hanumantharayudu
-
కాటేసిన కరెంట్
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ నరసింహులు(40) అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే బాత్రూంలోకి వెళ్లిన ఆయన ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై కిందపడిపోయాడన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వివరించారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 43-ఉడేగోళంలో మేస్త్రీ.. కణేకల్లు : మండలంలోని 43-ఉడేగోళంలో ఎర్రగుంటలోని కెనిగుంటకు చెందిన వడ్డే హనుమంతరాయుడు(26) అనే మేస్త్రీ బుధవారం విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. ఎర్రిస్వామి అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య రోజా, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కళ్యాణదుర్గం : కొత్తూరు గ్రామానికి చెందిన గొల్ల హనుమంతరాయుడు (25) శుక్రవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు... మేకలను మేత కోసం గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ తోట వద్దకు తీసుకెళ్లాడు. చెట్టు ఎక్కి కొడవలితో లేత ఆకు కొమ్మలను నరికేందుకు ఉపక్రమించాడు. ఆ చెట్టుపై 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్లింది. దీన్ని గమనించకుండా కొడవలిని పైకి ఎత్తిన సమయంలో వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి తొమ్మిది నెలల కిందటే వివాహమైంది. ప్రస్తుతం భార్య నాలుగు నెలల గర్భిణి. ప్రమాద విషయం తెలియడంతో భార్య, తండ్రి, సోదరుడు, సోదరి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
మడకశిర రూరల్ : మృత్యువు ఐచర్ వాహన రూపంలో దూసుకొచ్చింది. ఆటోను బలంగా ఢీకొంది. అందులో ఉన్న ఇద్దర్ని కబళించింది. ఈ సంఘటన మడకశిర రూరల్ మండలం కల్లుమర్రి–అగ్రంపల్లి గ్రామాల మధ్య బుధవారం జరిగింది. మడకశిర ఎస్ఐ మగ్బుల్బాషా కథనం ప్రకారం... కల్లుమర్రికి చెందిన రామప్ప(65), హనుమంతరాయుడు(21) సహా కలూమ్ అనే వ్యక్తులు ఆటోలో హిందూపురానికి బయలుదేరారు. కల్లుమర్రి–అగ్రంపల్లి మార్గమధ్యంలో మడకశిర వైపు నుంచి విపరీతమైన వేగంతో వచ్చిన ఐచర్ వాహనం ఆటోను ఢీకొనడంతో అది అదుపు తప్పి బోల్తాపడింది. అందులోని ముగ్గురూ గాయపడ్డారు.వారిని 108లో హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగానే రామప్ప మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హనుమంతరాయుడు మరణించారు. తీవ్రంగా గాయపడిన కలూమ్ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మగ్బుల్బాషా తెలిపారు. కాగా ఘటన స్థలంలో జనం భారీగా గుమిగూడారు. నాన్న చనిపోయిన నాలుగు రోజులకే... హనుమంతరాయుడు తండ్రి అంజప్ప నాలుగు రోజుల కిందట మరణించారని గ్రామస్తులు తెలిపారు. ఇంకా ఆ చేదు జ్ఞాపకాల నుంచి తేరుకోకనే ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులిద్దరూ చనిపోవడంతో కల్లుమర్రిలో విషాదం నెలకొంది.