విద్యుత్తు ‘రీ’ షాక్!
- ఆలస్య రుసుం అడ్డంగా పెంచేసిన వైనం
- ఈపీడీసీఎల్ నిర్ణయంతో వినియోగదారులకు భారం
యలమంచిలి: విద్యుత్ చార్జీల భారంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఈపీడీసీఎల్ మరో షాక్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా రీ కనెక్షన్ చార్జి (ఆలస్య రుసుం) అడ్డంగా పెంచేసింది. ఆదాయ అన్వేషణలో ఉన్న ఈపీడీసీఎల్ వినియోగదారుల జేబులు ఖాళీ చేసే చర్యలకు దిగుతోంది. ఇప్పటివరకు ఆలస్య రుసుంగా 500 వాట్ల వరకు రూ. 25లు, 500 వాట్లు దాటి వినియోగించేవారి నుంచి రూ. 75లు వసూలు చేస్తున్నారు.
ఇప్పుడు 500 వాట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికీ రూ. 75లు రీ కనెక్షన్ చార్జి విధిస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో నెలకు ఒకసారి, గ్రామాల్లో రెండు నెలలకోసారి రీడింగ్ నమోదు చేస్తున్నారు. విద్యుత్ బిల్లులను ప్రతీ నెలా 10, 20వ తేదీల్లోగా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఆలస్యంతో కొంతమొత్తంలో సర్‌చార్జిని వసూలు చేస్తున్నారు.
గడువులోగా విద్యుత్ బిల్లులను చెల్లించని వినియోగదారుల ఇళ్లకు విద్యుత్ శాఖ సిబ్బంది వెళ్లి విద్యుత్ మీటర్ల ఫీజులను పట్టుకుపోతున్నారు. దీంతో వినియోగదారులు రీ కనెక్షన్ చార్జి చెల్లించి బిల్లును విద్యుత్ శాఖ సిబ్బందికి చూపిస్తేనే మళ్లీ ఫీజులు ఇస్తున్నారు. విద్యుత్ రీడింగ్ నమోదుచేసే పనిని కాంట్రాక్టర్లకు అప్పగించడంవల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ రీడింగ్‌లు సక్రమంగా తీయడంలేదు. దీంతో వినియోగదారులకు అవగాహన లేకపోవడంతో బిల్లులు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోంది.
ఒక్కరోజు ఆలస్యానికి కూడా రూ. 75లు రీకనెక్షన్ చార్జి చెల్లిస్తున్నారు. 500 వాట్లు లోపు విద్యుత్‌ను వినియోగించేవారే ఎక్కువగా ఉన్నారు. పెంచిన రీకనెక్షన్ చార్జి వారికి అదనపు భారం కానుంది. రూ. 100లు బిల్లు చెల్లించే వినియోగదారుడు కూడా రీకనెక్షన్ చార్జి కింద రూ.75లు చెల్లించవలసిందే. దీంతో ఈపీడీసీఎల్ వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.