ఒకరు కాదు..ముగ్గురు!
ఒకరు కాదు..ముగ్గురు!
Published Fri, Jul 22 2016 12:07 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
అనుకున్నదే జరుగుతోంది. ‘సాక్షి’ కథనం నిజమవుతోంది. జిల్లా కలెక్టర్ యువరాజ్ కేంద్ర సర్వీసులకు వెళ్లడం ఖాయమైంది. ఆయనతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులకు స్థానచలనం ఖాయమని తెలుస్తోంది. ఖాళీ అవుతున్న కలెక్టర్ పోస్టులోకి జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మారనున్నారు. అలాగే ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్న ముత్యాలరాజు నెల్లూరు కలెక్టర్‌గా వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ రెండు కీలక పోస్టుల్లోకి కొత్తగా ఎవరు వస్తారన్నది ఇంకా వెల్లడి కాలేదు. తాజా మార్పులపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
సాక్షిప్రతినిధి, విశాఖపట్నం: జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ ఎన్.యువరాజ్ మార్పు ఖాయం కావడంతో ఆయన స్థానంలో జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పదోన్నతిపై నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా పనిచేసిన ప్రస్తుత కలెక్టర్ యువరాజ్ సతీమణి జానకి ఏడాదిన్నర క్రితం నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. యువరాజ్–జానకీ దంపతులను స్టేట్ క్యాడర్ నుంచి కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేందుకు కేంద్రం ఆసక్తి చూపింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. నెల్లూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న జానకీ ఇప్పటికే అక్కడ విధుల నుంచి రిలీవ్ కాగా అదే బాటలో త్వరలో యువరాజ్‌ను కూడా రిలీవ్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు యువరాజ్ స్థానంలో ఎవరిని నియమించాలన్న సందిగ్ధంలో సర్కార్ ఉంది. ఐటీడీఏ పీవో హరినారాయణ పేరు తొలుత ప్రాథమికంగా పరిశీలనలోకి వచ్చింది. అయితే త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగనుండడం.. సుమారు రూ.2,250 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖలో పెద్ద ఎత్తున అభివద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కనున్న తరుణంలో జీవీఏంసీతో పాటు అటు జిల్లాపై అవగాహన ఉన్న వారినే ఇక్కడ కలెక్టర్‌గా నియమిస్తే రెండు విధాలుగా మేలు జరుగుతుందన్న ఆలోచనకు వచ్చిన ప్రభుత్వం, ఆ దిశగా అన్వేషణ మొదలెట్టింది. గతంలో జేసీగా పనిచేసి..ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్నందున జిల్లాపై అవగాహన ఉన్న ప్రవీణ్ కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. కాగా జాయింట్ కలెక్టర్‌గా జిల్లాకు వచ్చిన ప్రవీణ్‌కుమార్ హుద్‌హుద్ తుఫాన్ తర్వాత తొలుత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అయితే కొద్దికాలానికే తిరిగి జీవీఎంసీ కమిషనర్‌గా పోస్టింగ్ పొందారు. గత ఏడాదిన్నరగా జీవీఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇదే జిల్లాలో ఆయనకు కలెక్టర్‌గా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం సముఖంగా ఉన్నట్టు తెలిసింది. మరో పక్క ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా గత ఏడాదిన్నరగా పనిచేస్తున్న ఆర్.ముత్యాలరాజుకు పదోన్నతి కల్పిస్తూ ఇప్పటికే రిలీవ్ అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి స్థానంలో నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.
Advertisement
Advertisement