AP High Court Verdict In Favour Of Women Employee After 20 Years - Sakshi
Sakshi News home page

ఓ మహిళా చిరుద్యోగి.. 20 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి

Published Tue, Jun 6 2023 10:11 AM | Last Updated on Tue, Jun 6 2023 2:53 PM

Andhra Pradesh: High Court Verdict In Favour Of Women Employee After 20 Years - Sakshi

సాక్షి, అమరావతి: తన సర్వీసు క్రమబద్ధీకరణ, జీతభత్యాల విషయంలో 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన న్యాయ పోరాటంలో ఓ మహిళా చిరుద్యోగి చివరకు విజయం సాధించారు. అధికారుల తీరును తప్పుపడుతూ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన నాటి నుంచే (2009) ఆ మహిళా ఉద్యోగి నోషనల్‌ పే పొందేందుకు అర్హురాలన్న అధికారుల వాదనను తోసిపుచ్చింది. ఆమె తన సర్వీసు క్రమబద్ధీకరణ నాటి నుంచే (1993) నోషనల్‌ పేకు అర్హురాలని స్పష్టం చేసింది. అలాగే నోషనల్‌ పే బకాయిలకు సైతం ఆమె అర్హురాలేనని తేల్చిచెప్పింది.

ఆమెకు అనుకూలంగా ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేసిందని.. అయితే అధికారుల లోపం, నిర్లక్ష్యం వల్లే ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడంలో తీవ్ర జాప్యం జరిగిందని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారుల చేసిన తప్పులకు ఆ మహిళా ఉద్యోగికి చట్టప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలను అడ్డుకోలేమని కుండబద్దలు కొట్టింది. ఆ మహిళకు అనుకూలంగా ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులు చట్టప్రకారమే ఉన్నాయని, అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాక రూ.10 వేలను ఆమెకు ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ వెణుతురుమిల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

జీతం చెల్లించకపోవడంతో న్యాయ పోరాటం.. 
వైఎస్సార్‌ జిల్లా రాజంపేటకు చెందిన జి.పుల్లమ్మ 1986లో తాత్కాలిక ప్రాతిపదికన కడప చిల్డ్రన్‌ హోం సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఆయాగా చేరారు. 1994లో ప్రభుత్వం జీవో 212 జారీ చేసింది. దీని ప్రకారం.. 1993కు ముం­­దు తాత్కాలిక పద్ధతిలో నియమితులైన వారందరి పోస్టులను క్రమబద్ధీకరించాలని ఆదేశాలిచ్చింది. దీంతో పుల్లమ్మ సర్వీసును కూడా 1993 నుంచి క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొంటూ 1994లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆమెను రైల్వేకోడూరు చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కా­ర్యా­లయంలో అటెండర్‌గా నియమించారు. అయి­తే 2001 జూన్‌ నుంచి ఆమెకు జీతం చెల్లించ­డం నిలిపేశారు. దీంతో పుల్లమ్మ జీతం కోసం ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ పుల్లమ్మకు జీతం చెల్లించాలంటూ 2003లో అధికారులను ఆదేశించింది.

అయితే అధికారులు జీతం చెల్లించలేదు. అంతేకాకుండా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా ఆమె ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించారని పే­ర్కొం­టూ ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. దీన్ని పుల్లమ్మ 2004లో మరోసారి ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్‌.. సర్వీసు క్రమబద్దీకరణ విషయంలో ఆమె పెట్టుకున్న దరఖాస్తుపై తగిన నిర్ణయం వెలువరించాలని 2006లో అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆమె సర్వీసు క్రమబద్ధీకరణ విషయాన్ని పక్కన పెట్టి, జీతాన్ని రూ.3,850గా సవరించి.. 2005 నుంచి బకాయిలు చెల్లిస్తున్న­ట్టు పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. అయితే అధికారులు తన ఉద్యోగం క్రమబద్దీకరణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పుల­మ్మ 2006లోనే ట్రిబ్యునల్‌లో మరో పిటిషన్‌ వేశారు. దీంతో అధికారులు ఆమె జీతాన్ని 2003 నుంచి చెల్లిస్తామని పేర్కొన్నారు. అయితే తాను 1993లో నియమితులయ్యానని, అప్పటి నుంచి సవరించిన జీతాన్ని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పుల్లమ్మ 2007లో మరోసారి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

విచార­ణ జరిపిన ట్రిబ్యునల్‌ ఆమె సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ ఆదేశాలిచ్చింది. అయినా కూడా అధికారులు పట్టిం­చుకోకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ చేయడంతో దిగొచ్చిన అధికారులు ఆమె సర్వీసును క్రమబద్ధీకరిస్తూ 2009లో జీవో జారీ చేశారు. దీంతో ఆమె 2010లో సేవిక పోస్టులో నియమితులయ్యారు. అయితే ఆమెకు చెల్లించా­ల్సి­న ఇతర ప్రయోజనాల విషయంలో అధికారులు స్పందించలేదు. దీంతో ఆమె 1994 నుంచి తనకు రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ చెల్లించే­లా అధికారులను ఆదేశించాలంటూ 2010లో ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ 1993 నుంచే పుల్లమ్మ సర్వీసును క్రమబద్దీకరిస్తున్నట్లు పేర్కొంది. తమ ఆదేశాల­కు అనుగుణంగా చెల్లింపులను సవరించాలని అధి­కారులను ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అధికారులు హైకోర్టులో 2013­లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విన్న ధర్మాసనం అధికారు­లు పుల్లమ్మ సర్వీసు క్రమబద్ధీకరణ, జీతం చెల్లింపులో ఆమెను ఇబ్బంది పెట్టారని వ్యా­ఖ్యా­నించిం­ది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎ­లాంటి త­ప్పులేదంటూ అధికారుల పిటిషన్‌ను కొట్టేసింది.­

చదవండి: నట్టేట ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్‌ ఇదేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement