సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి ఆ కేసు నుంచి పూర్తిగా విముక్తి పొందాకే పదోన్నతి పొందేందుకు అర్హుడని హైకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులో కింది కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇచ్చినా, ఆ స్టే ఉత్తర్వులను చూపుతూ పదోన్నతి కోరజాలరని తేల్చిచెప్పింది. ఉద్యోగిపై శాఖాపరమైన విచారణ మొదలుపెట్టినా లేదా క్రిమినల్ కేసు, అభియోగాలు, అభియోగపత్రం దాఖలైనా ఆ ఉద్యోగికి పదోన్నతినివ్వడాన్ని వాయిదా వేయొచ్చని 1991లో ప్రభుత్వం జీవో 66 జారీ చేసిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసుపై స్టే విధించినా తనకు పదోన్నతి ఇవ్వడం లేదంటూ ఓ ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు.
నకిలీ సర్టిఫికెట్లతో..
కర్నూలుకు చెందిన నాగరాణి 1996లో కారుణ్య నియామకం కింద ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. నియామకపు తేదీ నుంచి మూడేళ్లలో ఇంటర్ పూర్తి చేయాలని అధికారులు ఆమెకు స్పష్టం చేశారు. ఇంటర్ పూర్తికి తనకు మరో మూడేళ్ల గడువునివ్వాలని ఆమె అభ్యర్థించగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2001లో నాగరాణి బీఏ సర్టిఫికెట్లను సమర్పిస్తూ వీటి ఆధారంగా తన సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరారు. బెటాలియన్ కమాండెంట్ ఆ సర్టిఫికెట్లు నిజమైనవో, కావో తేల్చాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పంపారు.
వాటిని పరిశీలించిన వర్సిటీ అధికారులు నకిలీవని తేల్చారు. దీంతో నాగరాణిని సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ కమాండెంట్ ఉత్తర్వులిచ్చారు. శాఖాపరమైన శిక్ష కింద ఏడాది పాటు ఇంక్రిమెంట్‌ను వాయిదా వేశారు. 2002లో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అదే ఏడాది ఆమెకు అభియోగాలకు సంబంధించి మెమోరాండం ఇచ్చారు. మరోవైపు నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై కర్నూలు నాలుగో టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా 2004లో జూనియర్ అసిస్టెంట్‌గా ఆమె సర్వీసులను క్రమబద్ధీకరించారు.
ఇదే సమయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో కర్నూలు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. నాగరాణిని దోషిగా తేలుస్తూ ఆమెకు మూడు నెలల జైలుశిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై ఆమె 2008లో కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు ఆమెకు విధించిన జైలుశిక్షను రద్దు చేసింది. తిరిగి సరైన అభియోగం నమోదు చేసి ఆమె వాదనలు విని తీర్పు వెలువరించాలని కింది కోర్టుకు సూచించింది. దీనిపై నాగరాణి 2009లో హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కర్నూలు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జరుపుతున్న విచారణపై స్టే విధించింది.
పదోన్నతినిచ్చేలా ఆదేశాలివ్వండి..
కాగా తనపై కోర్టు కేసు పెండింగ్‌లో ఉందన్న కారణంతో తనకు ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి ఇవ్వడం లేదని, దీనిని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ 2021లో నాగరాణి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. నాగరాణిపై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత వరకు ఆమె పదోన్నతికి అర్హురాలు కాదని తేల్చిచెప్పారు.
చదవండి: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్‌షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన
Comments
Please login to add a commentAdd a comment