dhawaleswaram
-
గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ
సాక్షి, రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. నిరంతరం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వరద ఉధృతిపై పర్యవేక్షణ జరుగుతోంది. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో, అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
ఉధృతంగానే గోదారి
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఎగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతుండడంతో గోదావరిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద 28.1 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి నుంచి 13,58,163 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకోవడంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం ఒంటిగంటకు 14.20 అడుగులకు చేరుకుంది. అక్కడి నుంచి రాత్రి 7 గంటల వరకూ నిలకడగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, ఎటపాక, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం తదితర మండలాల్లో 168 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లోని 216 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తంగా 74 వేల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాధితులకు ఆహార పొట్లాలు, నీటి ప్యాకెట్లు, బియ్యం, కిరోసిన్, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేశారు. పూర్తిగా నీట మునిగిన గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తూర్పు గోదావరిలో సుమారు 4,190 హెక్టార్లలో వరి చేలు, 1,198 హెక్టార్లలో ఉద్యాన పంటలు పశ్చిమలో 4,746 హెక్టార్లలో పంటలు వరదలో మునిగిపోయాయి. పలుచోట్ల రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్ సరఫరా ఆగిపోయి కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. కాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద వల్ల ముంపునకు గురైన, నీరు చేరిన గ్రామాల్లోని బాధితులకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను టీఆర్ –27 కింద డ్రా చేసుకునేందుకు రెండు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతించింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సబ్ కలెక్టర్ సలీమ్‌ఖాన్‌లు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తాగునీటి ఇబ్బందులు రానీయకండి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి టెలికాన్ఫరెన్స్ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వరదల కారణంగా ముంపునకు గురైన గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. ఆదివారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఈఎన్సీ సుబ్బారెడ్డిలతో కలసి మూడు జిల్లాల కలెక్టర్లతో పాటు జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీవోలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వరద ప్రాంతాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగకుండా మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయడంతో పాటు గ్రామాల్లో నివాసిత ప్రాంతాల మధ్య మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలపై అక్కడి ప్రజలకు అవగాహన పెంచడం, పందులు వంటి వాటిని గ్రామాలకు దూరంగా ఉంచడం వంటి విషయాల్లో మండల స్థాయి అధికారుల ద్వారా తగిన చర్యలు చేపట్టాలన్నారు. పోటెత్తిన కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్ట్/రాయచూరు రూరల్: శ్రీశైలం జలాశయానికి సోమవారం వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం పేర్కొంది. గత 4 రోజులుగా జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 857 అడుగులకు, నీటి నిల్వ 98.9024 టీఎంసీలకు చేరింది. నీటి మట్టం 854 అడుగులు దాటడంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదన కు జనరేటర్లను సిద్ధం చేశారు. ఆదివారం ఆల్మట్టి డ్యాం నుంచి ఏకంగా 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని నదికి వదిలారు. -
నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్య
–వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ –ధవళేశ్వరంలో రాస్తారోకో ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): చిత్తూరు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆరోపించారు. నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక నారాయణరెడ్డిని అతి పాశవికంగా హత్య చేశారన్నారు. టీడీపీకి హత్యా రాజకీయాలు కొత్తకాదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఆధ్వర్యంలోని ఇసుక మాఫియాపై పోరాడినందుకే పథకం ప్రకారం నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేశారన్నారు. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా నారాయణరెడ్డిని నిరాయుధుడిని చేశారని దుర్గేష్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజల్లో నారాయణరెడ్డికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్చుకోలేక హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హత్యా రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలులో జరుగుతున్న బంద్‌కు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. హత్యకు పాల్పడిన వారిని, హత్య చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బడుగు ప్రశాంత్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు. -
ధవళేశ్వరంలో దోపిడీ
– లంచం లేనిదే పనిచేయని అధికారులు – జనన, మరణ ధ్రువపత్రాలకు వెయ్యి ఇచ్చుకోవాల్సిందే – కరెన్సీ కదిలిస్తే ఇంటిపన్ను తగ్గుతుంది.. – కమర్షియల్ భవనాలు రెసిడెన్సియల్గా మారిపోతాయి – కేంద్ర బిందువుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగిని – అంతా ఆమె కనుసన్నల్లోనే.... సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం మేజర్ పంచాయతీలోని ప్రజలను పంచాయతీ అధికారులు, సిబ్బంది అడ్డగోలుగా దోచేస్తున్నారు. విలీన ప్రతిపాదనల నేపథ్యంలో గత నాలుగేళ్లుగా పంచాయతీ పాలక మండలికి ఎన్నికల జరగకపోవడంతో అక్కడి ఉద్యోగులు ఆడింది ఆటగా సాగుతోంది. పాలక మండలి లేకపోవడంతో సిబ్బంది ప్రతి పనికో రేటు కట్టి మరీ వసూళ్లకు దిగుతున్నారు. ఇంటి పన్నులను తగ్గిస్తామని ... నీటి కుళాయి కనెక్షన్ ... జనన, మరణ ధ్రువ పత్రాలు ఇలా ఏది కావాలన్నా వేల రూపాయలు తీయాల్సిందే. ఇలా ప్రతి పనికో రేటు కట్టి మరీ సిబ్బంది దందాలకు దిగడంతో లబ్ధిదారులు అల్లాడిపోతున్నారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో పంచాయతీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సంబంధితాధికారులను నిలదీయడంతో ఒక్కొక్కటిగా సిబ్బంది వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. లంచం ఇవ్వనిదే ధ్రువీకరణ పత్రం రాదు... మేజర్ పంచాయతీ కావడంతో ప్రతి నెలా జనన, మరణ, సాల్వెన్సీ ధ్రువపత్రాలు దాదాపు 50 వరకు మంజూరు చేస్తున్నారు. ఒక్కో పత్రం జారీ చేయడానికి నిబంధనల ప్రకారం రూ.100 చలానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే పంచాయతీ సిబ్బంది రూ.1000 వసూలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు అక్కడకు వెళ్లిన సమయంలో అప్పటికే మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్న కిరణ్ అనే వ్యక్తి వచ్చాడు. తన వద్ద పంచాయతీ సిబ్బంది అదనంగా రూ.800 తీసుకున్నాడని చెప్పారు. ఇలా ప్రతి ధ్రువపత్రం జారీ చేయడానికి సిబ్బంది మామూళ్లు వసూలు చేయడం రివాజుగా మారిపోయిందని బాధితులు వాపోతున్నారు. .కుళాయి కనెక్షన్ కావాలన్నా... కుళాయి కనెక్షన్ కావాలని వచ్చిన ప్రజలు నిర్ణీత ఫీజు కన్నా ఇంటిని బట్టీ అదనంగా రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు సిబ్బందికి సమర్పించుకోవాలి. లేదంటే కనెక్షన్ రాదు. గ్రామానికి చెందిన ఆకుల ప్రకాష్ అనే వ్యక్తి వద్ద కుళాయి కనెక్షన్‌కు రూ.5 వేలు బదులు రూ.6 వేలు తీసుకున్నారు. ఇదే విషయం ప్రకాష్ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినా బాధ్యుల నుంచి సమాధానం కరువైంది. పైసా కొట్టు.. పన్ను తగ్గించుకో... పెరిగిన ఇంటి పన్నులను కూడా పంచాయతీ సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇంటి పన్నులు భారీగా పెరగడంతో ప్రజలు కార్యాలయానికి క్యూ కట్టారు. ఇంటి పన్నులు తగ్గిస్తామని చెబుతూ చేతివాటానికి దిగడం ప్రారంభించారు. కాటన్పేటకు చెందిన రెడ్డి అనే వ్యక్తి వద్ద ఇంటి పన్ను తగ్గిస్తామని చెప్పి రూ.5 వేలు తీసుకున్నారు. అయినా పన్ను తగ్గించలేదని అతను వాపోయాడు. గ్రామంలో పెద్ద వ్యాపార భవనాలు, సినిమా హాళ్ల కొలతలు తక్కువగా చూపించి తక్కువ పన్నులు చేసిన ఘటనలూ ఉన్నాయి. మరికొన్నింటిని కమర్షియల్ నుంచి నివాస భవనాలుగా మార్పు చేసి పన్నులు వేసి దండుకున్నారన్న విమర్శలున్నాయి. వసూళ్లంతా ఆమె చేతికి.... ఇంటి పన్నులు, ధ్రువపత్రాలు, కుళాయి కనెక్షన్లలో వసూలు చేసిన సొమ్మును అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది కార్యాలయంలో పని చేసే లక్ష్మి అనే మహిళకు అందజేశామని వైఎస్సార్సీపీ నేతల వద్ద కొంతమంది వసూళ్లు చేసిన కిందిస్థాయి ఉద్యోగులు అంగీకరించడం గమనార్హం. శ్రీనివాసరావు అనే ఉద్యోగి దోసకాయలపల్లి కార్యదర్శిగా పని చేస్తున్నప్పుడు అక్కడ ఈమె పనిచేసేవారు. ఈయన ధవళేశ్వరం కార్యదర్శిగా బదిలీపై వచ్చారు. ఈమె కూడా ఇక్కడికి బదిలీ చేయించుకొని మరీ దందా ప్రారంభించడం గమనార్హం. డివిజనల్ పంచాయతీ అధికారికే ఏసీ సౌకర్యం ఉండదు. అలాంటిది పంచాయతీ కార్యదర్శి ఏసీ ఏర్పాటు చేసుకోవడం పట్ల పలు విమర్శలున్నాయి. ఈ ఆరోపణలపై ‘సాక్షి’ కార్యదర్శి శ్రీనివాసరావుని వివరణ కోరగా సమాధానం దాటవేశారు. ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నాం.. ధవళేశ్వరం పంచాయతీ అధికారులపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. ఇంటి పన్నుల కట్టిన వారి వివరాలు తీసుకున్నాం. వారి ఇంటి వద్దకు వెళ్లి బహిరంగ విచారణ చేస్తాం. కార్యాలయంలో ఏసీ పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధం. దోసకాయలపల్లిలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసి లక్ష్మి అనే మహిళ అక్కడ ఉద్యోగం మానుకుని, తాజాగా రెండేళ్ల క్రితం ధవళ్వేరంలో చేరింది. గత నెల 31తో కాంట్రాక్టు పూర్తయింది. ఆమెను నిలిపివేయాలని ఆదేశించాం. – వరప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి, రాజమహేంద్రవరం. -
పెరిగిన గోదావరి ఉధృతి
ధవళేశ్వరం: గోదావరి ఉధృతి బుధవారం మరింత పెరగడంతో బ్యారేజ్ నుంచి బుధవారం సాయంత్రం 4,15,308 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.50అడుగులకు చేరుకుంది. స్థానికంగా కూడా వర్షాలు పడుతుండటంతో డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. తూర్పు డెల్టాకు 1800, మధ్య డెల్టాకు 2200, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. కాళేశ్వరంలో 7.11 మీటర్లు, పేరూరులో 10.01 మీటర్లు, దుమ్ముగూడెంలో 9.15 మీటర్లు, భద్రాచలంలో 32 అడుగులు, కూనవరంలో 10.82 మీటర్లు, కుంటలో 7.10 మీటర్లు, కొయిదాలో 14.29 మీటర్లు, పోలవరంలో 9.56 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.33 మీటర్ల నీటిమట్టాలు నమోదయ్యాయి. -
'చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి'
హైదరాబాద్:తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సంభవించిన ప్రమాద ఘటనలో ప్రాణాలతో బతికి బయటపడ్డ చిన్నారికి మెరుగైన చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాద ఘటనపై సహాయక చర్యలను చేపట్టాలని డిప్యూటీ సీఎం చిన రాజప్పను బాబు ఆదేశించారు. దీంతో ప్రమాద ఘటనపై చిన రాజప్ప విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను తెలపాలని రాజమండ్రి అర్బన్ ఎస్పీని కోరారు. కాగా, మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు త్వరగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.శుక్రవారం రాత్రి సమయంలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనలో 22 మంది మృతి చెందగా, ఓ చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్పంగా గాయపడిన ఈగల కిరణ్ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
రాజమండ్రి:ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సంభవించిన ఘోర ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదకారణాలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 21 మంది మృతి దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 23మంది ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం వాసులు తీర్థయాత్రల్లో భాగంగా విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున తిరిగి వస్తుండగా శుక్రవారం రాత్రి సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కూడా మృతి చెందాడు. దాదాపు 50 అడుగుల పైనుంచి పడటంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్ల సాయంతో వెలికి తీశారు.