Town Planning wing
-
మాయలోడు..!
అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోన్న నగరపాలక సంస్థలో మరో అక్రమ బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ అధికారి ఏకంగా కమిషనర్ డిజిటల్ కీతో రెండు భవనాల బీపీఎస్ అనుమతుల ఫైళ్లపై సంతకాలు చేశాడు. ఫైర్ ఎన్ఓసీ లేకపోయినా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని వ్యవహారాన్ని చక్కబెట్టాడు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతపురం న్యూసిటీ: నగరంలోని సాయినగర్‌లో నూతనంగా ఏర్పాటుకు చేసిన ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రైల్వే స్టేషన్ సమీపంలోని మరో ఆస్పత్రి నిర్వాహకులు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. సాయినగర్‌లోని స్పెషాలిటీ ఆస్పత్రి రూ.35 లక్షలు, రైల్వే స్టేషన్ సమీపంలోని మరో ఆస్పత్రి రూ.20 నుంచి రూ. 25 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, తదితర సర్టిఫికెట్లతో పాటు అగ్నిమాపక శాఖ అందించే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) పొందుపర్చాలి. అగ్నిమాపక శాఖ ఫైర్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇవ్వలేదని తెలుసుకున్న సదరు టౌన్ ప్లానింగ్ అధికారి బీపీఎస్ అనుమతులు తానిప్పిస్తానంటూ నిర్వాహకులతో లోపాయికార ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖకు సమర్పించిన దరఖాస్తునే అనుమతుల్లో పొందుపర్చారు. డిజిటల్ ‘కీ’ నగరపాలక సంస్థ కమిషనర్ డిజిటల్ కీతో ఈ రెండు ఆస్పత్రులకు ఫైర్ ఎన్ఓసీలు లేకుండానే బీపీఎస్ అనుమతులను గతేడాది డిసెంబర్లో ఇచ్చేశారు. ఈ విషయం ఆలస్యంగా కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో కమిషనర్ సదరు రెండు ఆస్పత్రుల బీపీఎస్ అనుమతులను నిలుపుదల (రీవోక్) చేయించారు. ఫోర్జరీకి పాల్పడిన అధికారిపై కమిషనర్ నిప్పులు చెరిగారు. బోగస్ సదరు ఆస్పత్రులకిచ్చిన బీపీఎస్ అనుమతులు చెల్లవని టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు సిబ్బంది చెబుతున్నారు. భవిష్యత్తులో టాస్క్‌ఫోర్స్ బృందం వస్తే ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. అధికార అండ అధికార పార్టీ అండతోనే టౌన్ ప్లానింగ్‌లోని ‘మాయలోడు’ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మొదట అతన్ని సరెండర్ చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఏకంగా కమిషనర్ సంతకాన్నే దుర్వినియోగం చేసినా ఉన్నతాధికారులు ప్రేక్షకపాత్ర వహించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇలా కమిషనర్ డిజిటల్ కీతో మరెన్ని సంతకాలు చేశారో అర్థం కావడం లేదు. ఇప్పటికే నగరంలో అనధికార భవనాలు విచ్చలవిడిగా వెలిశాయి. రీవోక్ చేశా సాయినగర్‌లోని ఓ స్పెషాలిటీ ఆస్పత్రి బీపీఎస్ అనుమతులకు సంబంధించి ఎన్ఓసీ సర్టిఫికెట్ పూర్తిస్థాయిలో రాని విషయం వాస్తవమే. దీంతో అప్రమత్తమై ఆ ఆస్పత్రి బీపీఎస్‌ను రీవోక్ చేశా. మార్చి వరకు సమయం ఉందని, అంతలోపు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించా. – పీవీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
అవినీతికి ఆపరేషన్
టౌన్‌ప్లానింగ్‌లో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు టీపీఎస్‌లు అక్టోబర్ 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత విజయవాడ సెంట్రల్ : విజయవాడ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతికి శస్త్రచికిత్స మొదలైంది. ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ల(టీపీఎస్)పై టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.రఘు సస్పెన్షన్ వేటు వేశారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఆష, లక్ష్మీజ్యోతి. టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు జి.వెంకటేశ్వరరావు, కృష్ణ, ప్రవీణ్‌లను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ నిర్మాణాల్లో వీరి పాత్రపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం ఇక్కడకు వచ్చిన తిమ్మారెడ్డి అధికారులతో రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు సాగించారు. ఏం చేసినా చర్యలుండవనే ధీమా పెరిగిపోవడం వల్లే టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి పెరిగిందని దీనికి ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని తిమ్మారెడ్డి గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం తిరిగి మళ్లీ డెర్టైర్తో భేటీ అయ్యారు. మొదటి విడత సస్పెన్షన్ల పర్వం పూర్తవ్వగా రెండో విడతలో మరో ముగ్గురిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాఘటన టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో కలకలం రేపింది.బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, వెంకటేశ్వరరావులు ఐదు నెలల క్రితమే పదోన్నతిపై ఇక్కడ నుంచి బదిలీ అయ్యారు. పుష్కరాల ముసుగులో డెరైక్టరేట్లో లాబీయింగ్ చేసి ఓడీ తెచ్చుకున్నారు. పుష్కర విధులు పూర్తయిన నేపథ్యంలో కమిషనర్ జి.వీరపాండియన్ రిలీవ్ చేశారు. ప్రవీణ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాల్టీకి టీపీఎస్‌గా వెళ్లారు. పదోన్నతి వచ్చినా టౌన్‌ప్లానింగ్‌ను వదలడం ఇష్టం లేని జి.వెంకటేశ్వరరావు ఓడీ తెచ్చుకొని ఇక్కడే కొనసాగుతున్నారు. ఓడీ వ్యవహారంపై తిమ్మారెడ్డి మండిపడ్డట్లు తెలుస్తోంది. తాఖీదులు రెడీ ... అక్రమ భవన నిర్మాణదారులకు టౌన్‌ప్లానింగ్ అధికారులు తాఖీదులు సిద్ధం చేస్తున్నారు. తిమ్మారెడ్డి ఆదేశాల మేరకు నగరంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. వారం రోజుల ముందస్తు నోటీసుల్ని రూపొందిస్తున్నారు. మొదటి విడతలో 200 చదరపు గజాల విస్తీర్ణం ఆపైన వాటికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దసరా ముందు కూల్చివేతలు చేపడితే భవన నిర్మాణదారుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన అధికారులు అక్టోబర్ 17 నుంచి అక్రమ కట్టడాలను కూల్చేయాలని ముహూర్తంగా నిర్ణయించారు.