ధవళేశ్వరంలో దోపిడీ
ధవళేశ్వరంలో దోపిడీ
Published Wed, Apr 26 2017 11:24 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
– లంచం లేనిదే పనిచేయని అధికారులు
– జనన, మరణ ధ్రువపత్రాలకు వెయ్యి ఇచ్చుకోవాల్సిందే
– కరెన్సీ కదిలిస్తే ఇంటిపన్ను తగ్గుతుంది..
– కమర్షియల్ భవనాలు రెసిడెన్సియల్‌గా మారిపోతాయి
– కేంద్ర బిందువుగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని
– అంతా ఆమె కనుసన్నల్లోనే....
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం మేజర్ పంచాయతీలోని ప్రజలను పంచాయతీ అధికారులు, సిబ్బంది అడ్డగోలుగా దోచేస్తున్నారు. విలీన ప్రతిపాదనల నేపథ్యంలో గత నాలుగేళ్లుగా పంచాయతీ పాలక మండలికి ఎన్నికల జరగకపోవడంతో అక్కడి ఉద్యోగులు ఆడింది ఆటగా సాగుతోంది. పాలక మండలి లేకపోవడంతో సిబ్బంది ప్రతి పనికో రేటు కట్టి మరీ వసూళ్లకు దిగుతున్నారు. ఇంటి పన్నులను తగ్గిస్తామని ... నీటి కుళాయి కనెక‌్షన్ ... జనన, మరణ ధ్రువ పత్రాలు ఇలా ఏది కావాలన్నా వేల రూపాయలు తీయాల్సిందే. ఇలా ప్రతి పనికో రేటు కట్టి మరీ సిబ్బంది దందాలకు దిగడంతో లబ్ధిదారులు అల్లాడిపోతున్నారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో పంచాయతీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సంబంధితాధికారులను నిలదీయడంతో ఒక్కొక్కటిగా సిబ్బంది వ్యవహారాలు బయటకు వస్తున్నాయి.
లంచం ఇవ్వనిదే ధ్రువీకరణ పత్రం రాదు...
మేజర్ పంచాయతీ కావడంతో ప్రతి నెలా జనన, మరణ, సాల్వెన్సీ ధ్రువపత్రాలు దాదాపు 50 వరకు మంజూరు చేస్తున్నారు. ఒక్కో పత్రం జారీ చేయడానికి నిబంధనల ప్రకారం రూ.100 చలానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే పంచాయతీ సిబ్బంది రూ.1000 వసూలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు అక్కడకు వెళ్లిన సమయంలో అప్పటికే మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్న కిరణ్ అనే వ్యక్తి వచ్చాడు. తన వద్ద పంచాయతీ సిబ్బంది అదనంగా రూ.800 తీసుకున్నాడని చెప్పారు. ఇలా ప్రతి ధ్రువపత్రం జారీ చేయడానికి సిబ్బంది మామూళ్లు వసూలు చేయడం రివాజుగా మారిపోయిందని బాధితులు వాపోతున్నారు.
.కుళాయి కనెక‌్షన్ కావాలన్నా...
కుళాయి కనెక‌్షన్ కావాలని వచ్చిన ప్రజలు నిర్ణీత ఫీజు కన్నా ఇంటిని బట్టీ అదనంగా రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు సిబ్బందికి సమర్పించుకోవాలి. లేదంటే కనెక‌్షన్ రాదు. గ్రామానికి చెందిన ఆకుల ప్రకాష్ అనే వ్యక్తి వద్ద కుళాయి కనెక‌్షన్‌కు రూ.5 వేలు బదులు రూ.6 వేలు తీసుకున్నారు. ఇదే విషయం ప్రకాష్ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినా బాధ్యుల నుంచి సమాధానం కరువైంది.
పైసా కొట్టు.. పన్ను తగ్గించుకో...
పెరిగిన ఇంటి పన్నులను కూడా పంచాయతీ సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇంటి పన్నులు భారీగా పెరగడంతో ప్రజలు కార్యాలయానికి క్యూ కట్టారు. ఇంటి పన్నులు తగ్గిస్తామని చెబుతూ చేతివాటానికి దిగడం ప్రారంభించారు. కాటన్‌పేటకు చెందిన రెడ్డి అనే వ్యక్తి వద్ద ఇంటి పన్ను తగ్గిస్తామని చెప్పి రూ.5 వేలు తీసుకున్నారు. అయినా పన్ను తగ్గించలేదని అతను వాపోయాడు. గ్రామంలో పెద్ద వ్యాపార భవనాలు, సినిమా హాళ్ల కొలతలు తక్కువగా చూపించి తక్కువ పన్నులు చేసిన ఘటనలూ ఉన్నాయి. మరికొన్నింటిని కమర్షియల్ నుంచి నివాస భవనాలుగా మార్పు చేసి పన్నులు వేసి దండుకున్నారన్న విమర్శలున్నాయి.
వసూళ్లంతా ఆమె చేతికి....
ఇంటి పన్నులు, ధ్రువపత్రాలు, కుళాయి కనెక‌్షన్లలో వసూలు చేసిన సొమ్మును అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది కార్యాలయంలో పని చేసే లక్ష్మి అనే మహిళకు అందజేశామని వైఎస్సార్‌సీపీ నేతల వద్ద కొంతమంది వసూళ్లు చేసిన కిందిస్థాయి ఉద్యోగులు అంగీకరించడం గమనార్హం. శ్రీనివాసరావు అనే ఉద్యోగి దోసకాయలపల్లి కార్యదర్శిగా పని చేస్తున్నప్పుడు అక్కడ ఈమె పనిచేసేవారు. ఈయన ధవళేశ్వరం కార్యదర్శిగా బదిలీపై వచ్చారు. ఈమె కూడా ఇక్కడికి బదిలీ చేయించుకొని మరీ దందా ప్రారంభించడం గమనార్హం. డివిజనల్ పంచాయతీ అధికారికే ఏసీ సౌకర్యం ఉండదు. అలాంటిది పంచాయతీ కార్యదర్శి ఏసీ ఏర్పాటు చేసుకోవడం పట్ల పలు విమర్శలున్నాయి. ఈ ఆరోపణలపై ‘సాక్షి’ కార్యదర్శి శ్రీనివాసరావుని వివరణ కోరగా సమాధానం దాటవేశారు.
ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నాం..
ధవళేశ్వరం పంచాయతీ అధికారులపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. ఇంటి పన్నుల కట్టిన వారి వివరాలు తీసుకున్నాం. వారి ఇంటి వద్దకు వెళ్లి బహిరంగ విచారణ చేస్తాం. కార్యాలయంలో ఏసీ పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధం. దోసకాయలపల్లిలో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసి లక్ష్మి అనే మహిళ అక్కడ ఉద్యోగం మానుకుని, తాజాగా రెండేళ్ల క్రితం ధవళ్వేరంలో చేరింది. గత నెల 31తో కాంట్రాక్టు పూర్తయింది. ఆమెను నిలిపివేయాలని ఆదేశించాం.
– వరప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి, రాజమహేంద్రవరం.
Advertisement