అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
విడపనకల్లు/శింగనమల(అనంతపురం): అప్పుల బాధ తాళలేక అనంతపురం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విడపనకల్లు మండలంలోని వేల్పుమడుగుకు చెందిన అల్దప్ప కుమారుడు హరికృష్ణ(28) ఐదారేళ్లుగా సొంత భూమి ఏడెకరాలు.. కౌలుకు తీసుకున్న మరో 20 ఎకరాల్లో మిరప, వేరుశనగ పంటలు సాగు చేశాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడికి చేసిన అప్పులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గత యేడాది కూడా కౌలుకు తీసుకున్న 20 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. సరైన ధర లేకపోవడంతో అప్పు రెట్టింపయింది.
ఈ సంవత్సరం కూడా సొంత పొలంలో రెండు బోర్లు వేయించగా నీళ్లు పడలేదు. విడపనకల్లు సిండికేట్ బ్యాంకులో తల్లిదండ్రులు అల్దప్ప, లక్ష్మిదేవిల పేరిట క్రాపు లోను రు.1.50 లక్షలు తీసుకున్నాడు. బంగారంపై మరో రూ.2లక్షలు అప్పు చేశాడు. బంగారం మీద పైసా కూడా మాఫీ కాలేదని మృతుని తండ్రి అల్దప్ప ఆవేదన వ్యక్తం చేశారు. క్రాప్ లోన్‌లో మాత్రం రెండు దఫాలుగా రూ.29,500 ప్రకారం రు.59 వేలు మాఫీ అయ్యిందన్నారు. పంటల కోసం బయటి వ్యక్తులతో ఆరు çసంవత్సరాలుగా తీసుకున్న అప్పు రూ.9లక్షలకు చేరింది. పంటలు పండక.. అప్పులు తీర్చే దారి లేక శుక్రవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బళ్లారికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు విడపనకల్లు ఏఎస్ ఎర్రిస్వామి తెలిపారు.
నాలుగు బోర్లు వేసినా పడని నీరు
శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి(51)కి ఎనిమిది ఎకరాల పొలం ఉంది. భార్య రమాదేవి, ఒక కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి, కూతురు హరిత సంతానం. 2009వ సంవత్సరం వరకు చీనీ చెట్లు ఉండగా.. బోరులో నీళ్లు తగ్గిపోవడంతో చెట్లను కొట్టేశారు. అప్పట్లోనే ఉన్న భూమిని అమ్ముకుంటారని భావించిన నారాయణరెడ్డి తండ్రి పెద్ద నారాయణరెడ్డి.. మనవడు అనిల్‌కుమార్‌రెడ్డి పేరట భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సంవత్సరం నుంచి వర్షాధారం కింద వేరుశనగ సాగు చేస్తున్నారు. 2011లో కూతురు వివాహం చేశారు. 2013లో అప్పులు చేసి నాలుగు బోర్లు వేయించారు. ఒక్కో బోరు 350 నుంచి 400 అడుగుల వరుకు వేశారు. అయితే నీళ్లు పడలేదు. ఒక్కో బోరుకు రూ.40 వేల వరకు ఖర్చయింది.
ఆ ఏడాది వేసిన వేరుశనగ పంటకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున ఎనిమిది ఎకరాలకు రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో రూ.70వేల నష్టం వచ్చింది. 2014లో వేరుశనగ సాగుకు రూ.1.50లక్షలు అప్పు చేయగా.. పెద్దగా దిగుబడి రాకపోవడంతో రూ.1.20లక్షలు నష్టపోయాడు. ఇలా మొత్తం అప్పు రూ.4లక్షలకు చేరుకుంది. అదే ఏడాది కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి బీటెక్ చేరడంతో రూ.50 వేలు అప్పు చేశారు. 2015వ సంవత్సరం నుంచి వేరుశనగ సాగుకు పెట్టుబడి పెట్టేందుకు అప్పు దొరక్క ఎనిమిది ఎకరాల పొలాన్ని బీడు పెట్టుకున్నారు. అప్పటి నుంచి భూమి సాగుకు నోచుకోకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయి ఆర్థికంగా చితికిపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించేలోగానే నారాయణరెడ్డి మరణించాడు.