ప్రతీకాత్మక చిత్రం
అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోన్న నగరపాలక సంస్థలో మరో అక్రమ బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ అధికారి ఏకంగా కమిషనర్ డిజిటల్ కీతో రెండు భవనాల బీపీఎస్ అనుమతుల ఫైళ్లపై సంతకాలు చేశాడు. ఫైర్ ఎన్‌ఓసీ లేకపోయినా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని వ్యవహారాన్ని చక్కబెట్టాడు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
అనంతపురం న్యూసిటీ: నగరంలోని సాయినగర్‌లో నూతనంగా ఏర్పాటుకు చేసిన ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రైల్వే స్టేషన్ సమీపంలోని మరో ఆస్పత్రి నిర్వాహకులు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. సాయినగర్‌లోని స్పెషాలిటీ ఆస్పత్రి రూ.35 లక్షలు, రైల్వే స్టేషన్ సమీపంలోని మరో ఆస్పత్రి రూ.20 నుంచి రూ. 25 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, తదితర సర్టిఫికెట్లతో పాటు అగ్నిమాపక శాఖ అందించే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) పొందుపర్చాలి. అగ్నిమాపక శాఖ ఫైర్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఇవ్వలేదని తెలుసుకున్న సదరు టౌన్ ప్లానింగ్ అధికారి బీపీఎస్ అనుమతులు తానిప్పిస్తానంటూ నిర్వాహకులతో లోపాయికార ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖకు సమర్పించిన దరఖాస్తునే అనుమతుల్లో పొందుపర్చారు.
డిజిటల్ ‘కీ’
నగరపాలక సంస్థ కమిషనర్ డిజిటల్ కీతో ఈ రెండు ఆస్పత్రులకు ఫైర్ ఎన్‌ఓసీలు లేకుండానే బీపీఎస్ అనుమతులను గతేడాది డిసెంబర్‌లో ఇచ్చేశారు. ఈ విషయం ఆలస్యంగా కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో కమిషనర్ సదరు రెండు ఆస్పత్రుల బీపీఎస్ అనుమతులను నిలుపుదల (రీవోక్) చేయించారు. ఫోర్జరీకి పాల్పడిన అధికారిపై కమిషనర్ నిప్పులు చెరిగారు.
బోగస్
సదరు ఆస్పత్రులకిచ్చిన బీపీఎస్ అనుమతులు చెల్లవని టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు సిబ్బంది చెబుతున్నారు. భవిష్యత్తులో టాస్క్‌ఫోర్స్ బృందం వస్తే ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.
అధికార అండ
అధికార పార్టీ అండతోనే టౌన్ ప్లానింగ్‌లోని ‘మాయలోడు’ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మొదట అతన్ని సరెండర్ చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఏకంగా కమిషనర్ సంతకాన్నే దుర్వినియోగం చేసినా ఉన్నతాధికారులు ప్రేక్షకపాత్ర వహించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇలా కమిషనర్ డిజిటల్ కీతో మరెన్ని సంతకాలు చేశారో అర్థం కావడం లేదు. ఇప్పటికే నగరంలో అనధికార భవనాలు విచ్చలవిడిగా వెలిశాయి.
రీవోక్ చేశా
సాయినగర్‌లోని ఓ స్పెషాలిటీ ఆస్పత్రి బీపీఎస్ అనుమతులకు సంబంధించి ఎన్‌ఓసీ సర్టిఫికెట్ పూర్తిస్థాయిలో రాని విషయం వాస్తవమే. దీంతో అప్రమత్తమై ఆ ఆస్పత్రి బీపీఎస్‌ను రీవోక్ చేశా. మార్చి వరకు సమయం ఉందని, అంతలోపు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించా.
– పీవీవీఎస్ మూర్తి,
నగరపాలక సంస్థ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment