కన్నీరే మిగిలింది | farmer dies of vidyut shock | Sakshi
Sakshi News home page

కన్నీరే మిగిలింది

Published Fri, Sep 15 2017 10:15 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

కన్నీరే మిగిలింది - Sakshi

కన్నీరే మిగిలింది

కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంటలకు నీరందించేందుకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతానికి గురవుతున్నారు. బోర్లు మొరాయించడంతో ఫ్యూజులు సరిచేయడం, వైర్లు మరమ్మతులు చేసేక్రమంలో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరెంటు కాటుకు బాధిత రైతు కుటుంబాలు దిక్కులేనివవుతున్నాయి.

బొమ్మనహాళ్‌: కొలగానహాళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మైలాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి (46) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... మైలాపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఏడు ఎకరాల పొలం ఉంది. మూడేళ్లుగా పంట చేతికందకపోవడంతో పెట్టుబడులు సైతం తిరిగి రాలేదు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో వరి నాట్లు వేశాడు. మరో రెండు ఎకరాల్లో వరినాట్లకు సిద్ధమయ్యాడు. మిగతా మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే పొలానికెళ్లాడు.

రాత్రి వేసిన మోటార్‌ను పరిశీలించి ఫ్యూజ్‌క్యారియర్‌ తొలగించడానికి అటుగా ముందుకు కదిలాడు. అయితే అప్పటికే ఆ ప్రదేశం తేమగా ఉండటంతో అర్త్‌వైరు తగిలి నారాయణరెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదించారు. రైతు నారాయణరెడ్డి ఉద్దేహాళ్‌ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.2లక్షలు, గ్రామంలో పలువురు రైతుల వద్ద రూ.3 లక్షల దాకా అప్పులు చేశాడు. మృతుడి భార్య లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమేదార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement