
సాక్షి, రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. నిరంతరం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వరద ఉధృతిపై పర్యవేక్షణ జరుగుతోంది. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో, అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment