ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజీ | CM YS Jagan comments in High Level Review on Schools Development | Sakshi
Sakshi News home page

ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజీ

Published Thu, Sep 12 2019 4:36 AM | Last Updated on Thu, Sep 12 2019 4:36 AM

CM YS Jagan comments in High Level Review on Schools Development - Sakshi

సచివాలయంలో పాఠశాలల అభివృద్ధిపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రతి మండలానికో జూనియర్‌ కాలేజీ ఉండాలని, ఇందుకు అనుగుణంగా భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్‌ టూ వరకు పెంచుతూ జూనియర్‌ కాలేజీ స్థాయికి తీసుకు వెళ్లాలని సూచించారు. వీటిని ఎక్కడ, ఏ రకంగా చేయాలన్నదానిపై ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంపై సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల తరహాలోనే కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగు చేయడంపై దృష్టి సారించాలని చెప్పారు.

డైట్స్‌ను బలోపేతం చేయాలి
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమలు చేయాలని, ఆ తర్వాత 9, 10 తరగతులకూ వర్తింప చేయాలని ఆదేశించారు. ఇందు కోసం 70 వేల మంది టీచర్లకు ఆంగ్ల బోధనలో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆంగ్ల బోధనపై శిక్షణ ఇచ్చేలా డైట్స్‌ను బలోపేతం చేయాలని చెప్పారు. టీచర్లకు ఇచ్చే శిక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తున్నప్పటికీ తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి కసరత్తు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఖాళీల భర్తీ పక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తి చేయాలని, ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో పెట్టాలని సీఎం సూచించారు. పర్యావరణం, వాతావరణంలో మార్పులు, రహదారి భద్రతకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని స్పష్టం చేశారు. పుస్తకాలు, యూనిఫామ్, షూ, స్కూలు బ్యాగు,.. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది విద్యార్థులు స్కూల్లో చేరిన రోజే ఇవ్వాలని, ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తొలి దశలో 15,410 స్కూళ్లలో మౌలిక వసతులు
‘నాడు – నేడు’ కింద మొత్తం 44,512 పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా తొలి దశలో 15,410 స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపడతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో 9 రకాల కనీస వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలలు ప్రతి దశలో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. తొలి దశలో లక్ష్యం పెరిగినా పర్వాలేదని, ఏ పాఠశాల తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తి కావాలని చెప్పారు. చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, ఈ విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. 2020 మార్చి 14 నాటికి ‘నాడు – నేడు’ కింద తొలిదశ స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్కూళ్లలో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల ఆమోదం ఉండేలా చూడాలని, ఈ కమిటీలు సామాజిక తనిఖీలు చేయాలని సీఎం సూచించారు. స్కూళ్ల బాగు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారంటూ ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలని, స్కూళ్లను అభివృద్ధి చేయడంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. స్కూళ్ల బాగు కోసం ప్రభుత్వం క్యాంపెయిన్‌ చేయడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. 

ప్రైవేట్‌ కాలేజీల్లో సరైన సదుపాయాలుఉండాలి
ప్రయివేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్తవమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే అక్కడ సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా.. లేదా? అన్నది చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలో కూడా సరైన సదుపాయాలు ఉండాలని, అలా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా సంస్థ ఉండడం సరికాదని, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుందని, ప్రయివేటు సంస్థలు చేయాల్సిన పనులు వాళ్లు చేయాలని సీఎం పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న కోడి గుడ్లపై గతంలో బాగా నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అందుకే ప్రస్తుతం గుడ్ల పంపిణీని వికేంద్రీకరించామని చెప్పారు. నాణ్యమైన గుడ్లు విద్యార్థులకు అందేలా ఇంకా ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై మరిన్ని ఆలోచనలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారులకు అందేలా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలను తెరిచే బాధ్యత గ్రామ వలంటీర్లదేనని సీఎం స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement