vidyut shock
-
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
కణేకల్లు: విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని దిగువ వీధికి చెందిన గంగవరం ఖలీల్ (55), గురువారం ఉదయం వరి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకెళ్లాడు. అక్కడ స్టార్టర్ బటన్ నొక్కే సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పక్క పొలంలో పనిచేస్తున్న కూలీలు ఈ విషయాన్ని గమనించి, వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఖలీల్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఖలీల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కరెంట్‌షాక్‌తో కౌలు రైతు
కణేకల్లు: కణేకల్లుకు చెందిన కౌలురైతు ఆంజనేయులు (50) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ఆంజనేయులు ఆలూరు వద్ద 5ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పొలంలో వరిసాగు చేసేందుకు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టి మాగాణికి దమ్ము చేయించాలనుకున్నాడు. స్టార్టర్ ఆన్ చేయగానే విద్యుత్‌షాక్‌కు గురై సృహ కోల్పోయాడు. పక్కనే ఉన్న రైతులు గమనించి వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. భార్య అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. -
ఇంటి పైకప్పు మరమ్మతు చేస్తుండగా..
బత్తలపల్లి: ముష్టూరు గ్రామానికి చెందిన కుమ్మర కాటమయ్య (68) ఇంట్లోనే చిల్లరకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు రంధ్రం పడింది. కాటమయ్య శుక్రవారం మరమ్మతు చేయడానికి ఇంటిపైకెక్కాడు. విద్యుత్ ప్రసరిస్తున్న సర్వీస్‌వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆయన్ని కిందకు తీసుకొచ్చి సపర్యలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందాడు. ఎస్ఐ హారున్‌బాషాకు సమాచారం అందించారు. మృతునికి భార్య అంజినమ్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
కన్నీరే మిగిలింది
కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంటలకు నీరందించేందుకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతానికి గురవుతున్నారు. బోర్లు మొరాయించడంతో ఫ్యూజులు సరిచేయడం, వైర్లు మరమ్మతులు చేసేక్రమంలో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరెంటు కాటుకు బాధిత రైతు కుటుంబాలు దిక్కులేనివవుతున్నాయి. బొమ్మనహాళ్: కొలగానహాళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మైలాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి (46) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... మైలాపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఏడు ఎకరాల పొలం ఉంది. మూడేళ్లుగా పంట చేతికందకపోవడంతో పెట్టుబడులు సైతం తిరిగి రాలేదు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో వరి నాట్లు వేశాడు. మరో రెండు ఎకరాల్లో వరినాట్లకు సిద్ధమయ్యాడు. మిగతా మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే పొలానికెళ్లాడు. రాత్రి వేసిన మోటార్‌ను పరిశీలించి ఫ్యూజ్‌క్యారియర్ తొలగించడానికి అటుగా ముందుకు కదిలాడు. అయితే అప్పటికే ఆ ప్రదేశం తేమగా ఉండటంతో అర్త్‌వైరు తగిలి నారాయణరెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదించారు. రైతు నారాయణరెడ్డి ఉద్దేహాళ్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.2లక్షలు, గ్రామంలో పలువురు రైతుల వద్ద రూ.3 లక్షల దాకా అప్పులు చేశాడు. మృతుడి భార్య లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమేదార్ లక్ష్మీనారాయణ తెలిపారు. -
కర్షకులను కాటేసిన కరెంట్
కనగానపల్లి: మండలంలోని చంద్రాశ్చర్లలో రైతు సాకే రామచంద్ర (45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రామచంద్రకు గ్రామ సమీపంలోని ఆరు ఎకరాల పొలం ఉంది. అందులో టమాట సాగుచేశాడు. మంగళవారం తెల్లవారుజామున పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ మోటరు ఆడకపోవడంతో స్టార్టర్ పెట్టెలో ఉన్న ఫ్యూజులను పరిశీలించేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఆయన అక్కడే ప్రాణం వదిలాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు విగత జీవిగా పడిగున్న రామచంద్రను చూసి హతాశులయ్యారు. పోలీసులు, విద్యుత్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
విద్యుత్ మోటారు ఆడటం లేదని స్తంభమెక్కి మరమ్మతులు చేస్తున్న యువ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. తమ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియని చిన్నారులు బిత్తరచూపులు చూస్తూ ఉండటం అందరి హృదయాలనూ కలచివేసింది. అమడగూరు మండలం బావాచిగాని కొత్తపల్లి (బి.కొత్తపల్లి)లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. అమడగూరు: బి.కొత్తపల్లికి చెందిన లేట్ కదిరిరెడ్డి, ప్రభావతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మంజునాథరెడ్డి (32)కి ఏడేళ్ల క్రితం చిత్తూరు జిల్లా బిళ్లూరోళ్లపల్లికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మంజునాథరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో టమాట, ఎకరం విస్తీర్ణంలో సజ్జ సాగు చేశాడు. వారం రోజులుగా వ్యవసాయ బోరు మోటార్ పనిచేయడం లేదు. దీంతో మంజునాథరెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ బోరు దగ్గరకెళ్లి సర్వీస్ వైరును పరిశీలించాడు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేయబోయాడు. కొద్దిసేపటికే కరెంట్ రావడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. గంటసేపటి తర్వాత పశువుల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చి సమీపంలోని బాగేపల్లి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాయకుల పరామర్శ గత ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ప్రభావతమ్మ కొడుకు ధనుంజయరెడ్డి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీఈసీ సభ్యుడు కడపల మోహన్‌రెడ్డి, నాయకులు దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్‌చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ముత్యాలప్ప (36) దారిలో తెగిపడిన విద్యుత్ తీగను పక్కకు తొలగించే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే దారి మధ్యలోనే ముత్యాలప్ప చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సరస్వతి , ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ధర్మవరం: ఉతికిన దుస్తులను ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన యంకమ్మ (40) మంగళవారం ఉదయం ఇంటి ముందు ఉతికిన దుస్తులను విద్యుత్ స్తంభానికి కట్టిన తాడుపై ఆరేయబోయింది. వర్షానికి తడిసిన తాడుకు విద్యుత్ ప్రసరిస్తుండటంతో అది తెలీని యంకమ్మ విద్యుదాఘాతానికి గురైంది. హుటాహుటిన ఆమెను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త రామయ్య, నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నట్లు వారు తెలిపారు. -
విద్యుదాఘాతంతో నెమలి మృత్యువాత
పుట్టపర్తి అర్బన్ : దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ నెమలి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. అటవీ ప్రాంతం నుంచి ఓ నెమలి తాగునీటి కోసం ఆదివారం ఇరగరాజుపల్లి గ్రామ పొలాల్లోకి వచ్చింది. పైకి ఎగిరే సమయంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగల్లో చిక్కుకుని షాక్‌తో మృతి చెందింది. సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి నెమలిని కిందకు దించారు. -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
నార్పల : వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి వెళ్లి స్టాటర్ బాక్స్ తెరుస్తుడంగా విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతి చెందిన సంఘటన నార్పల మండలం పూలసలనూతల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. నార్పల మండలంలోని పులసలనూతల గ్రామానికి చెందిన కురుబ గడ్డం చిన్న వెంకట్రాముడు కు ఇద్దరు కుమారులు. వారిలో సాయి(20) పెద్ద కుమారుడు, ఇంటర్ వరకూ చదువుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉన్నారు. వీరికి మూడు ఎకరాలు పొలం ఉంది. బోరు కింద వేరుశనగ పంటను సాగు చేశారు. వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి తండ్రి, కొడుకు సాయంత్రం ఐదు గంటలకు తోట వద్దకు వెళ్లారు. ఆరు గంటల సమయంలో త్రీ ఫేస్ కరెంట్ రావడంతో మోటారు ఆన్చేయడానికీ స్టాటర్ బాక్స్ వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే స్టాటర్‌కు విద్యుత్ ప్రసరించడంతో సాయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడే ఉన్న తండ్రి చిన్న వెంకట్రాముడు టవాల్‌తో కొడుకును లాగడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విద్యుదాఘాతంతో అక్కడక్కడే మృతి చెందాడు. కన్న కొడుకును కళ్లారా చంపుకున్నానని తండ్రి చిన్న వెంకట్రాముడు, కుటుంబ సభ్యులు బోరును విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కనగానపల్లి(రాప్తాడు) : మండలంలోని తూంచర్ల గ్రామంలో శనివారం విద్యుదాఘాతానికి గురై రైతు వన్నూరప్ప (42) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. రైతు వన్నూరప్ప తన ఇంటి ముందు ఉన్న ఇనుప రేకులను పక్కకు సర్దుబాటు చేస్తుండగా, పైన ఉన్న విద్యుత్ తీగలు వాటికి తగిలాయి. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి.. కాపాడేలోపు అతడు మృత్యువాత పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మధ్యనే పొలంలో రెండు బోర్లు వేసి పంటలు సాగుచేశామని, అలాగే కూతురు పెళ్లి, కుటుంబ అవసరాల కోసం రూ.నాలుగు లక్షల దాకా అప్పు చేసినట్లు అతడి భార్య ముత్యాలమ్మ కన్నీటి పర్యతమైంది. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
యాడికి (తాడిపత్రి రూరల్) : యాడికి మండలంలోని నగరూర్ గ్రామానికి చెందిన రైతు రవిచంద్ర చౌదరి(42) విద్యుత్ షాక్‌కు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. నగరూరుకు చెందిన రవిచంద్రచౌదరి మంగళవారం దానిమ్మ తోటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ మోటార్ వేస్తుండగా షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మృతుని భార్య గౌతమి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి ముగ్గురు సంతానం. -
విద్యుదాఘాతానికి వివాహిత బలి
ధర్మవరం రూరల్ : మండలలోని ధర్మపురిలో చంద్రశేఖర్‌రాజు భార్య లావణ్య(30) అనే వివాహిత విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉదయమే బాత్రూంలో లైటు వేయడానికి వెళ్లగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసారమై షాక్ కొట్టడంతో కిందపడిపోయినట్లు వివరించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి జీవన్, రేవతి, రావణ్ అనే పిల్లలు ఉన్నారు. -
కరెంట్ కాటుకు ఒకరి బలి
బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం నరసాపురంలో కరెంట్ కాటుకు హనుమంతరాయుడు(45) అనే వ్యక్తి బలయ్యారు. ఏఎస్ఐ విజయనాయక్ కథనం మేరకు.. కొత్తగా కడుతున్న ఇంటికి మోటార్ సాయంతో నీరు పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై, స్పృహతప్పి పడిపోయినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కార్మికుడ్ని కాటేసిన కరెంట్
గుంతకల్లు టౌన్ : గుంతకల్లు హనుమాన్ సర్కిల్లోని లక్ష్మీగణేశ్ సా మిల్లో పని చేసే రామిరెడ్డి కాలనీకి చెందిన దూదేకుల ఆకుల షబ్బీర్ బాషా (27) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురై ఆదివారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. సా మిల్‌ను షబ్బీర్ సోదరుడు సత్తార్ అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. అందులోనే షబ్బీర్ కూడా పని చేస్తున్నాడన్నారు. రంపపు మిషన్‌లో మొద్దును కోస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు తెలిపారు. తోటి కార్మికులు వెంటనే అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కాగా మృతుడికి భార్య ఆరీఫా, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. -
కాటేసిన కరెంట్
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ నరసింహులు(40) అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే బాత్రూంలోకి వెళ్లిన ఆయన ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై కిందపడిపోయాడన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వివరించారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 43-ఉడేగోళంలో మేస్త్రీ.. కణేకల్లు : మండలంలోని 43-ఉడేగోళంలో ఎర్రగుంటలోని కెనిగుంటకు చెందిన వడ్డే హనుమంతరాయుడు(26) అనే మేస్త్రీ బుధవారం విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. ఎర్రిస్వామి అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య రోజా, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
రైతును కాటేసిన కరెంట్
నల్లమాడ (పుట్టపర్తి) : నల్లమాడ మండలం కొత్తపల్లి తండాకు చెందిన డి.ఛత్రేనాయక్(56) అనే రైతు విద్యుదాఘాతానికి గురై శుక్రవారం మరణించినట్లు ఎస్ఐ గోపీ తెలిపారు. తండా సమీపంలోని వ్యవసాయ బోరుబావి కింద నాయక్ సజ్జ పంట సాగు చేశారు. పంటకు నీరు పెట్టేందుకు ఉదయమే బోరుబావి వద్దకు వెళ్లారు. విద్యుత్ మోటారుకు సపోర్టుగా అమర్చిన జీఏ(ఇనుప) వైరుపై గురువారం రాత్రి గాలి, వానకు స్టార్టర్‌లోని విద్యుత్ వైరు తెగిపడింది. ఇది గమనించని నాయక్ ప్రమాదవశాత్తు జీఏ వైరును తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేఉ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య తిరుపాలీబాయి, కుమారులు విక్రం, సుమన్ ఉన్నారు. -
చీకట్లు నింపిన విద్యుత్
కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లులోని కొత్త కొట్టాలలో ఆదివారం సాయంత్రం విద్యుదాఘతానికి గురై దాసరి గొల్ల ఎర్రిస్వామి(39) మృతి చెందినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. కొత్త నిర్మిస్తున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేశారు. సాయంత్రం కాగానే ఇంట్లో లైట్ వెలిగించేందుకు వైర్‌ను బోర్డులో అమర్చుతుండగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడన్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అతన్ని కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధరించారన్నారు. మృతుడి భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
మడకశిర రూరల్ : మండలంలోని కె.గుండుమలకు చెందిన వెంకటశివప్ప(52) అనే రైతు విద్యుదాఘాతానికి గురై శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పాపసానిపల్లిలో మల్బరీ షెడ్‌ను కూలీలతో కలసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడని వివరించారు. వెంటనే మడకశిర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆస్పత్రికి చేరుకుని వెంకటశివప్ప మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఘటనపై పోలీసులు ఆరా తీశారు. -
బాలింతను కాటేసిన విద్యుదాఘాతం
చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామంలో విద్యుదాఘాతానికి కళావతి(23) మృతి చెందినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల బాలింత. గ్రామానికి చెందిన కళావతి, ఈశ్వర్ దంపతులు మగ్గం నేస్తూ జీవనం సాగించే వారు. కళావతి శుక్రవారం ఉదయం తడి దుస్తులను ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న ఇనుప తీగపై ఆరేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు వివరించారు. భర్త, ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే ఆమెను చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శించేందుకు వస్తూ... కళావతి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలియగానే న్యామద్దల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీకి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి, మృతురాలి భర్తను ఓదార్చారు. వారిలో జయకృష్ణ అనే గ్రామస్తుడు కూడా ఉన్నాడు. అతను పరామర్శ అనంతరం స్వగ్రామానికి బైక్‌లో వెళ్లూ మార్గమధ్యంలో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అదే పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
నార్పల : పొలం వద్ద విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని నడిమిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... నడిమిపల్లి గ్రామానికి చెందిన జి.రాజరాజన్న(37) శనివారం వేకువజామున పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ అక్కడున్న విద్యుత్ తీగలు తగులుకోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య నాగవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాటేసిన విద్యుత్ తీగలు
తనకల్లు (కదిరి) : పంట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి సోమశేఖర్‌రెడ్డి (35) అనే వ్యవసాయ కూలీ బుధవారం మృతి చెందిన సంఘటన తనకల్లు మండలం తురకవాండ్లపల్లి వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాజశేఖర్‌బాబు అనే రైతుకు చెందిన పొలంలో సోమశేఖర్‌రెడ్డి కూలీగా పని చేస్తున్నాడు. పొలంలో సాగు చేసిన బెండ పంటకు క్రిమిసంహారక మందు కొట్టేందుకు వెళ్లాడు. అంతకు ముందే అడవిపందుల బారినుండి పంటను కాపాడేందుకు పొలం చూట్టూ కంచె వేసి విద్యుత్ సరఫరా పెట్టారు. అయితే ప్రమాదవశాత్తు సొమశేఖర్ విద్యుత్ తీగలకు తగలడంతో కిందపడిపోయాడు. గమనించిన గ్రామస్తులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణాలు తీసిన చోరీ
పావగడ : విద్యుత్ రాగి తీగలను చోరీ చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అవే తీగలకు బలయ్యాడు. తాలూకాలోని జే.అచ్చంపల్లి గ్రామంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి సమీపంలోని రొప్పం గ్రామానికి చెందిన ఇమామ్ ఖాన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి జే.అచ్చంపల్లి గ్రామానికి విద్యుత్ రాగి తీగల దొంగతనానికి వెళ్లాడు. విద్యుత్ స్తంభాన్ని ఎక్కి తీగల్ని పట్టుకున్నాడు. అయితే విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలపై కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ అబ్దుల్ నబీ తెలిపారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
నార్పల : మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ రోడ్డులో ఉన్న ఐష్ ఫ్యాక్టరీ నిర్వాహకురాలు శ్యామల(39) విద్యుదాఘాతంతో మృతి చెందారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామానికి చెందిన శ్యామల కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం నార్పలకు వలస వచ్చి జీవనోపాధికి ఐష్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. శుక్రవారం శివర్రాతి కావడంతో ఆమె భర్త నారాయణరెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల కొండకు వెళ్లారు. ఆయన లేకపోవడంతో అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్యామల ఐష్ ఫ్యాక్టరీలో ప్లగ్ వేయబోయి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలో పడిపోయారు. ఫ్యాక్టరీ వద్ద ఉన్నవారు అది గమనిఽంచి ఆమెను హూటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్లు మృతిరాలి కుటుంబ సభ్యులు తెలిపారు. శ్యామల భర్త నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు మండల పరిధిలోని వేల్పమడుగు గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి కుమారుడు శివారెడ్డి (25) శనివారం రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు శివారెడ్డి పొలంలో నీళ్లు కట్టేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. బోరు ఆన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ గురై తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనున్న పొలంలో రైతులు గుర్తించి శివారెడ్డిని బళ్లారి ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మార్గంమధ్యలో మృతి చెందాడు.