
సాహితీ శిఖరానికి నివాళులు
డా.సి.నారాయణ రెడ్డి తన జీవితంలో రాసిన చిట్టచివరిగా రచించిన పాట "ఇంకెన్నాళ్లు" సినిమాలో 'ఏమి వెలుతురూ ఇది ఏమి వెలుతురూ..
డా.సి.నారాయణ రెడ్డి తన జీవితంలో రాసిన చిట్టచివరిగా రచించిన పాట "ఇంకెన్నాళ్లు" సినిమాలో 'ఏమి వెలుతురూ ఇది ఏమి వెలుతురూ.. పొద్దు పొడవక ముందే పూత వెలుతురూ, కొత్త పెళ్లి పడచు తలఎత్తగానే.. పల్లెనిండా పరుచుకుంది పసిడి వెలుతురూ ! జిమ్మరే జిమ్మరేజిమ్మా .. ముద్దుగుమ్మారే గుమ్మరే గుమ్మా !! .. ఇది సినారె చివరి పాటగా మిగిలి పోవడం బాధాకరం. అది తెలంగాణాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జరిగే పెళ్లి (లగ్గం) ఘట్టాలు..
ఆయనను తొలిసారి కలిసింది నా రెండో సినిమా "అవును నిజమే" ఆడియో ఫంక్షన్లోనే, అతనే చీఫ్ గెష్ట్, ఆ సినిమా పాటలను శ్రద్ధగా విని ఒక ప్రశంసపత్రం రాసుకొని వచ్చి వినిపించి ప్రోత్సహించారు అయన. మధ్యలో సారస్వత పరిష్యత్లో ఇంకెన్నాళ్లు డీవీడీ ని కూడా ఆవిష్కరించారు. చివరి సారి కలిసింది మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు వచ్చినప్పుడు తానే స్వయంగా నాకు ఫోన్ చేసి తన ఇంటికి ఆహ్వానించి తన లెటర్ హెడ్డుపై తన హస్తాక్షరాలతో నన్ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా కితాబు ఇస్తూ అభినందన పత్రం రాసిచ్చారు ఆ జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత.
ఎంతో కల్మషంతో నిండిన ఈ వ్యవస్థలో ఇలాటి గొప్ప మనస్సుగల లెజెండరీ పెర్సొనాలిటీ, విశిష్ట కవితో నేను పనిచేయడం, ప్రశంశించబడడం నాలాంటివాడికి ఒక వారమే ! ఆయన ఇక భౌతికంగా జరిగి పోవడం ముమ్మాటికీ బాధ కారమే. అయన ఇచ్చిన ప్రోత్సాహం, ప్రశంశాపత్రం నాకో పెద్ద బహుమానంగా చిరకాలం ఉండిపోతాయి. ఇదంతా మా ఇద్దరి మధ్య ఎన్నడూ చెరపలేని అనుబంధ ముద్ర.. సినారేకు జోహారులు!! - సయ్యద్ రఫీ
ఆయనో ధ్రువతార
నింగి కెగసిన తెలుగు సాహితీ ధృవతార సినారె రాజ్యసభ సభ్యునిగా ఉండగా,అదే సమయంలో లోక్ సభ సభ్యునిగా ఉండడం నా అదృష్టం.మమకారం తో పాటు,స్వచ్ఛమైన తెలుగు నుడికారం ఆయన మాటల్లో ఇమిడిపోయేవి.పబ్లిక్ మీటింగులంటే ఇంక చెప్పనక్కరలేదు.ఆయన ప్రసంగం ఓ తెలుగు నదీ ప్రవాహమే.శ్రోతలు అందులో మునిగి తేలి ఆస్వాదించాల్సిందే కానీ వర్ణించడం కష్టం.
అలాంటి ఆత్మీయ,ఆధునిక తెలుగు సాహితీ శిఖరం సినారె మరణించడం యావత్ జాతికి తీరని లోటు.
ఆయన సాహిత్యం సర్వకాలీనం,విశ్వజనీనం.వ్యక్తి వికాసము మొదలు,విశ్వ మానవుని వికాసం వరకూ ఆయన కావ్య వస్తువులే.ఆయనకు జ్ఞాన పీఠం అందించిన కావ్యం విశ్వంభర విశ్వవిద్యాలయాల్లో పాఠం గా నిలవడం,వివిధ భాషల్లోకి అనువాదం కావడం గర్వకారణం.సాధారణ వాడుక భాషలో సినీ గీతాలైనా,గ్రాంధిక భాషలో పద్య,వచన కావ్యాలైనా ఒకే శ్రద్ధతో,అంకితభావం తో వ్రాయడంవల్ల పదికాలాలూ తెలుగు నేలపై అవి మనగలుగుతున్నాయి,మనగలుగుతాయి.'వేయి తోటలను నరికిన చేయి,పూయిస్తుందా ఒక్క పువ్వును' అని విశ్వంభర కావ్యంలో ప్రశ్నించిన సినారె ను తోడ్కొని పోయిన మృత్యుదేవతను ప్రశ్నించాలని ఉంది 'వేయి కవులను వెంటబెట్టుకుపోయిన కాలమా,తిరిగిస్తావా ఒక్క సినారె ను' అని.
'జగతి కి సన్ రే (sun ray )..
సాహితీ జగతి కి సినారె,
తెలుగునేలపై ఆయనెన్నటికీ ధ్రువతారే.
భళారే ! 'ఆయన మనవారే''
అని అనుకోగల అదృష్టవంతులు తెలుగు వారే.
-డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపి,పార్వతీపురం.
తలవంచని తెలుగు సాహిత్య శిఖరం
ఓ కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, విద్యా రంగ పరిపాలనా దక్షుడిగా, పెద్దల సభలో నాయకుడిగా విభిన్న కోణాల్లో సినారె చేసిన సేవలు, ఆయన రాతలు చరిత్రలో చిరస్ధాయిగా మిగిలిపోతాయని జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ఆయన ఎవ్వరికీ తలవంచని తెలుగు సాహిత్య శిఖరం, తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఒక మహావృక్షం అని కీర్తించారు. అటువంటి మహానుభావుడికి వినమ్రతతో నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.
గోల్కొండ వజ్రాన్ని కోల్పోయిన తెలుగు సాహిత్యం
సాహిత్య ఎవరెస్టు శిఖరం నేల కూలింది. బహు భాషావేత్త ,కవి, రచయిత ,పరిపాలనాదక్షుడిని కోల్పోవడం బాధాకరమని తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమల రావు అన్నారు. తెలుగు విశ్వ విద్యాలయం తరఫున డా.బి.ఆర్ .అంబేద్కర్ రచనల అనువాద సంపుటాలు వెలువరించడంలో సినారెది కీలక పాత్ర అని చెప్పారు. అంతటి ఉద్దండ పిండాన్ని కోల్పోవడం తెలుగు జాతి దురదృష్టమని అన్నారు. సినారె లేని లోటు వందేళ్ళ వరకు వెంటాడుతుందని చెప్పారు.
అవకాశాలు ఇచ్చారు..
సాహిత్యలోకంలో అన్ని ప్రక్రియల్లోనూ తనదైన శైలితో రచనలు చేసి సాహితీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్న ప్రముఖ సాహితీపరుడు డా. సీ నారాయణరెడ్డి మృతిపై నవ చేతన పబ్లిషింగ్ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పలువురు యువ సాహిత్యకారుల వెన్నుతట్టి వారి రచనలకు ముందుమాట రాసి ప్రోత్సహించేవారని సినారేను గుర్తు చేసుకుంది. ఆధునిక కవిత్వంతో సంప్రదాయాలు, ప్రయోగాలు అన్న అనేక రచనలను నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించే అవకాశాన్ని ఆయన కల్పించారని తెలిపింది. అటువంటి వ్యక్తి హఠాన్మరణం తెలుగు సాహితీ లోకానికే కాక నవ చేతన పబ్లిషింగ్ హౌస్‌కి కూడా తీరని దుఃఖాన్ని కలిగించిందని చెప్పింది. సినారె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని పేర్కొంది.