విద్యా సమాచారం | Educational information | Sakshi
Sakshi News home page

విద్యా సమాచారం

Published Tue, Oct 20 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

Educational information

వచ్చే నెల 18వరకు ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు

 సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ప్రకటించింది. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు, హాజరు మినహాయింపుతో (కాలేజీకి వె ళ్లకుండా) పరీక్షలు రాసే విద్యార్థులు వచ్చే నెల 18 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొంది. అయితే ఇప్పటివరకు రూ.300గా ఉన్న ఫీజును రూ.360కు పెంచారు.

 ఇదీ ఫీజు చెల్లింపు షెడ్యూలు
 ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 18 ఆఖరి తేదీ.
 రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబరు 9 వరకు.
 రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబరు 10 నుంచి 22 వరకు.
 రూ. 1000 ఆలస్య రుసుముతో డిసెంబరు 23 నుంచి 2016 జనవరి 6 వరకు.
 రూ. 2000 ఆలస్య రుసుముతో 2016 జనవరి 7 నుంచి 22 వరకు.
 రూ. 4000 ఆలస్య రుసుముతో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 5 వరకు.
 రూ. 6000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 6 నుంచి 25 వరకు.

వెబ్‌సైట్‌లో ఏఈఈ ప్రాథమిక కీ
 సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకొని ఈ ‘కీ’ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం కమిషన్ వెబ్‌సైట్లో ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచారు.
 
జేఎన్టీయూహెచ్ నేటి ఎంటెక్ పరీక్షలు వాయిదా
 హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ పరిధిలో ఈ నెల 20న జరుగనున్న ఎంటెక్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆ వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ డాక్టర్ బి. ఆంజనేయప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో ఆ రోజు జరగాల్సిన ఎంటెక్ పరీక్షలను ఈ నెల 26న యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
నేటి ఓయూ పరీక్షలు కూడా...
 హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం (20న) జరగాల్సిన వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ భిక్షమయ్య తెలిపారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించినందున నేటి పరీక్షలను వాయిదా వేశామన్నారు. తిరిగి నిర్వహించు పరీక్షల తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.
 
ఓయూ ఎల్‌ఎల్‌బీ ఫలితాలు విడుదల
 హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఆగస్టులో జరిగిన ఎల్‌ఎల్‌బీ (మూడు, ఐదో ఏడాది) కోర్సుల మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్, రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీ క్షల ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఫలితాలు, ఇతర వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పారు.
 
డీఎడ్ కాలేజీల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సిబ్బంది, సదుపాయాలకు సంబంధించి మంగళవారం నిర్వహించనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా పడింది. సెలవు దినం కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సదుపాయాల కల్పనలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన 109 కాలేజీలకు విద్యాశాఖ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ కాలేజీల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొంది. అయితే తిరిగి వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
 
 27న ఎమ్మెస్సీ నర్సింగ్ తుది విడత  కౌన్సెలింగ్
 విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల 27వ తేదీన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఎండీ (ఆయుర్వేద, హోమియో) కోర్సుల్లో అడ్మిషన్లకు జరిగే కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియను వర్సిటీలోనే నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 30న ఎండీ ఆయుర్వేద, 31న ఎండీ హోమి యో కోర్సులకు ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు వివరించారు. మరిన్ని వివరా లు వర్సిటీ (Http: ntruhs.ap.nic.in) వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement