అంతలోనే తిరిగిరాని లోకాలకు
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి తల్లడిల్లిన భార్య
శ్రీకాళహస్తి: ‘సమీరా వచ్చేస్తున్నా... మరో 15 నిమిషాల్లో నీ ముందుంటా.. నువ్వేం కంగారుపడకు.. బాబు తిన్నాడా..! నువ్వు భోజనం చేసి పడుకో.. ఐ యామ్ ఆన్‌ది వే..’ అన్న భర్త తెల్లారేసరికి విగత జీవిగా కనిపించడం ఆమె గుండెల్ని పిండేసింది. ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని నింపింది.
పోలీసుల కథనం.. బుచ్చినాయుడుకండ్రిగ మండలం, జోగికండ్రిగకు చెందిన కొప్పల ధర్మయ్య కుమారుడు కొప్పల నారాయణ(25) డిగ్రీ వరకు చదివి రౌతుసూరమాల సమీపంలో ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నారాయణకు పెళ్లకూరు మండలం, నెలబల్లి దళితవాడకు చెందిన సమీరాతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భార్య సమీరా కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆమెను చూసేందుకు నారాయణ రెండు రోజుల కిందట నెలబల్లి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో శ్రీకాళహస్తికి వెళ్లాడు.
తిరిగి వస్తూ తన మేనత్త ఊరైన తాటిపర్తికి చేరుకున్నాడు. రాత్రి పది అవుతున్నా నారాయణ ఇంటికి రాకపోవడంతో సమీరా భర్తకు ఫోన్ చేసింది. తాను తాటిపర్తిలో ఉన్నానని, మరో 15 నిమిషాల్లో నీ ముందుంటానని సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో నెలబల్లికి మార్గమధ్యంలో నాయుడుపేట–మదనపల్లి జాతీయ రహదారికి అతి సమీపంలో రామానాయుడు ఎస్టీ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బండరాయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. బండరాయిని ఢీకొన్న సమయంలో నారాయణ బైక్‌తో పాటు ముళ్లపొదల్లో పడిపోవడంతో ఎవ్వరూ గుర్తించలేకపోయారు.
ఇప్పుడే వస్తానన్న భర్త తెల్లారైనా ఇంటికి రాకపోవడంతో సమీరా తాటిపర్తిలోని తమ బంధువులకు సమాచారం అందించింది. దీంతో వారు ఆరా తీయగా ముళ్లపొదల్లో విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి బోరుమన్నారు. తొట్టంబేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment