నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
1,02,541 మంది విద్యార్థులు
110 పరీక్షా కేంద్రాలు
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఛాన్స్
విద్యార్థి దశలో ఎంతో కీలకమైన ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఈ పరీక్షలు బంగారు భవిష్యత్తుకు సోపానాలు వేస్తాయి. రేపటి మంచి రోజులకు భరోసా ఇస్తాయి. నేటి విద్యార్థులకు ఈ సంగతి తెలియంది కాదు.. అందుకే వారు అహర్నిశలూ శ్రమించారు. ఎన్నో ఆశలతో ఎగ్జామ్స్‌కు సిద్ధమయ్యారు. అయితే పరీక్షలు మొదలు కాబోతున్న వేళ కాస్త ఒత్తిడి, ఆందోళన సహజం. అందుకే విద్యార్థులంతా విజయం మీదే అని విశ్వసించండి.. మీమీద మీరు నమ్మకముంచండి. అంతా బాగుంటుందన్న పాజిటివ్ దృక్పథంతో పరీక్షకు సిద్ధం కండి.. ఆల్ ది బెస్ట్!
విశాఖపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. బుధవారం నుంచి 21 తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం ఈసారి ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించకూడదన్న కఠిన నిర్ణయం తీసుకుంది. అందువల్ల అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,02,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 52,107 మంది, ద్వితీయ సంవత్సరం 50,434 మంది ఉన్నారు. ఇందుకోసం 110 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో నగరంలో 56, గ్రామీణ జిల్లాలో 41, మన్యంలో 13 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 16 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్ సెంటర్లను తెరవడానికి అనుమతించలేదు. ఒకవేళ తెరిస్తే నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.
జంబ్లింగ్ విధానం
జిల్లాలోని మొత్తం 110 కేంద్రాల్లో జంబ్లింగ్ విధానం లో పరీక్షలు జరగనున్నాయి. కానీ కళాశాలకు, కళాశాలకు మధ్య 30 కి.మీలకు పైగా దూరంతో పాటు ఆయా చోట్లకు బస్సు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఐదు కళాశాలలకు జంబ్లింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. దీంతో ఆ కళాశాలల్లో చదువుతు న్న దాదాపు 1200 మంది విద్యార్థులు అక్కడే పరీక్ష లు రాసుకునే వెసులుబాటు దక్కింది. వాటి వివరాలు..
కొయ్యూరు గిరిజన సంక్షేమ కళాశాల (బాలురు)
ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కాలేజి
పెదబయలు గిరిజన సంక్షేమశాఖ ఎస్టీ కళాశాల (బాలురు)
అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల
జీకేవీధి గిరిజన సంక్షేమశాఖ ఎస్టీ కళాశాల (బాలికలు)
సమస్యాత్మక కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా 16 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కేడీపేట
గిరిజన సంక్షేమ కళాశాల (బాలురు), కొయ్యూరు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల, అనంతగిరి
గిరిజన సంక్షేమ కళాశాల (బాలికలు) అనంతగిరి
గిరిజన కళాశాల, అరకువేలి
ప్రభుత్వ కళాశాల, అరకువేలి
ప్రభుత్వ కళాశాల, ముంచంగిపుట్టు
గిరిజన సంక్షేమ కళాశాల(బాలురు), పెదబయలు
ప్రభుత్వ జూనియర్ కాలేజి, హుకుంపేట
ప్రభుత్వ కళాశాల, పాడేరు
గిరిజనసంక్షేమ కళాశాల (బాలికలు), పాడేరు
ప్రభుత్వ కళాశాల, జి.మాడుగుల
అప్పర్ సీలేరు ప్రభుత్వ కళాశాల
ప్రభుత్వ కళాశాల, చింతపల్లి
గిరిజన కళాశాల, చింతపల్లి
గిరిజన సంక్షేమ కళాశాల (బాలికలు) జీకేవీధి
సీసీ కెమెరాలతో నిఘా
మరో వైపు ఈ ఏడాది సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సెంటరులో 2 నుంచి 4 వరకు అమరుస్తున్నారు. వీటికి తొలిసారిగా విశాఖలోని ఇంటర్ కార్యాలయం నుంచి హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయానికి ఇంటర్నెట్ ద్వారా అనుసంధానిస్తారు. దీంతో ఆయా కేంద్రాల్లో జరిగే పరీక్షల తీరును నేరుగా తెలుసుకో గలుగుతారు. దీని ద్వారా పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు, అక్రమాలు, మాస్‌కాపీయింగ్‌ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ముందుగానే చేరుకోవాలి
పరీక్షలు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. 9 గంటలు దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే విద్యార్థి భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉం ది. అలాగే విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌పై తమ పేరు, హాల్‌టిక్కెట్ నంబరు, మీడియం, సబ్జెక్టుతో ఆధార్ నంబరు సరిగా ఉందో లేదో సరి చూసుకోవాలి.
బెస్ట్ ఆఫ్ లక్
Published Tue, Mar 1 2016 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement
Advertisement