విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కళ్యాణదుర్గం : కొత్తూరు గ్రామానికి చెందిన గొల్ల హనుమంతరాయుడు (25) శుక్రవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు... మేకలను మేత కోసం గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ తోట వద్దకు తీసుకెళ్లాడు. చెట్టు ఎక్కి కొడవలితో లేత ఆకు కొమ్మలను నరికేందుకు ఉపక్రమించాడు. ఆ చెట్టుపై 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్లింది. దీన్ని గమనించకుండా కొడవలిని పైకి ఎత్తిన సమయంలో వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇతడికి తొమ్మిది నెలల కిందటే వివాహమైంది. ప్రస్తుతం భార్య నాలుగు నెలల గర్భిణి. ప్రమాద విషయం తెలియడంతో భార్య, తండ్రి, సోదరుడు, సోదరి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.