కొండపల్లిలో ప్రజలతో మాట్లాడుతున్న అటవీ, పోలీసు అధికారులు, రహదారి మీదుగా వెళ్తున్న ఏనుగు
ఐదు మండలాల్లో 144 సెక్షన్ విధింపు
24 గంటల వ్యవధిలో గజరాజు దాడిలో ఇద్దరు రైతుల మృతి
అడుగడుగునా అటవీశాఖ వైఫల్యం
సమీప గ్రామాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
ఆదిలాబాద్: కుమురంభీం జిల్లా ప్రజలను గజరాజు హడలెత్తిస్తున్నాడు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతులు ఏనుగు దాడిలో మృత్యువాత పడటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆచూకీ చిక్కకుండా తిరుగుతున్న ఏనుగు గ్రామీణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో దహెగాం, కొండపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరిని పెద్దపులి హతమార్చగా.. ఇప్పుడు ఏనుగు రూపంలో మృత్యువు వెంటాడుతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇద్దరు రైతుల మృతి..
బూరెపల్లి సమీపంలోని ప్రాణహిత నదిలో బుధవారం తెల్లవారుజామున ఏనుగును కొంతమంది గ్రామస్తులు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారాన్ని విశ్వసించని అటవీ అధికారులు ఏనుగును నియంత్రించకపోవడంతో అది నది దాటి చింతలమానెపల్లి మండలంలోకి ప్రవేశించింది. ఉదయం 11 గంటల సమయంలో బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూముల వద్దకు వచ్చిన ఏనుగు అక్కడే మిరపతోటలో పని చేస్తున్న రైతు అల్లూరి శంకర్‌పై దాడి చేసి చంపేసింది.
ఆందోళనకు గురైన గ్రామస్తులు ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని అనుసరించగా.. గంగాపూర్, ఖర్జెల్లి గ్రామాల పక్కన ఉన్న ప్రాణహి త చేవేళ్ల ప్రాజెక్టు కాలువ పక్క నుంచి రుద్రాపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి అధికారులు ఏనుగు కదలికలను గుర్తించలేదు. మళ్లీ గురువారం తెల్లవారుజామున పెంచికల్‌పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపింది.
అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎల్కరి సుధాకర్‌ను వెంబడించగా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఏనుగు పలువురికి చెందిన తోటలు, పంటలు ధ్వంసం చేసింది. చింతలమానెపల్లి మండలం నుంచి బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో సంచరించింది. ఈమండలాలతో పాటు పక్కన ఉన్న కౌటాల, దహెగాం మండలాలు కలిపి రెండు రోజులుగా ఏనుగు ఐదు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు..
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించడం లేదు. ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం లేకపోవడంతో అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా గత మంగళవారం ఏనుగు బూరెపల్లి వద్ద ప్రాణహిత నదికి అవతలి వైపు ఉన్న చౌడంపల్లి అటవీ ప్రాంతంలో సంచరించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు.
చింతలమానెపల్లి మండలానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని గడ్చిరోలి జిల్లా రేపన్‌పల్లి రేంజ్ పరిధిలోని కమలాపూర్‌లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏనుగు అడవుల్లో సంచరించేది. దక్షిణ గడ్చిరోలి ప్రాంతంగా పిలిచే మాలెవాడ, మురుంగావ్ ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అభయారణ్యం ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంతో కలిసి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రాంతంలో ఏనుగుల సంచారం ఉంది.
మూడేళ్ల క్రితం మాలెవాడ అటవీ ప్రాంతానికి 25 నుంచి 30 ఏనుగుల బృందం వచ్చినట్లు అక్కడి అటవీ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఏనుగుల గుంపు నుంచే ఓ ఏనుగు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గడ్చిరోలి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనోరాలో ఈ ఏనుగుల గుంపు కొద్ది నెలలుగా తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఓ డ్రైవర్ సహా మరో ముగ్గురిపై దాడి చేసి చంపేశాయి. ఈ ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుంచి అటవీ ప్రాంతం గుండా గడ్చిరోలిలోని మాలెవాడ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు వారు చెబుతున్నారు.
అటవీశాఖపై విమర్శలు..
బూరెపల్లి వద్ద ఏనుగు సంచరిస్తున్న సమచారాన్ని అటవీశాఖకు చేరవేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సరైన సమయంలో స్పందించని కారణంగానే అల్లూరి శంకర్ ఏనుగు దాడిలో మరణించాడని ఆరోపిస్తున్నారు. ఒకరిపై దాడి చేసిన అనంతరం స్వయంగా జిల్లా అటవీ అధికారి పర్యవేక్షణలో ఉండగానే పెంచికల్‌పేట్ మండలంలోని కొండపల్లి వద్ద మరొకరు ఏనుగు దాడిలో మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో అటవీశాఖ నిర్లక్ష్యం వహించిందని, గోప్యత పాటించడంతోనే ప్రమాదాలు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో కొన్ని నెలల క్రితం అటవీ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పులులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులను బాధ్యులు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు పలువురిపై వేటు వేశారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
ఎస్పీ సురేశ్‌కుమార్, అటవీ కన్జర్వేటర్ శాంతారాం, జిల్లా అటవీ అధికారి నీరజ్ టోబ్రివాల్, డీఎస్పీ కరుణాకర్ స్వయంగా ఆయా మండలాలలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాలలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
లోడుపల్లి అడవుల్లోకి గజరాజు..
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ మండలం కొండపల్లిలో గురువారం వేకువజామున రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటలకు బెజ్జూర్ నుంచి పెంచికల్‌పేట్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కొండపల్లి టర్నింగ్ వద్ద ఎదురొచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పీసీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ ఏనుగు సంచారాన్ని నిర్ధారించారు. లోడుపల్లి అడవుల్లోకి వెళ్లిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై కొమురయ్య ఆధ్వర్యంలో పెంచికల్‌పేట్– సలుగుపల్లి రహదారిలో రాకపోకలను నిలిపివేశారు.
నా వెంట పడింది..
ఉదయం పూట కొండప ల్లి సమీపంలో వాకింగ్‌కు వెళ్లా. ఏనుగు ఘీంకరించిన శబ్దం వినిపించింది. దూరంగా ఉన్న ఇద్దరు మిత్రులను అప్రమత్తం చేస్తూ అరవడంతో ఏనుగు నా వెంట పడడంతో పరుగెత్తి తప్పించుకున్నా. తర్వాత ఏను గు ఉన్న స్థలంలో చూడడానికి వెళ్లగా అక్కడ కారు పోశన్న మృతదేహం కనిపించింది. – ఎల్కరి సుధాకర్, పెంచికల్‌పేట్
Comments
Please login to add a commentAdd a comment