మార్చి 11 నుంచి ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగా ప్రశ్నపత్రాలతో ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన షెడ్యూలును ఇంటర్మీడియెట్ బోర్డు సిద్ధం చేసి ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. అయితే షెడ్యూలు ఒకటే అయినా ప్రశ్నపత్రాలు మాత్రం వేర్వేరుగానే ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు ఉత్తర్వులను ఒకటీ రెండు రోజుల్లో జారీ చేసి, బోర్డు కార్యదర్శిని నియమించి షెడ్యూలు జారీ చేయాలని భావిస్తోంది. మొదట మార్చి 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలు చేసినా, పని దినాలు సరిపోవన్న నిర్ణయానికి ప్రస్తుత బోర్డు వచ్చింది. మరోవైపు జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 4న, ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఉన్నందున మార్చి 18వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణ కుదరనే అభిప్రాయానికి వచ్చారు.
అందుకనుగుణంగా కాస్త ముందుగా, అంటే మార్చి 11వ తేదీ నుంచే ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును ఖరారు చేసింది. తెలంగాణ బోర్డు కార్యదర్శి నియామకం జరిగిన వెంటనే తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈనెల 13వ తేదీలోగా పరీక్షలపై ప్రభుత్వాల నిర్ణయాలను తెలియజేయాలని ప్రస్తుత ఇంటర్ బోర్డు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఇటీవలే లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారాన్ని తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
త్వరగా తేల్చాలని సీఎస్‌కు విజప్తి..
ఇంటర్మీడియెట్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, విద్యావేత్త చుక్కా రామయ్య తదితరులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను వార్షిక పరీక్షలకంటే ముందుగానే నిర్వహించాల్సి ఉంటుందని సీఎస్‌కు వివరించారు. ఇందులో భాగంగా షెడ్యూలును వెంటనే జారీ చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.