నెల్లూరు, తడ, సూళ్లూరుపేటలోని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇళ్లల్లో దాయపన్నులశాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
చేనిగుంట (తడ), న్యూస్‌లైన్ : నెల్లూరు, తడ, సూళ్లూరుపేటలోని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇళ్లల్లో ఆదాయపన్నులశాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు రెండు కార్లలో వచ్చిన ఐటీ అధికారులు, పోలీసు బృంద సభ్యులు తడ మండలంలోని చేనిగుంటలోని వాకాటి స్వగృహానికి వెళ్లి సోదాలు చేశారు. ఇంటిలోపల ఉన్న పనివాళ్లతో సహా ఎవరినీ బయటకు, వెలుపలి వ్యక్తులను లోపలికి అనుమతించలేదు. మధ్యాహ్నం తర్వాత పనివాళ్లను మాత్రం వెలుపలకు పంపారు.
అర్ధరాత్రి వరకు అణువణువు గాలించి వివరాలను నమోదు చేశారు. ఇంట్లో ఉన్న వాకాటి తల్లి బుజ్జమ్మ, ఆమెను చూసేందుకు విజయవాడ నుంచి వచ్చిన వాకాటి సోదరిని కూడా విచారించి నగలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇంట్లోనే బంధించినట్టుగా చేయడంతో వాకాటి తల్లి అనారోగ్యానికి గురై కలత చెందినట్టు తెలుసుకున్న గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార సేకరణకు చేనిగుంటకు వెళ్లిన మీడియాను అధికారులు ఇంటిలోనికి అనుమతించలేదు.
వాకాటి అనుచరుడి ఇంటిపై...
సూళ్లూరుపేట : ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో పాటు ఆయన అనుచరుడు కళత్తూరు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇళ్లపై ఇన్‌కంటాక్స్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయాన్నే ఒక బృందం కిరణ్‌కమార్‌రెడ్డి ఇంటికి, మరో బృందం తడ మండలం చేనిగుంటలోని వాకాటి ఇంటికి వెళ్లింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ వాకాటి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడంపై పలు అనుమానా లు వ్యక్తమవుతున్నాయి.