మళ్లించిన వరద నీటిని లెక్కలోకి తీసుకోవద్దు | AP ENC Narayana reddy appeals to Krishna Board | Sakshi
Sakshi News home page

మళ్లించిన వరద నీటిని లెక్కలోకి తీసుకోవద్దు

Published Sat, Feb 6 2021 6:04 AM | Last Updated on Sat, Feb 6 2021 6:04 AM

AP ENC Narayana reddy appeals to Krishna Board - Sakshi

సాక్షి, అమరావతి: దిగువ కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్న సమయంలో ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటా కింద లెక్కించకూడదని కృష్ణా బోర్డుకు ఏపీ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి.నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఆ సమయంలో నీటిని మళ్లించకుంటే వృథాగా సముద్రం పాలవుతుందన్నారు. దీన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లామని, మళ్లించిన వరద నీటిపై మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే పేర్కొన్నారు. ఏపీకి 95, తెలంగాణకు 83 టీఎంసీలు కేటాయించడానికి అంగీకరిస్తూ ప్రతిపాదనలు పంపితే నీటి విడుదలపై సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు కార్యాలయంలో సభ్య కార్యదర్శి రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. 

ఏపీ తరఫున ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున సాగర్‌ సీఈ నరసింహ హాజరయ్యారు. మార్చి 31 వరకూ సాగు, తాగునీటి అవసరాలకు 108 టీఎంసీలు కేటాయించాలని ఏపీ, 83 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ప్రతిపాదించాయి. శ్రీశైలంలో కనీస నీటి మట్టానికి దిగువన 807 అడుగుల వరకూ వెళ్లి నీటిని వినియోగించుకోవాలని ఏపీ ఈఎన్‌సీ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బోర్డు స్పందిస్తూ శ్రీశైలంలో 810, సాగర్‌లో 520 అడుగుల వరకు కనీస నీటి మట్టాలను నిర్వహించాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. 

క్యారీ ఓవర్‌ జలాలపై తేల్చేది ట్రిబ్యునలే..
ప్రస్తుత నీటి సంవత్సరంలో వినియోగించుకోలేని జలాలను వచ్చే నీటి సంవత్సరంలో వినియోగించుకుంటామని తెలంగాణ సీఈ నరసింహ బోర్డుకు విజ్ఞప్తి చేయడంపై ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని స్పష్టం చేశారు. క్యారీ ఓవర్‌ జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కులు ఉంటాయని తేల్చిచెప్పారు. క్యారీ ఓవర్‌ జలాల అంశాన్ని కేడబ్ల్యూడీటీ–2(కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌)లో తేల్చుకోవాలని బోర్డు సూచించింది. సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ లీకులతో గత ఏడాది నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 1వరకూ 17,313 క్యూసెక్కులు (1.49 టీఎంసీలు) సాగర్‌ కుడి కాలువలోకి చేరాయని, అవసరం లేకపోవడంతో ఆ నీళ్లన్నీ వృథా అయిన దృష్ట్యా వాటిని తమ వాటాగా లెక్కించకూడదన్న ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామని బోర్డు తెలిపింది. విశాఖలో కృష్ణా బోర్డు కార్యాలయం కోసం ఎంపిక చేసిన భవనాలను పరిశీలించామని,తరలింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. 

రాష్ట్ర హక్కులను కాపాడుకుంటాం: సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, ఏపీ జలవనరుల శాఖ
త్రిసభ్య కమిటీ భేటీ ముగిసిన తర్వాత ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి విలేకరులతో మట్లాడారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కృష్ణా బోర్డును విశాఖకు తరలించాలని ప్రతిపాదించామన్నారు. దీనిపై తెలంగాణ సర్కారు అభ్యంతరాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ గోదావరి బోర్డు ప్రధాన కార్యాలయం కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌లో ఉంది కదా? అని పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికే ప్రాజెక్టులను చేపట్టామని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement