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, సాధారణ పౌరుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వారిపై చర్యలు చేపట్టేందుకు తమ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిర్ధారించిన, తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ధర్నాలు చేసుకోవాలని నిరసనకారులకు స్పష్టం చేసింది. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతేడాది ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.(చదవండి: అరెస్ట్ చేయకపోవడం సీరియస్ విషయం!) ఈ నేపథ్యంలో షాహిన్‌బాగ్- కాళింది కుంజ్ మార్గంలో రాస్తారోకో వల్ల జనజీవనానికి ఆటంకం కలిగిందని పేర్కొంటూ న్యాయవాది అమిత్ సాహ్ని ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, అయితే వారి కారణంగా ఇతరులకు ఇబ్బంది కలగుకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ నిరసన వ్యక్తం చేసేందుకు బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడం ఆమోదయోగ్యం కాదు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టవచ్చు. ఇందుకు సంబంధించిన విధానాలపై ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీటిని అమలు చేసేందుకు కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు’’అని పేర్కొంది. -
ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో అన్యాయం
- రైతన్నల కన్నెర్ర - జాతీయ రహదారిపై రాస్తారోకో - వ్యవసాయాధికారిని చుట్టుముట్టిన రైతులు బత్తలపల్లి (ధర్మవరం ): ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో అన్యాయం జరిగిందని బత్తలపల్లి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. శనివారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బైఠాయించి, రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. బత్తలపల్లి మండలంలోని 10,775 మంది రైతులకు రూ.19.17 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో దాదాపు 7,500 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడానికి ట్రెజరీకి పంపినట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అయితే మండలంలోని మాల్యవంతం పంచాయతీకి చెందిన ఐదు గ్రామాల పరిధిలో దాదాపుగా 1,500 మంది రైతులకు ఖాతాలు ఉన్నాయి. వీరిలో వంద మంది రైతులకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ మొత్తం జమ అయ్యింది. మిగిలిన రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అందులోనూ రావాల్సిన మొత్తం కంటే తక్కువగా ఖాతాల్లో జమ అయ్యింది. బాధితులందరూ వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడా అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించారు. వ్యవసాయాధికారి పెన్నయ్య, ఎంపీఈఓను బత్తలపల్లి కూడలికి తీసుకొచ్చారు. రైతులతో కలిసి రోడ్డుపైన కూర్చోబెట్టి తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకూర్చున్నారు. అనంతరం రైతులందరూ పెద్ద ఎత్తున రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకొని వ్యవసాయశాఖ ఏడీఏ విశ్వనాథ్, తహసీల్దార్ గోపాలకృష్ణ అక్కడికి చేరుకొని రైతులకు సర్దిచెప్పారు. అయినా రైతులు ఆందోళన విరమించలేదు. సీపీఐ నాయకులు సీపీఐ నాయకులు కమతం కాటమయ్య, సీపీఎం నాయకులు వడ్డె రమేష్ అక్కడికి చేరుకొని రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన సీఐ శివరాముడు రైతులు, అధికారులతో మాట్లాడారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రెండుగంటలపాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. -
నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్య
–వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ –ధవళేశ్వరంలో రాస్తారోకో ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): చిత్తూరు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆరోపించారు. నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక నారాయణరెడ్డిని అతి పాశవికంగా హత్య చేశారన్నారు. టీడీపీకి హత్యా రాజకీయాలు కొత్తకాదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఆధ్వర్యంలోని ఇసుక మాఫియాపై పోరాడినందుకే పథకం ప్రకారం నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేశారన్నారు. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా నారాయణరెడ్డిని నిరాయుధుడిని చేశారని దుర్గేష్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజల్లో నారాయణరెడ్డికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్చుకోలేక హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హత్యా రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలులో జరుగుతున్న బంద్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. హత్యకు పాల్పడిన వారిని, హత్య చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బడుగు ప్రశాంత్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు. -
దౌల్తాబాద్‌ను మండలకేంద్రం చేయాలి
అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన, రాస్తారోకో స్తంభించిన రాకపోకలు హత్నూర: మేజర్ గ్రామ పంచాయతీ దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేయాలంటూ బుధవారం గ్రామస్తులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దౌల్తాబాద్ సర్పంచ్ ఎల్లదాస్, కాసాల సర్పంచ్ భర్త పూసల సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీ భర్త సురేందర్ గౌడ్ తెలంగాణతల్లి చౌరస్తా వద్ద ఆమరణ నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ముందుగా వారు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో దౌల్తాబాద్ బంద్ నిర్వహిస్తూ తెలంగాణతల్లి చౌరస్తా వద్దకు చేరుకొని అంబేద్కర్, తెలంగాణతల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం హత్నూర మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తే దౌల్తాబాద్‌ను నూతన మండల కేంద్రం చేయాలంటూ ముగ్గురు టీఆర్ఎస్ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. హత్నూర మండలాన్ని విడగొట్టొవద్దని, ఒక వేళ విడగొడితే దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేసి, సంగారెడ్డి జిల్లాలో కలపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. సాయంత్రం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి , టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిషన్‌రెడ్డి, మరికొంత మంది నాయకులు ఆమరణ నిరాహారదీక్ష శిబిరం వద్దకు చేరుకొని దీక్ష విరమింపజేయాలని సూచించారు. దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేయడానికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హామీ ఇచ్చి, నిమ్మరసం ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమాల్లో అఖిలపక్షం నాయకులు కొన్యాల వెంకటేశం, హకీం, శ్రీనివాస్, ఇబ్రహిం, మహేష్, సాజిద్‌తోపాటు ఆయా పార్టీల నాయకులు వ్యాపారస్తులు స్వచ్ఛదంగా బంద్ పాటించి దీక్షకు మద్దతు పలికారు. దౌల్తాబాద్ చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్‌ట్యాంక్‌పైకి ఆరుగురు యువకులు ఎక్కి దౌల్తాబాద్‌ను మండలంగా ప్రకటించాలని ఆందోళన చేపట్టడంతో ఎస్సై బాల్‌రెడ్డి వారికి నచ్చజెప్పి కిందకు దింపారు. చింతల్‌చెరువును మండలం చేయాలంటూ రాస్తారోకో మండలంలోని చింతల్ చెరువును మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వడ్డెపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. హత్నూర మండలాన్ని విడగొట్టొవద్దని, ఒక వేళ విడదీస్తే చింతల్‌చెరువును మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరు, దౌల్తాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని రాస్తారోకోను విరమింపజేశారు. సిరిపురను విడదీయొద్దు హత్నూర మండలంలో ఉన్న సిరిపుర గ్రామ పంచాయతీని నూతనంగా ఏర్పడే చిలిప్‌చెడ్ మండలంలో కలపవద్దని అఖిలపక్షం నాయకులు సిరిపురలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. -
రామన్నపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
రామన్నపేట : అభివృద్ధిలో సమతుల్యను పాటించడానికి ప్రభుత్వం రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో చిట్యాల–భువనగిరి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్లేశంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు నియోజకవర్గ, తాలుకా కేంద్రాలుగా విరజిల్లిన రామన్నపేటను పాలకులు వెనుకబాటుకు గురి చేశారని ఆరోపించారు. రామన్నపేట, చౌటుప్పల్, వలిగొండ, మోత్కూరు, వలిగొండ తదితర మండలాలను కలుపుతూ రామన్నపేట కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. దాదాపు అన్నిశాఖలకు సంబంధించిన సబ్ డివిజన్ కార్యాలయాలు రామన్నపేటలో పని చేస్తున్నాయన్నారు. అందుకే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే రామన్నపేట అన్ని విధాలా అభివృద్ధే అవకాశం ఉంటుందన్నారు. గంటపాటు నిర్వహించిన రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీయూవీ నాయకులు ఊట్కూరి నర్సింహ, ఆకవరపు మధుబాబు,గర్దాసు సురేష్, సాల్వేరు అశోక్, కందుల హన్మంత్, ఎస్కే చాంద్, బీకే మూర్తి, జెల్ల వెంకటేశం, వనం చంద్రశేఖర్, నీల ఐలయ్య, గంగాపురం యాదయ్య, కొమ్ము యాదయ్య, బొడ్డు అల్లయ్య, పోతరాజు శంకరయ్య, వనం భిక్షపతి, శివరాత్రి సమ్మయ్య, పాల్వంచ శంకర్, నక్క యాదయ్య, ఎండీ జమీరుద్దిన్, దండుగల సమ్మయ్య, పబ్బతి లింగయ్య, ఎండీ గౌస్, కూనూరు సుధాకర్, సుదర్శన్, మహాలింగం, సహదేవ్, తోటకూరి అంజయ్య, దండుగల సమ్మయ్య పాల్గొన్నారు. -
ముగిసిన బంద్
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అఖిలపక్ష నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాసెంటర్‌లో కోదాడ– మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఉద్యోగ జేఏసీ నాయకులు యరగాని నాగన్నగౌడ్, తన్నీరు మల్లికార్జున్, గొట్టె రామయ్య, అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, చావా కిరణ్మయి, వేముల శేఖర్‌రెడ్డి, శీలం శ్రీను, పాలకూరి బాబు, గూడెపు శ్రీనివాస్, మేకల నాగేశ్వరరావు, చిట్యాల అమర్నాథరెడ్డి, ఎంఏ.మజీద్, బాచిమంచి గిరిబాబు, జడ రామకృష్ణ, పిల్లి మల్లయ్య, గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, రౌతు వెంకటేశ్వరరావు, శీలం¯ éగరాజు, కుక్కడపు మహేష్, కలకుంట్ల రామయ్య, పీవీ.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో... పట్టణంలోని ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలోఎస్కె.మన్సూర్‌అలీ, ఎస్కే. సైదా, షేక్ అక్బర్, ఎండి.మొయిన్, ఎండి. రహీం, రఫీ, హసన్మియా, జానీమియా, బడేమియా, బాజీ, సుభానీ, ఖాసిం పాల్గొన్నారు. -
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ, అన్ని అర్హతలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డివిజన్ కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. భారీ వర్షంలో సైతం సుమారు 2 రెండు గంటల పాడు రాస్తారోకో చేయడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎండి.నిజాముద్దీన్, తన్నీరు మల్లికార్జున్‌రావు, గొట్టె వెంకట్రామయ్య, యరగాని నాగన్నగౌడ్, ఎంఏ.మజీద్, ఎస్కె.సైదా, అట్లూరి హరిబాబు, చావా కిరణ్మయి, రౌతు వెంకటేశ్వరరావు, ఎస్డి.రఫీ,చిలకరాజు లింగయ్య, పండ్ల హుస్సేన్‌గౌడ్, కోల శ్రీను, సామల శివారెడ్డి, గూడెపు శ్రీనివాస్, ఎం.పెదలక్ష్మీనర్సయ్య, జడ రామకృష్ణ,పోతుల జ్ఞానయ్య, పిల్లి మల్లయ్య, యల్లావుల రాములు, పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, పానుగంటి పద్మ జేఏసీ నాయకులు పీవీ.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
తాగునీటి కోసం రాస్తారోకో
ఆత్మకూర్ (నర్వ): అమరచింత గ్రామంలోని సంతోష్‌నగర్ కాలనీ వాసులకు వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఆ కాలనీ వాసులు బుధవారం రోడెక్కి రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి చెందిన పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ర హదారిపై వాహన రాకపోకలను అడ్డుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి వ్యవస్థ అçస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వారంరోజుల నుంచి నీటి కష్టాలను అనుభవిస్తున్న పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడమేమిటని నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో మరికల్ – ఆత్మకూర్ రహదారిపై వాహన రాకపోకలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. ఈ మేరకు ఉపసర్పంచు మమతసత్యనారాయణ ఆందోళన కారుల వద్దకు వచ్చి తాగునీరు సకాలంలో సరఫరా అయ్యేల తనవంతు కషి చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. -
ఈ బాధలు మేం పడలేం..!
సమస్యలు పరిష్కరించాలంటూ రాస్తారోకో రోడ్డుపై బైఠాయించిన స్థానికులు స్తంభించిన ట్రాఫిక్ ఆనందపేట : సమస్యలు పరిష్కరిం చాలంటూ పొన్నూరు రోడ్డు వాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు ట్రాఫి క్ స్తంభించిపోయింది. రోడ్డు సమస్యను పరిష్కరించాలని, కమిషనర్ రావాలని స్థానికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాంట్రాక్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసు లు రంగంలోకి దిగి స్థానికులకు సర్దిచెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రోడ్డు నిర్మా ణం పనులు నత్తనడకన సాగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వెల్లడించారు. ఇళ్ల ముందు చేరిన మురుగునీటితో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని చెప్పారు. రాకపోకలు సాగించడం నరకంగా మారిందని వాపోయారు. రెండు నెలలుగా కరెంటు కోతలతో అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు మురుగునీటిలో జారిపడి గాయాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. -
‘నీరు-చెట్టు’ పేరుతో పొట్టకొట్టొద్దు
పర్చూరు : మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని ‘నీరు-చెట్టు’ పేరుతో తమ పొట్టకొట్టొద్దంటూ రైతులు పర్చూరు- చీరాల ఆర్అండ్బీ రోడ్డుపై శనివారం రాస్తారోకో చేశారు. నాగులపాలెం గ్రామ పరిధిలోని 352/5 సర్వే నంబర్లోని 22.85 ఎకరాల్లో నీరు- చెట్టు కార్యక్రమంలో భాగంగా కుంట తవ్వేందుకు అధికారులు సర్వేకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న 30 కుటుంబాల సాగుదారులు రోడ్డుపై బైఠాయించారు. ఆదివాసీ సంక్షేమ సంఘం పర్చూరు నియోజకవ ర్గ కమిటీ నాయకులు, రైతులు మాట్లాడుతూ సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీలు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో కుంట తవ్వేందుకు నాగులపాలెం పంచాయతీ కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తీర్మానం చేసిందని చెప్పారు. జీవనాధారమైన భూములను లాక్కొని పొట్టలు కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో కుంటలు తవ్వి మట్టిని అమ్ముకోవాలని చూస్తున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. హనుమంతరావు మాట్లాడుతూ వేల ఎకరాలు కబ్జా చేసినవారి వదిలేసి పేదల భూములు తీసుకోవడం అన్యాయమన్నారు. రాస్తారోకోతో రోడ్డు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.