తోటి రైతుకు సాయం చేయబోయిన యువకుడికి విద్యుత్‌తీగలే యమపాశాలుగా మారాయి.
ధర్మవరం రూరల్ : తోటి రైతుకు సాయం చేయబోయిన యువకుడికి విద్యుత్‌తీగలే యమపాశాలుగా మారాయి. విద్యుత్ వైరు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ వైరు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ధర్మవరం రూరల్ పరిధిలోని మల్లేనిపల్లిలో మంగళవారం జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మల్లేనిపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్ర తన పొలానికి విద్యుత్ వైరును లాగడానికి అదేగ్రామానికి చెందిన రమేష్ (24), రంగా, నాగేంద్ర, తిరుపాలును సాయంగా పిలుచుకువెళ్లాడు.
వైరు లాగుతున్న సమయంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లను వీరు లాగుతున్న వైరు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా రమేష్ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన నలుగురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రమేష్ తల్లిదండ్రులు కాటమయ్య, రమణమ్మ, బంధువులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.