అవినీతి గుట్టు రట్టు!
అవినీతి గుట్టు రట్టు!
Published Mon, Aug 7 2017 11:12 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
నగర పంచాయతీలో పనుల మాయజాలం
విజిలెన్స్ తనిఖీలో బయటపడుతోన్న అక్రమాలు
ముమ్మిడివరం : నగర పంచాయతీలో అవినీతి.. విజిలెన్స్ తనిఖీల్లో తవ్వేకొద్దీ బయటపడుతోంది. అవినీతి ఆరోపణలపై జూలై 6 నుంచి విజిలెన్స్, ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నుంచి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అక్రమ లేఅవుట్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు వరకు అవకతవకలు చోటుచేసుకున్నట్టు సమాచారం. దీంతో ఇక్కడి పరిస్థితిపై విజిలెన్స్ అధికారులు జల్లెడ పడుతున్నారు. మూడేళ్లలో రూ.4 కోట్ల వరకు అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు ఆందడంతో ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు పర్యాయాలు కార్యాలయంలో వివిధ శాఖల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల ఖాతాలలో...
ఎస్సీ, ఎస్టీ నిధులు నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తే.. ఆ ఖాతాలలో రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉద్యోగులను రాజమహేంద్రవరం విజిలెన్స్ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన రూ.4 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను పాలక వర్గం తీర్మానం లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి.
అసలేం జరిగిందంటే...
టీడీపీకి చెందిన చైర్‌పర్సన్ భర్త ఆదేశాల మేరకు సబ్‌ప్లాన్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాలకవర్గం సమావేశం నిర్వహించకుండానే...తీర్మానాల పుస్తకంలో సభ్యుల సంతకాలు తీసుకున్నట్టు అభియోగం. గౌరవ వేతనం కోసం మినిట్ బుక్‌లో సంతకం చేయాలని సభ్యులకు అబద్ధం చెప్పి ఈ పని కానిచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలకు రూ.60.98 కోట్లు మంజూరయ్యాయి. ఒక్క ముమ్మిడివరం నగర పంచాయతీలోనే నామినేషన్ల పద్ధ్దతిపై పనులు అప్పగించారు. రూ.4 కోట్ల నిధులను 74 పనులకు రూ.5 లక్షల చొప్పున విభజించి అనుకూలురైన 10 మంది కాంట్రాక్టర్లకు ఈ పనులను అప్పగించి పర్సంటేజీల పర్వానికి తెర తీశారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులకు 15 శాతం నుంచి 25 శాతం వరకు పర్సంటేజీలు ముట్టజెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను విజిలెన్స్ అధికారులు సాంకేతిక పరంగా విచారణ చేశారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలను గుర్తించి నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది.
Advertisement