గడువు ఆరు రోజులే!
రోడ్డు ప్రమాదంలో తలకు గాయం
ఈ నెల 30 లోపు ఆపరేషన్ అత్యవసరమన్న వైద్యులు
లేకుంటే మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం
ఆపన్న హస్తం కోసం ఇల్లాలి వేడుకోలు
నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబం... పంట చేలు పచ్చగా ఉంటే పనులు దొరుకుతాయి... కూలీ పనుల ద్వారా నాలుగు రాళ్లు చేతికి అందుతాయి. ఏ రోజు సంపాదన ఆ రోజుకే సరిపోతుంది. ఇలాంటి తరుణంలో విధి వారిని వెక్కిరించింది. సంపాదనపరుడైన ఇంటి పెద్దను ప్రమాదం రూపంలో దెబ్బతీసింది. తలకు తీవ్రగాయమైన అతనికి ఈ నెల 30 లోపు శస్త్రచికిత్స చేయకపోతే శాశ్వతంగా మతిస్థిమితం కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తన భర్తకు పునర్జన్మను ప్రసాదించాలని ఆ ఇల్లాలు వేడుకుంటోంది.
చెన్నేకొత్తపల్లికి చెందిన సుజాతకు పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన నారాయణరెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఈ ఏడాది జులై 31న శెట్టిపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న నారాయణరెడ్డిని రాంపురం వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తలకు తీవ్ర గాయమైన అతన్ని పెనుకొండ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు చేస్తూ వచ్చిన సొమ్ముతో పాటు ఉన్న ఆస్తి అమ్ముకుని రూ. 6 లక్షల వరకు ఖర్చుపెట్టారు.
మరో ఆపరేషన్ అత్యవసరం
తలకు గాయమైన చోట వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే నవంబర్ 30 లోపు మేజర్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఇది కాకపోతే నారాయణరెడ్డి శాశ్వతంగా మతి స్థిమితం కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు. అయితే చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సుజాత... ఇంతకాలం భర్తకు మందులతో సరిపెడుతూ వచ్చింది. ఇటీవల అతని ప్రవర్తనలో మార్పులు రాసాగాయి. తనలో తానే మాట్లాడుకోవడం... పిల్లలపై చిరాకు పడడం మొదలైంది. దీంతో భయపడిన సుజాత తెలిసిన వారి వద్ద తన గోడు వెల్లబోసుకుంది. ఆర్థిక సాయం చేస్తే తన భర్తకు శస్త్రచికిత్స చేయిస్తానని అభ్యర్థించింది. వారు అందజేస్తున్న కొద్దిపాటి సొమ్ము అతని అత్యవసర మందులకు సరిపోతోంది. దీంతో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తన భర్తకు ఆపరేషన్ చేయించి, కుటుంబాన్ని ఆదుకోవాలని సుజాత వేడుకుంటోంది.
దాతలు సాయం చేయదలిస్తే...
పేరు ః సుజాత
బ్యాంక్ ఖాతా ః స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చెన్నేకొత్తపల్లి శాఖ
ఖాతా నంబర్ ః 32 98 97 75 679
సంప్రదించాల్సిన నంబర్ ః 98494 51737