- మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమంటూ కూతురు ఫిర్యాదు
- తర్వాత పొరపాటుగా ఫిర్యాదు చేశామంటూ పోలీసులకు పిటిషన్
- కానీ వారిద్దరే కారణమంటూ నారాయణరెడ్డి సూసైడ్ నోట్
నారాయణరెడ్డి ఆత్మహత్య వెనుక ఆంతర్యమేమిటి?
Published Wed, Aug 10 2016 4:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం : కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య సర్వత్రా చర్చనీయాంశమైంది. అక్రమ ఫైనాన్స్ దందాతో సంచనలం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి, కరివేద శ్యాంసుందర్‌రెడ్డి అనే వ్యక్తుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి కుటుంబసభ్యులు ఆ తరువాత కొద్దిసేపటికే మాట మార్చారు. ఇందులో మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి ప్రమేయం లేదని, ఇతరుల మాటలు నమ్మి పొరపాటుగా ఫిర్యాదు చేశామని పేర్కొంటూ పోలీసులకు మళ్లీ పిటిషన్ ఇవ్వడం విశేషం. అయితే అప్పటికే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఇతరుల మాటలు నమ్మి తొలుత పొరపాటుగా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మరోవైపు నారాయణరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని మోహన్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి(48) తన కుటుంబంతో గత కొంతకాలంగా కరీంనగర్ విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. కుమారుడు వంశీధర్‌రెడ్డి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తుండగా, కూతురు తిరుమల వివాహం కావడంతో వరంగల్‌లో నివాసం ఉంటున్నారు. నారాయణరెడ్డి సోమవారం రాత్రి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో నారాయణరెడ్డి మృతి చెందాడు. మంగళవారం ఉదయం నారాయణరెడ్డి కూతురు గంగ తిరుమల, తల్లి చాడ లక్ష్మితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమని, ఈ మేరకు తన తండ్రి సూసైడ్ నోట్ రాశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రికి స్వగ్రామంలోని సర్వే నంబర్ 293లో రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేదని, సుమారు ఐదేళ్ల క్రితం కుటుంబ అవసరాలకు శ్యాంసుందర్‌రెడ్డి ద్వారా ఏఎస్సై మోహన్‌రెడ్డి వద్ద ఆ భూమిని తనఖా పెట్టి రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడని పేర్కొన్నారు. తర్వాత వడ్డీతో కలిపి మొత్తం చెల్లించినా ఆ భూమి పత్రాలు తిరిగి ఇవ్వలేదని అందులో తెలిపారు. ఇదే విషయంపై తన తండ్రి నారాయణరెడ్డి బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీఐడీకి బదిలీ చేశారని, తర్వాత ఆ భూమిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఇదే విషయంపై తన తండ్రి బాధపపడుతుండేవాడని పేర్కొన్నారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చిన తన తండ్రి నోటి నుంచి నురగ రావడంతో ప్రతిమ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ పరీక్షించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు చెప్పారని, అప్పటికే అర్ధరాత్రి ఒంటి గంట అయ్యిందని పేర్కొన్నారు. తన తండ్రి జేబులో ‘మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి వేధింపుల వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని రాసి ఉన్న సూసైడ్ నోటు లభించిందని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు కుటుంబసభ్యులు పోలీసులకు అందజేసిన సూసైడ్ నోట్‌లో ‘నేను అందరూ నావాళ్లు అనుకుని సాయం చేసిన. కానీ నన్నెవరూ అర్ధం చేసుకోలేదు. మీ నుంచి నేను వెళ్లిపోతున్నందుకు క్షమించగలరు. నా చావుకు ముఖ్య కారకులు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి’ అని రాసి ఉండటం గమనార్హం.
ఫిర్యాదు పొరపాటు... మోహన్‌రెడ్డి ప్రమేయం లేదు
ఉదయం మోహన్‌రెడ్డి వల్లే తన తండ్రి చనిపోయాడని ఫిర్యాదు చేసిన నారాయణరెడ్డి కూతురు తిరుమల మధ్యాహ్నం తల్లి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరో పిటిషన్ ఇచ్చారు. ‘గత కొద్దిరోజులుగా తన తండ్రి కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. సోమవారం నొప్పి ఎక్కువకావడంతో ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. అది గమనించి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మా నాన్న చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లు ఎప్పుడూ మా నాన్నను వేధింపులకు గురి చేయలేదు. కావున వారిపై ఎలాంటి చర్య తీసుకోవద్దు. ఇది నేను ఆరోగ్యంగా మానసికంగా ఉండి రాసి ఇస్తున్నాను’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తొలుత మోహన్‌రెడ్డే కారణమంటూ ఎందుకు ఫిర్యాదు చేశారని విలేకరులు ప్రశ్నించగా... మోహన్‌రెడ్డి బాధిత సంఘం సభ్యులు వచ్చి ఆయనపై లేనిపోనివి కల్పించి చెప్పడంతో వారి మాటలు నమ్మి పొరపాటుగా తప్పుడు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
నాకు సంబంధం లేదు : మోహన్‌రెడ్డి
నారాయణరెడ్డి చావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సస్పైండైన ఏఎస్సై మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కొందరు వ్యక్తులు తనపై పై కక్షకట్టి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు.
Advertisement