సబ్సిడీపై పంపిణీ చేసిన ఎల్‌ఈడీ బల్బు
-
భ్రాంతిగా మారిన ఎల్‌ఈడీ కాంతి
-
ఇంటికి రెండిస్తామని చెప్పిన ప్రభుత్వం
-
శతశాతం పంపిణీ చేస్తామన్న ఈపీడీసీఎల్
-
మూలకు చేరిన బల్బులకు అతీగతీ లేదు
-
బల్బులకు ముఖం చాటేస్తున్న ఈఈఎస్‌ఎల్
శ్రీకాకుళం టౌన్:
విద్యుత్ వాడకాన్ని తగ్గించుకునేందుకు ప్రతి ఇంటికీ ఎల్‌ఈడీ బల్బులను సబ్సిడీపై పది రూపాయలకే అందిస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం ఆ మేరకు లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. విద్యుత్ బిల్లులు తగ్గుతాయన్న ఆశతో వినియోగదారులు ఇంట్లో ఉన్న బల్బులను తీసేసి ఎల్‌ఈడీలను అమర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ప్రతీ ఇంటికి రెండు బల్బులను తప్పనిసరి చేస్తే విద్యుత్ వినియోగం పెద్దెత్తున తగ్గుతోందని అధికారులు అంచనా వేశారు. అందులో భాగంగా జిల్లాలో విద్యుత్ వినియోగదారులందరికీ తన ఇంట్లో ఉన్న బల్బులకు తోడు రెండునెలల పాటు విద్యుత్ వినియోగానికి చెల్లిస్తున్న చార్జీల బిల్లులను అందజేయడంతో పాటు 20 రూపాయలు చెల్లిస్తే గ్రామంలోనే ఎల్‌ఈడీ బల్బులు అందజేస్తామని ప్రటనలు ఇచ్చారు. అకారణంగా బల్బులు పాడైతే తిరిగి వాటిని బిల్లు చెల్లించే చోట అందజేస్తే కొత్తవి ఇస్తామని ప్రకటించారు. ఈ మాటలు నమ్మిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఎల్‌ఈడీ బల్బులకు క్యూ కట్టారు. అయితే జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల పంపిణీ కార్యక్రమంలో ఇంకా లక్షన్నర కుటుంబాల దరి చేరలేక పోయింది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం 6.44 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు గత ఏడాది కొత్తగా 32 వేల కనెక్షన్లను మంజూరు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు మరో 12 వేల కొత్త కనెక్షన్లు మంజూరయ్యాయి, మొత్తం గృహ వినియోగదారుల సంఖ్య 6.90 లక్షల వరకు చేరింది. కాని ఇంతవరకు తొలివిడతలో 5.32 లక్షల మందికి ఒక సర్వీసుకు రెండు బల్బుల వంతున గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 10.65 లక్షల బల్బులను సరఫరా చేశారు. ఈ ఏడాది మార్చిలో రెండో విడత కింద 19,128 మంది లబ్థిదారులకు 38,256 బల్బులను మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా లక్షన్నర కుటుంబాలకు ఎల్‌ఈడీ బల్బులను సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. దీనికితోడు ఎల్‌ఈడీ బల్బులు సరఫరా చేసిన ఈఈఎస్‌ఎల్ సంస్థ ఇప్పుడు ముఖం చాటేస్తుండడంతో కొత్త సమస్య తలెత్తుతోంది. గతంలో పంపిణీ సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏకారణం చేతనైనా బల్బు వెలగక పోతే వాటిని తిరిగి సంస్థ తీసుకుని కొత్తవి ఇస్తారని గతంలో ప్రభుత్వంతోపాటు సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఈపీడీసీఎల్ సంస్థ కార్యాలయంలో బిల్లులు చెల్లించే స్థలాల్లో వీటిని తిరిగి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. కాని అలాంటి కౌంటర్లు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా.. వారు ఏమీ చేయలేని స్థతిలో నిట్టూరుస్తున్నారు.
మూడున్నర లక్షల బల్బులు అవసరం
జిల్లాకు ఇంకా మూడున్నర లక్షల ఎల్‌ఈడీ బల్బులు అవసరమవుతోందని గుర్తించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయానికి గతంలో లేఖలు రాశాం. రెండో విడత కేవలం 32 వేల బల్బులే పంపిణీ అయ్యాయి. మిగిలిన రెండున్నర లక్షల బల్బులు ఇంకా సరఫరా కావాల్సిఉంది. ఈఈఎస్‌ఎల్ సంస్థ ప్రతినిధులను ఇప్పటికే పలుమార్లు సరఫరా కోసం సంప్రదించాం. ఇంకా బల్బులు రాక పోవడంతో పంపిణీ సాధ్యం కాలేదు.
– డి.సత్యనారాయణ, ఎస్‌ఈ, తూర్పు విద్యుత్ పంపిణీసంస్థ(ఆపరేషన్స్)