NPDCL
-
విద్యుత్ బిల్లుల ఎత్తి‘మోత’లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం 2020–21లో 3,575 మిలియన్ యూనిట్లు ఉండగా, 2021–22లో 4,282 ఎంయూలకు పెరిగింది. 2022–23లో వీటికి ఏకంగా 13,826 ఎంయూల విద్యుత్ అవసరం కానుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదిక–2022–23లో స్పష్టం చేశాయి. మరోవైపు రూ.5,652 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. ఈ సబ్సిడీ, ఎత్తిపోతల పథకాల బిల్లులు కలిపి 2022–23లో డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.13,312 కోట్లను చెల్లించాల్సి ఉండనుంది. దక్షిణ డిస్కంలో ఇలా.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,617 ఎంయూల విద్యుత్ వినియోగించగా, 2021–22లో 13 శాతం అదనంగా 1,830 ఎంయూలను వినియోగించాయి. కాగా 2022–23లో ఏకంగా 190 శాతం అదనంగా 5,325 ఎంయూల విద్యుత్ వినియోగించనున్నాయని దక్షిణ డిస్కం అంచనా వేసింది. 2021–22లో ఎత్తిపోతల పథకాల బిల్లుల ద్వారా రూ.1,211.89 కోట్లను సంస్థ ఆర్జించగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.21,820.56 కోట్లలో ఇది 5 శాతం ఉంటుందని అంచనా. 2022–23లో రూ. 2,505.05 కోట్లను ఆర్జించనుండగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.24,610.33 కోట్లలో ఎత్తిపోతల బిల్లుల వాటా 10 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఉత్తర డిస్కం పరిస్థితి ఇదీ.. ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,958 ఎంయూల విద్యుత్‌ను వాడగా, 2021–22లో 25 శాతం వృద్ధితో 2,452 ఎంయూలు వినియోగించాయి. 2022–23లో ఏకంగా 246 శాతం వృద్ధితో 8,501 ఎంయూల విద్యుత్ అవసరం కానుందని ఉత్తర డిస్కం అంచనా వేసింది. సంస్థకు 2021–22లో రూ.7,175 కోట్ల వార్షిక ఆదాయం అంచనా కాగా, అందులో రూ.1,646 కోట్ల (23 శాతం)ను ఎత్తిపోతల విద్యుత్ బిల్లుల రూపంలో ఆర్జించనుంది. 2022–23లో సంస్థకు రూ.10,703 కోట్ల వార్షిక ఆదాయం రానుందని అంచనాలుండగా, అందులో ఏకంగా రూ.5,155 కోట్లు (48శాతం) ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల రూపంలో రానున్నాయి. -
డిస్కంల నష్టాలు రూ.36,231 కోట్లు
హైదరాబాద్: డిస్కంలు నష్టాలతో డిష్యుం డిష్యుం అంటున్నాయి. ఏటేటా నష్టాలు ఎట్లెట్లా ఎగబాకుతున్నాయో నివేదికలు తాజాగా వెల్లడించాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు ఏకంగా రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లు నష్టాల్లో ఉండగా, 2018–19లో కొత్తగా మరో రూ.8,022.21 కోట్ల నష్టాలు జతయ్యాయి. దక్షిణ/ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎస్పీడీసీఎల్/ టీఎస్ఎన్పీడీసీఎల్)లు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక నివేదికలు ఈ సంచలన విషయాలను బహిర్గతం చేశాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీ డీసీఎల్) నష్టాలు 2017–18 ముగిసేలోగా రూ.19,395.03 కోట్లుండగా, 2018–19 నాటికి 24,362.30 కోట్లకు పెరిగాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) నష్టాలు 2017–18 ముగిసేనాటికి రూ.8,814.23 కోట్లుండగా, 2018–19 నాటికి రూ.11,869.17 కోట్లకు ఎగబాకాయి. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.5,764.95 కోట్ల విద్యుత్ సబ్సిడీలను మంజూరు చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్ల సబ్సిడీలు ఇస్తున్నా, డిస్కంల నష్టాలు శరవేగంగా పెరిగిపోతుండటం గమనార్హం. ఎన్పీడీసీఎల్ ఆదాయంలో 40% సబ్సిడీలే.. టీఎస్ఎన్పీడీసీఎల్ 2018–19లో 19,119.78 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను సమీకరించగా, అందులో 17,226.28 ఎంయూల విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించింది. మిగిలిన 1,893.50 ఎంయూల విద్యుత్ పంపిణీ నష్టాల రూపంలో వృథా అయింది. విద్యుత్ కొనుగోళ్లకు రూ.10,461.63 కోట్లు, ట్రాన్స్మిషన్, ఎస్ఎల్డీసీ చార్జీల కోసం రూ.459.49 కోట్లు కలిపి మొత్తం రూ.10,291.13 కోట్లను ఖర్చుచేసింది. విద్యుత్ అమ్మకాలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, దానిపై వడ్డీలు, జరిమానాలు, విద్యుత్ చౌర్యం/అక్రమాల రికవరీలు, వినియోగదారుల నుంచి ఇతర చార్జీల వసూళ్ల ద్వారా ఎన్పీడీసీఎల్ రూ.6,027.55 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,254.15 కోట్ల విద్యుత్ సబ్సిడీలు, రూ.113.30 కోట్ల అదనపు సబ్సిడీలను మంజూరు చేసింది. దీంతో 2018–19లో ఎన్పీడీసీఎల్ రూ.10,395 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎన్పీడీసీఎల్ మొత్తం ఆదాయంలో ప్రభుత్వ సబ్సిడీల వాటే 41 శాతానికిపైగా ఉండటం గమనార్హం. అధికధరకు కొని తక్కువధరకు విక్రయం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 2018–19లో 44,997.11 ఎంయూల విద్యుత్‌ను కొనుగోలు చేయగా, 40,342.50 ఎంయూల విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించింది. మిగిలిన 4,654.61 ఎంయూల విద్యుత్ పంపిణీ నష్టాల రూపంలో వృథా అయింది. ఈ మేరకు విద్యుత్ కొనుగోళ్లు, ట్రాన్స్మిషన్, ఇతర చార్జీలు కలిపి సంస్థ రూ.24,837.33 కోట్లు వ్యయం చేసింది. ఉద్యోగుల జీతభత్యాల కోసం మరో రూ.2,134.85 కోట్లు వెచ్చించింది. వినియోగదారులకు విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.23,899.76 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో రూ.1,397.50 కోట్ల సబ్సిడీలున్నాయి. జీతభత్యాల వ్యయం తడిసిమోపెడు విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ, పెన్షనర్లకు అదనంగా మరో 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను 2018 ఏప్రిల్ నుంచి అమలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కన్నా అధికంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల జీతాలు పీఆర్సీ అమలుతో మరింత భారీగా పెరిగిపోయాయి. 2017–18లో రూ.2,541.27 కోట్లున్న రెండు డిస్కంల ఉద్యోగుల జీతభత్యాల వ్యయం 2018–19లో రూ.4,059.69 కోట్లకు పెరిగిపోయింది. టీఎస్ఎస్పీడీసీఎల్ జీతభత్యాల వ్యయం రూ.1,876.93 కోట్ల నుంచి రూ.2,134.85 కోట్లకు, టీఎస్ఎన్పీడీసీఎల్ జీతభత్యాల వ్యయం రూ.664.34 కోట్ల నుంచి రూ.1,624.84 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీకి అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా పెన్షనర్లకు అదనంగా 7.5 శాతం ఫిట్మెంట్ వర్తింపజేశారని కాగ్ అభ్యంతరం తెలిపింది. ట్రాన్స్‌కో సంస్థ జారీ చేసే ఉత్తర్వులను డిస్కంలు కూడా అమలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని, పెన్షనర్ల విషయంలో సైతం ఇదే చేశామని, ఇందులో ఉల్లంఘనలేమి లేవని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం కాగ్‌కు వివరణ ఇచ్చింది. -
ఎన్పీడీసీఎల్లో అన్న పేరుతో తమ్ముడు ఉద్యోగం
సాక్షి, రామగుండం: గోదావరిఖని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రవీందర్ అనే వ్యక్తి తన సోదరుడు రామదాసు పేరు మీద 12 ఏళ్లుగా టీఎస్ఎన్పీడీసీఎల్లో ఉద్యోగంలో కొనసాగుతున్న విషయం విజిలెన్స్ విచారణలో తేలింది. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్ వివరాల మేరకు..గాదె రామదాసు, గాదె రవీందర్ ఇద్దరు కవలలు. పన్నెండు సంవత్సరాలక్రితం గాదె రామదాసుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ వ్యవస్థలో జూనియర్ లైన్మెన్గా ఉద్యోగంరాగా రవీందర్ ఉద్యోగంలో చేరాడు. పదోన్నతి పొందుతూ లైన్మెన్ వరకు చేరుకున్నాడు. గోదావరిఖని ఎన్పీడీసీఎల్ ఈ సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. సర్టిఫికెట్లలో పేర్లుదిద్ది ఉద్యోగం చేస్తున్న క్రమంలో అధికారులకు అనుమానంరావడంతో ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయం నిర్ధారణ కావడంతో రవీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. మంథని డివిజనల్ ఇంజినీర్ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ∙ -
డిజిటల్ దోపిడీ
⇒ కరెంట్ మీటర్ల ఏర్పాటులో వసూళ్ల పర్వం ⇒ మీటర్ల బిగింపును ఏజెన్సీకి అప్పగించిన ఎన్పీడీసీఎల్ ఖమ్మం: డిజిటల్ మీటర్ల ఏర్పాటులో ఏజెన్సీ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో మీటర్‌కు రూ.200 వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ శాఖలో ముడుపులు ముట్టజెప్పనిదే పని జరగదనడానికి ఈ వ్యవహారం నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ మీటర్ల స్థానంలో స్కానింగ్ ద్వారా రీడింగ్‌ను తీసుకునే డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఎన్పీడీసీఎల్ నగదు ఇచ్చినా, సదరు సిబ్బంది వినియోగదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల ద్వారా రీడింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్పీడీసీఎల్ గుర్తించింది. ఈ మీటర్లనుంచి విద్యుత్ విని యోగం రీడింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ విద్యుత్ వాడినప్పటికీ.. తక్కువ రీడింగ్ చూప డం.. మరికొన్ని చోట్ల తక్కువ రీడింగ్ చూపి నా.. ఎక్కువ బిల్లులు రావడం తదితర ఘట నలు చోటుచేసుకుంటున్నాయి. ఏసీ,ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న వారు.. ఎక్కువ బిల్లు వచ్చిన నెలలో ప్రైవేట్ ఆపరేటర్‌తో మా ట్లాడుకుని బిల్లు తక్కువ వచ్చేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటువంటి అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఎన్పీడీసీఎల్ కొత్తగా డిజిటల్ మీటర్లను అమర్చాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఖమ్మం సర్కిల్ పరిధిలోని రెండు జిల్లాలో డిజిటల్ మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఒక్కో మీటర్ ఏర్పాటుకు రూ.500 చొప్పున ఇస్తున్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ మీటరు విద్యుత్ బిల్లులు సక్రమంగా వచ్చేందుకు ప్రస్తు తం ఖమ్మం సర్కిల్ పరిధిలోని ఖమ్మం, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఐఆర్డీఏ డిజిటల్ మీటర్లను అమరుస్తున్నారు. మొత్తం 6,61,737 డిజిటల్ మీటర్లను అమర్చాల్సి ఉంది. ఈ పనిని కూడా ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. వీరు ప్రస్తుతం డిజిటల్ మీటర్లను అమర్చే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 3,17,737 డిజిటల్ మీటర్లను అమర్చారు. మరో 3.44లక్షల డిజి టల్ మీటర్లను అమర్చాల్సి ఉంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. మీటర్ల ఏర్పాటులో చేతివాటం ప్రతి ఇంటిలో డిజిటల్ మీటర్‌ను అమర్చే పనులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ మీటర్‌ను అమర్చిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి డిమాండ్ చేసి మరీ రూ.200 వసూలు చేస్తుండటంతో విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు తామెందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ప్రైవేట్ ఏజెన్సీల వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. వారు మాత్రం తాము పని చేసినందుకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెబు తూ వసూలు చేస్తున్నారు. ఈవిషయంపై ఖమ్మం సర్కిల్ ఎస్ఈ రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. డిజిటల్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించామని, వీరు ఉచితంగానే డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా మీటర్ అమరిస్తే డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్ల మృతి
నల్లబెల్లి : బైక్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్లు మృతిచెందిన సంఘటన మండలంలోని గుండ్లపహాడ్లో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని రుద్రగూడెం శివారు వల్లెనర్సయ్యపల్లికు చెందిన చిట్యాల రవీందర్‌రెడ్డి(33), నర్సంపేట మండలం బాంజీపేటకు చెందిన కట్ల తిరుపతిరెడ్డి(32) ఎన్పీడీసీఎల్లో కాంట్రాక్టర్లుగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు నర్సంపేట నుంచి వల్లెనర్సయ్యపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. గుండ్లపహాడ్ గ్రామంలో జాతీయ రహదారిపై ములుగు మండలం మల్లంపల్లి నుంచి నర్సంపేట వైపు వస్తున్న గోనెల రవీందర్‌కు చెందిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిం ది. బైక్‌పై వెళ్తున్న రవీందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. కాగా తిరుపతిరెడ్డి కాలు తెగింది. గమనించిన స్థానికులు వారిని 108లో ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్ద రు మృతిచెందారు. విషయం తెలుసుకొన్న ఎస్సై ఎం.రాజమౌళి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కారులో ఉన్న మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. -
కొత్తగా రెండు విద్యుత్ డివిజన్లు
డీఈలకు ఇంచార్జీ ఎస్ఈల బాధ్యత జిల్లా స్థాయి డీఈ పోస్టుల రద్దు కొనసాగనున్న ఆపరేషన్ డీఈలు జిల్లాల పునర్విభజనతో మార్పులు హన్మకొండ : కొత్త జిల్లాల ఏర్పాటుతో విద్యుత్ శాఖలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల(ఎన్పీడీసీఎల్ సర్కిల్)కు సూపరింటెండెంట్ ఇంజనీర్లు(ఎస్ఈ) జిల్లా ప్రధాన అధికారిగా ఉండనున్నారు. కొత్త జిల్లాలకు ఎస్ఈలను నియమించాలంటే ఆ మేరకు కొత్తగా పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు కొత్త పోస్టులు మంజూరు చేసే అవకాశం లేనందున ఉన్న అధికారులను సర్దుబాటు చేయనున్నారు. అలాగే, పరిధి ఎక్కువగా ఉన్న డివిజన్ల నుంచి కొన్ని ప్రాంతాలతో కలిపి రెండు నూతన డివిజన్లు ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం ఆరు డివిజన్లు జిల్లాలో ప్రస్తుతం వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగులో ఎన్పీడీసీఎల్ అపరేషన్ డివిజన్లు ఉన్నాయి. ఇందులోని జనగామ డివిజన్ 12 మండలాలతో అతి పెద్ద డివిజన్‌గా ఉంది. ఈ డివిజన్లోని ఆరు మండలాల్లో హెడ్‌క్వార్టర్ జనగామతో సహా నాలుగు మండలాలు యాదాద్రిలో, రెండు మండలాలు కొత్తగా ఏర్పడనున్న సిద్ధిపేట జిల్లాలో కలువనున్నాయి. అలా యాదాద్రి, సిద్దిపేట జిల్లాలో కలిసే మండలాలను ఎస్పీడీసీఎల్ పరిధిలోకి వెళ్తాయి. మిగతా అరు మండలాలు రఘునాథపల్లి, ధర్మసాగర్, పాలకుర్తి, జఫర్‌గఢ్, స్టేషన్ ఘన్పూర్, నర్మెట మండలాలు ఎన్పీడీసీఎల్లో ఉంటాయి. ఈ ఆరు మండలాలు కలిపి స్టేషన్ ఘన్పూర్ కేంద్రంంగా కొత్తగా డివిజన్ ఏర్పాటు చేయాలని యోచనలో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఉంది. దీంతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న జయశంకర్ జిల్లాలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానున్న భూపాలపల్లి కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేస్తారు. కొత్త రద్దు.. మరికొన్ని బాధ్యతలు బదలాయింపు విద్యుత్ శాఖకు సంబధించి జిల్లా స్థాయిలో అయిదు డిప్యూటీ(డివిజనల్) ఇంజనీర్(డీఈ) పోస్టులు ఉంటాయి. వీరితో పాటు ప్రతీ ఆపరేషన్ డివిజన్లో ఉన్నతాధికారిగా డీఈ పోస్టు ఉంటుంది. ఇలా ప్రస్తుతం జిల్లాలో ఆరు డివిజన్లకు అరుగురు డీఈలున్నారు. వీరితో పాటు జిల్లా స్థాయిలో డీఈ టెక్నికల్, డీఈ కన్స్ట్రక్షన్, డీఈ డీపీఈ, డీఈ ఎంన్పీ, డీఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటారు. ప్రస్తుత మార్పుల ప్రకారం సర్కిల్ కార్యాలయంలోని డీఈ టెక్నికల్, డీఈ ఎంఎన్‌పీ పోస్టులు రద్దుచేసి డీఈ టెక్నికల్ నిర్వర్తిస్తున్న బాధ్యతలు ఎస్ఈకి బదలాయించనున్నారు. రద్దు కానున్న డీఈ ఎంఎన్‌పీ విభాగాన్ని డీఈ ట్రాన్స్ఫార్మర్స్ విభాగంలోకి బదలాయించనున్నట్లు సమాచారం. అలాగే డీఈ కన్స్ట్రక్షన్ పోస్టు రద్దు చేసి ఏ డివిజన్లో సబ్‌స్టేషన్ నిర్మిస్తే ఆ డివిజన్ ఆపరేషన్ డీఈకే బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా రద్దు కానున్న డీఈ పోస్టులను కొత్త డివిజన్లకు సర్దుబాటు చేయడంతో పాటు ఇందులో సీనియర్ డీఈలను పూర్తి అదనపు బాధ్యతలతో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు సూపరిటెండెంట్ ఇంజనీర్లుగా నియమించాలని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూలోనూ మార్పులు ఆపరేషన్ విభాగంతో పాటు ఎన్పీడీఎల్ రెవెన్యూ విభాగంలో మార్పులు జరుగనున్నాయి. జిల్లా సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ విభాగం ఉన్నతాధికారిగా ఉంటారు. సదరు అధికారితో పాటు మరో ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్స్ ఉంటారు. అకౌంట్స్ ఆఫీసర్(రెవెన్యూ), అకౌంట్స్ ఆఫీసర్(ఎక్స్పెండేచర్). కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నందున పని భారం తగ్గనుంది. దీంతో జిల్లాలో సర్కిల్ కార్యాలయానికి ఒక్క సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌ను మాత్రమే కొనసాగించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అకౌంట్స్ పోస్టులు రద్దు చేసి కొత్త జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. కొత్త జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న సర్కిల్ కార్యాలయాల్లోను ప్రస్తుతం అకౌంట్స్ ఆఫీసర్లుగా పని చేస్తున్న వారిలో సీనియర్లకు ఇన్చార్జిగా పూర్తి అదనపు బాధ్యతలతో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు సమాచారం. ఇంకా మిగిలిన ఉద్యోగులను కూడా సర్దుబాటు చేయనున్నారు. -
విద్యుత్ శాఖలో మార్పులు
హన్మకొండ : కొత్త జిల్లాల ఏర్పాటుతో విద్యుత్ పంపిణీ మండళ్ల(డిస్కం) పరిధిలో మార్పులు జరుగనున్నాయి. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 10 మండలాలు ఎస్‌పీడీసీఎల్‌లోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు ట్రా¯Œ్స, డిస్కంల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. టీఎస్ ఎన్పీడీసీఎల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మçహాబూబ్నగర్, మెదక్ జిల్లాలు ఉంటాయి. అయితే, జిల్లా పునర్విభజన ప్రక్రియతో కొత్తగా 17 జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(టీఎస్ ఎన్పీడీసీఎల్) పరిధిలో కొత్త జిల్లాలకు అనుగుణంగా మార్పులపై కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా ఎన్పీడీసీఎల్ పరిధిలోని కొన్న మండలాలు, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న జిల్లాల్లో కలవనున్నాయి. ఫలితంగా డిస్కంల పరంగా మండలాల్లో చేర్పులు, మార్పులు చోటు చేసుకుంటాయి. అటూ.. ఇటు... ఎన్పీడీసీఎల్ పరిధి ఉండే వరంగల్ జిల్లాలోని దేవరుప్పుల, లింగాలగణపురం, జనగామ, బచ్చన్నపేట మండలాలు నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా యాదాద్రి జిల్లాలో, చేర్యాల, మద్దూరు మండలాలు సిద్ధిపేట జిల్లాలో కలవనున్నాయి. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్, ఇల్లంతకుంట, కోహెడ, హుస్నాబాద్ మండలాలు సిద్ధిపేట జిల్లాలో కలుస్తున్నాయి. కొత్త జిల్లాలో అధిక ప్రాంతం దక్షిణ విద్యుత్ పంపిణీ మండలి(టీఎస్ ఎస్పీడీసీఎల్) పరిధిలో ఉండడంతో ఆ జిల్లాల్లో కలిసిన ఎన్పీడీసీఎల్ పరిధిలోని మండలాలను ఎస్పీడీసీఎల్లో కలుపనున్నట్లు సమాచారం. దీని ప్రకారం విద్యుత్ లైన్లు, విద్యుత్ కనెక్షన్లు, ట్రా¯Œ్సఫార్మర్లు, కార్యాలయాలు అన్నీ ఎస్పీడీసీఎల్ పరిధిలోకి వెళ్లనున్నాయి. అయితే ఈ మండలాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల అంశంలో సీనియారిటీ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఎక్కడి వారిని అక్కడే ఉంచాలనే ఆలోచనలో డిస్కంలు ఉన్నట్లు సమాచారం. ఇతర జిల్లాలో కలుస్తున్న మండలాల్లో పనిచేస్తున్న ఎన్పీడీసీఎల్కు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎన్పీడీసీఎల్లోనే ఉంటారు. వీరి స్థానంలో ఎస్పీడీసీఎల్కు చెందిన అధికారులు, ఉద్యోగులను నియమించాల్సి ఉంటుంది. ఈమేరకు విద్యుత్ పంపిణీ మండళ్లు కసరత్తు చేస్తున్నాయి. ఇక ఎన్పీడీసీఎల్ నుంచి ఎస్‌పీడీసీఎల్‌లోకి వెళ్లే మండలాల్లో ఉన్న విద్యుత్ సబ్‌స్టేçÙన్లు, విద్యుత్ ట్రా¯Œ్సఫార్మర్లు, విద్యుత్ లైన్లు, విద్యుత్ కనెక్షన్లు, సొంత భవనాలు, ఆస్తులు అన్నింటికి ధర నిర్ణయించి ఆ మేరకు ఎన్పీడీసీఎల్కు... ఎస్పీడీసీఎల్ చెల్లించేలా నిర్ణయాలు వెలువడనున్నట్లు అధికారవర్గాల సమాచారం. -
టీఎస్ ఎన్పీడీసీఎల్కు ‘ఏ’ గ్రేడ్
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ఎన్పీడీసీఎల్ గ్రేడ్ ‘బీ’ నుంచి ‘ఏ’కు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. తద్వారా గతంలో కంటే అధిక మొత్తంలో రుణాలు సులువుగా పొందే అవకాశం సంస్థకు లభిస్తుంది. ఆయా నిధులతో మెరుగైన విద్యుత్ పంపిణీ, కొత్త సబ్‌స్టేçÙన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించనున్నారు. వీటితో పాటు నష్టాల తగ్గింపు, వ్యయాల కుదింపు, మరిన్ని ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టిసారించనున్నారు. -
విద్యుత్ చౌర్యానికి పాల్పడిన నలుగురి అరెస్ట్
హన్మకొండ : విద్యుత్ చౌర్యానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు ఎన్పీడీసీఎల్ ఏపీటీఎస్ ఇన్స్పెక్టర్ డాక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి తెలిపారు. వరంగల్ రామన్నపేటకు చెందిన జన్ను సాంబయ్య, నమిండ్ల సుధాకర్, గీసుకొండకు చెందిన పులిచేరు సుధాకర్, తొర్రూరు మండలం కర్కాలకు చెందిన సెగ్గం సతీష్ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నం దున అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ నలుగురు విద్యుత్ క¯ð క్షన్ తీసుకోకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని ఆయనతెలిపారు. గతంలో కూడా విద్యుత్ చౌర్యానికి పాల్పడగా జరిమాన కట్టించి హెచ్చరించి వదిలేశామన్నారు. మరోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడడంతో జన్ను సాం బయ్య, నమిండ్ల సుధాకర్, పులిచేరి సుధాకర్, సెగ్గం సతీష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. ఎస్సైలు జె.విద్యాసాగర్‌ఱెడ్డి, వి.శంకర్, హెడ్‌కానిస్టేబుళ్లు కె.కళాధర్‌రాజు, జి.సుధాకర్, సిబ్బంది మురళీమోహన్, అశోక్ విజిలెన్స్ దాడుల్లో పాల్గొన్నారు. -
సాగుకు 19 గంటలు!
ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఎన్పీడీసీఎల్ పగటి పూట భారం తగ్గించేందుకే అంటున్న అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో గందరగోళం డివిజన్‌కో తీరుగా కరెంట్ సరఫరా హన్మకొండ : వ్యవసాయానికి 19 గంటల విద్యుత్ సరఫరా అవుతోంది. ఇది ప్రయోగాత్మకంగానే అని ఉత్తర మండల విద్యుత్ సరఫరా సంస్థ (ఎన్పీడీసీఎల్) యాజమాన్యం చెబుతోంది. ఇలా సరఫరాపై అధికారిక ఆదేశాల్లో స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఒక్కో డివిజన్లో ఒక్కో తీరుగా కరెంటు సరఫరా జరుగుతోంది. కొన్ని డివిజన్లలోనే సాగుకు 19 గంటల కరెంట్ సరఫరా అవుతోంది. ‘పగటి పూట విద్యుత్ సరఫరాపై భారం తగ్గించేందుకు 19 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇలా చేయడం ద్వారా నిర్దేశించిన సమయంలో కాకుండా రైతులు వేర్వేరు సమయాల్లో కరెంటును వినియోగించుకుంటారు. ఒకేసారి పడే భారం తగ్గుతుంది. సరఫరాలో సమస్యలు తలెత్తవు’ అని ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రయోగాత్మక అమలు విధానం క్షేత్రస్థాయిలో అధికారుల ఇష్టారీతిగా మారుతోంది. కొన్ని డివిజన్లలో 19 గంటలు, మరికొన్ని డివిజన్లలో 9 గంటలు ఇలా అయోమయంగా జరుగుతోంది. రైతాంగానికి ఖరీఫ్ నుంచి పగటిపూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తోంది. ఒక్కో సబ్‌స్టేçÙన్ను రెండు ఫీడర్లుగా విభజించి రెండు వేర్వేరు సమయాల్లో సబ్‌స్టేçÙన్ పరిధిలో రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఒక ఫీడర్‌కు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో ఫీడర్‌కు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సమయాల్లోనే విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో విద్యుత్ సరఫరా, సబ్‌స్టేçÙన్లు, ట్రాన్స్ఫార్మర్లపై భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు అవసరమున్న రైతులు రాత్రి వేళలో విద్యుత్ మోటారు నడిపించుకునేందుకు వీలుగా గత రెండు రోజులుగా ఎన్పీడీసీఎల్ రోజుకు 19 గంటలు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 23న ఎన్పీడీసీఎల్ యాజమాన్యం డివిజనల్ ఇంజనీర్లకు సమాచారం చేరవేసింది. జిల్లాలో ఎన్పీడీసీఎల్ పరంగా వరంగల్ టౌన్, వరంగల్ రూరల్, జనగామ, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో జనగామ డివిజన్లో ఇప్పటి వరకు 19 గంటలు విద్యుత్ సరఫరా చేయడం లేదు. ఈ డివిజన్లో బుధవారం నుంచి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ములుగు డివిజన్లో రైతులు కోరిన ప్రాంతాలకు మాత్రమే 19 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆ డివిజన్ డీఈఈ తెలిపారు. మిగతా డివిజన్లలో 19 గంటలపాటు విద్యుత్ సరఫరా జరుగుతోంది. అధికారులు ఇష్టానుసారంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌తో రైతులు ఆగమాగం అవుతున్నారు. 19 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కచ్చితంగా ప్రకటించకపోవడంతో రైతుల్లో నమ్మకం కలగడం లేదు. దీంతో రైతులు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరానే నమ్ముకుంటున్నారు. మిగతా సమయంలో విద్యుత్ సరఫరా చేస్తున్నా...అదనంగా విద్యుత్ అవసరమున్న రైతులు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. 19 గంటల విద్యుత్ సరఫరాపై రైతుల్లో నమ్మకం కలిగించినప్పుడే ఎన్పీడీసీఎల్ ఆశించిన ఫలితాలు వస్తాయని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. -
విజన్ టెక్కు నోటీసులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: టెలివిజన్ (టీవీ) రిమోట్‌తో కరెంటు మీటర్ల రీడింగ్ నిలిచిపోవడంపై తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) స్పందించింది. టీవీ రిమోట్‌తో రీడింగ్ ఆగిపోయినట్లు వెల్లడైన విజన్‌టెక్ కంపెనీకి టీఎస్ ఎన్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ నుంచి కొత్త మీటర్ల సరఫరాను ఆపేసింది. ఇప్పటి వరకు విజన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన మీటర్ల బిల్లులను నిలిపివేసింది. వినియోగదారుల ఇళ్లలో అమర్చిన విజన్‌టెక్ కరెంటు మీటర్లన్నింటినీ మార్చాలని ఎన్పీడీసీఎల్ నిర్ణయించింది. ఈ బాధ్యతను విజన్‌టెక్ కంపెనీకే అప్పగించింది. దీనికయ్యే మొత్తం ఖర్చును విజన్‌టెక్ కంపెనీయే భరించాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. ‘రిమోట్‌తో ఆగుతున్న రీడింగ్’ శీర్షికతో ఈ నెల 19న ‘సాక్షి’ మెయిన్ పేజీలో వచ్చిన కథనంపై స్పందించిన ఎన్పీడీసీఎల్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఎన్పీడీసీఎల్ కొత్త మీటర్లను కొనుగోలు కోసం ఇటీవల నిర్వహించిన ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పలు కంపెనీలను ఎంపిక చేసింది. 2.90 లక్షల విజన్‌టెక్ కరెంటు మీటర్ల కావాలని కంపెనీకి ఆర్డరు ఇచ్చింది. నైనా పవర్ 1.90 లక్షలు, డెసిబల్ 55 వేలు, జీనస్ 75 వేలు కరెంటు మీటర్లను సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. -
కరెంట్ తీగను మింగేశారు!
లైన్ మార్చకుండానే.. మార్చినట్లు రికార్డు ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల చేతివాటం ఎన్పీడీసీఎల్ సొమ్ము దుర్వినియోగం హన్మకొండ : కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల అక్రమార్జన వెరసి.. అటు వినియోగదారులు, ఇటు ఎన్పీడీసీఎల్ సంస్థకు నష్టం జరుగుతోంది. కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, పాత లైన్ల మార్పు, లూజ్ లైన్లను సరిచేసేందుకు మిడిల్ పోల్స్ ఏర్పాటు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు తదితర పనులను ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తోంది. అయితే, ఈ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా.. ఎన్పీడీసీఎల్లోని ఇంజనీర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇక ఎంతో కొంత చేసిన పనిలో నాణ్యత లోపించ డం వంటి అంశాలను పక్కన పెడితే.. అసలు పనే చేయకున్నా చేసినట్లు సామగ్రి తీసుకుని, లేబర్ చార్జీలు విడిపించుకున్న ఘటన ఒకటి వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లైన్ మార్చేందుకు నాలుగేళ్లు... హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌లో బూర నరేందర్‌కు వెంకటరమణ ఆటో గ్యాస్ పేరు తో ఆటో గ్యాస్ డీలర్షిప్(బంక్) మంజూ రైంది. ఆయన బంక్ మంజూరు చేయాలనుకున్న స్థలంలో విద్యుత్ లైను ఉండగా.. దాన్ని మారిస్తేనే బంక్ ఏర్పాటుకు అనుమతిస్తామని సంబంధిత కంపెనీ స్పష్టం చేసింది. దీంతో లైన్ మార్చడానికి అయ్యే ఖర్చులు రూ.34 వేలను డీడీ ద్వారా 2011 ఏప్రిల్‌లో ఎన్పీడీసీఎల్కు చెల్లించారు. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు విద్యుత్ లైన్ మార్చకపోవడంతో విసిగిపోయిన నరేందర్.. లైన్ మార్చకపోవడంతో తన గ్యాస్ డీలర్ షిప్ రద్దయ్యే ప్రమాదముం దని, దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకువెళ్లారు. దీంతో రంగంలోని దిగిన ఓ ఉన్నతాధికారి విచారణ జరపగా విస్తుపోయే నిజం బయటపడింది. ఎల్లాపూర్‌లో విద్యుత్ లైన్ మార్చేందుకు మూడు విద్యుత్ స్తంభాలు, దీనికి సరిపడా విద్యుత్ వైర్‌ను స్టోర్ నుంచి డ్రా చేయడమే కాక, మెటీరియల్ తరలింపు, లైన్ మార్చేందుకు లేబర్ చార్జీల కింద రూ.7వేలు 2012 నవంబర్‌లో డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉండడాన్ని ఆయన గుర్తించారు. అసలు లైనే మార్చనప్పుడు మెటీరియల్, లేబర్ చార్జీలు ఎవరికి చెల్లించారంటూ ఆయన ఆరా తీయగా.. చింతగట్టులో గతంలో పని చేసి ప్రస్తుతం కన్స్ట్రక్షన్కు బదిలీ అయిన ఎన్పీడీసీఎల్ ఏఈ దీనికి బాధ్యుడిగా తేలింది. ఈ మేరకు సదరు ఏఈపై చర్యలు తీసుకోవాలని విచారణ అధికారి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. అయితే, సదరు ఏఈపై మరికొన్ని ఆరోపణలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో తనిఖీలో చేస్తే అవి బయటపడతాయని సంస్థలోని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం. కాగా, ఎల్లాపూర్‌లో లైన్ మార్పు కోసం తీసుకువెళ్లిన సామగ్రిని ఆ ఏఈ ఏం చేశాడనేది తేలాల్సి ఉంది. ఇక.. డీడీ చెల్లించిన నాలుగేళ్లయినా లైన్ చెల్లించని ఎన్పీడీసీఎల్ సంస్థపై ఆటో గ్యాస్ డీలర్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు అధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చేస్తూనే డీలర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. -
ఎన్పీడీసీఎల్లో ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్
హన్మకొండ: టీఎస్ ఎన్పీడీసీఎల్ (తెలంగాణరాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి)లో ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గురువారం రాత్రి ఎన్పీడీసీఎల్ సీఎండీ కొంటె వెంకటనారాయణ 164 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-159 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-3, అసిస్టెంట్ ఇంజనీర్(సీఎస్/ఐటీ)-2 పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వివరాలు వెబ్‌సైట్‌లోని www.tsnpdcl.com లో లభిస్తాయని సీఎండీ వెంకటనారాయణ తెలిపారు. -
వినియోగదారుల పక్షానే..
- ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో 174 కేసులు పరిష్కారం - నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగుల నుండి రూ.70 వేలు వసూళ్లు - ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ రాజారావు ఖమ్మం :విద్యుత్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు పరిష్కారం కాక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎన్పీడీసీఎల్ కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రసల్ ఫోరం ఉందని ఫోరం చైర్పర్సన్ రాజారావు తెలిపారు. ఈ ఫోరం పూర్తిగా వినియోగదారుల పక్షాన ఉంటుందన్నారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు ఆయన హాజరయ్యారు. రైతులు, ఇతర విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించారు. వీటిలో కొన్ని తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003లో వచ్చిన విద్యుత్ చట్టంలో పొందుపరిచిన అంశాలను ఆధారంగా తీసుకొని 2004లో ఈ ఫోరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఫోరం ద్వారా విద్యుత్ వినియోగదారుల సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 79 విద్యుత్ సబ్డివిజన్లలో 66 సబ్డివిజన్లలో ఈ ఫోరం సమావేశాలు నిర్వహించిందన్నారు. ఫోరం ఏర్పాటు చేసిన సమావేశాలు, నేరుగా అందిన ఫిర్యాదులు కలిపి ఐదు జిల్లాల పరిధిలో 442 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 174 ఫిర్యాదులను పరిష్కరించామని, 274 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి ఫిర్యాదుపై స్పందించాల్సిన అవసరం ఉందని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారి నుండి రూ. 9,200, వరంగల్ జిల్లాలో లైన్ మార్చడం కోసం జాప్యం చేసిన అధికారి నుండి రూ. 4,100, అదిలాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో జాప్యం చేసినందుకు రూ. 4,700 ఇలా 11 కేసులకు సంబంధించిన పనులకు అధికారుల నుండి రూ. 70 వేలు వసూలు చేసి వినియోగదారుల సర్వీసు బిల్లుల్లో జమచేశామని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ మార్చడం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల, ట్రాన్స్ఫార్మర్ మీద అధికలోడు ఉన్నా, లోపాలు ఉన్నా మీటర్ మార్చడం, కొత్త కనెక్షన్ అడిషనల్ లోడు ఇవ్వడం, సర్వీసు పేరు మార్పిడి, వాడకానికి మించి అధిక బిల్లు రావడం, సర్వీసు కేటగిరీ మార్పిడి, సర్వీసు క్యాన్సెల్ చేయడం వంటి సమస్యలను ఈ ఫోరం ద్వారా పరిష్కారిస్తామన్నారు. ఫిర్యాదులను రాత పూర్వకంగా చేస్తే అందులో సర్వీసు నెంబర్, పూర్తి అడ్రస్‌తో సదస్సులు జరిగినప్పుడు నేరుగా కానీ, కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రసల్ ఫోరం విద్యుత్ భవన్, నక్కలగుట్టా హన్మకొండ, వరంగల్ పేరున పోస్టు ద్వారా కానీ, సంబంధిత అధికారులకు నేరుగా కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే రషీదు పొందాలని సూచించారు. వివరాల కోసం 0870-2461551, 9440811299 నెంబర్లు సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు వెంకటనారాయణ, రవీందర్, సాయిరెడ్డి, ఖమ్మం ఎస్ఈ తిరుమలరావు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌కో..కాస్కో
ఖమ్మం/ సత్తుపల్లి: జిల్లాలోని ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న అవినీతి అధికారులకు ఏసీబీ దడ పట్టుకుంది. ఎప్పుడు ఏసీబీ దాడులు జరుగుతాయో..ఎవరు ట్రాప్ అవుతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. వేలాది రూపాయల వేతనాలు వస్తున్నా అవినీతి సొమ్ముకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఆశపడుతుండటంపై విమర్శలు సైతం వస్తున్నాయి.జిల్లాతో పాటు ఎన్పీడీసీఎల్ విస్తరించి ఉన్న అన్ని జిల్లాల్లో రోజు ఏదో ఒకచోట అవినీతి అధికారులు పట్టుపడుతుండటం గమనార్హం. అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఇటీవల ఆశాఖ ఉన్నతాధికారి ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. విద్యుత్ వినియోగదారుల వద్దనే కాకుండా సొంతశాఖ సిబ్బంది నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఏసీబీకి పట్టుబడుతుండటం గమనార్హం. వరుస దాడులు గడిచిన రెండు నెలల్లో ఎన్పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో తల్లాడ, సత్తుపల్లి ప్రాంతాల్లో అధికారులు ఏసీబీకి చిక్కారు. గతంలో కూడా ఇదే సత్తుపల్లి సబ్‌డివిజన్ పరిధిలోని బోనకల్లు, వేంసూరు, పెనుబల్లి ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులు ఏసీబీ పట్టుబడ్డారు. విద్యుత్‌శాఖలో మరికొన్ని అవినీతి చేపలున్నాయని వారిని కూడా పట్టుకొని తీరుతామని ఏసీబీ హెచ్చరిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సత్తుపల్లి డివిజన్లో మరీ అధికం.. విద్యుత్‌శాఖ అధికారులు ప్రతి పనికి అనధికారికంగా ఒక రేటు ఫిక్స్చేసి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ నుంచి సామాన్యుల ఇంటి కనెక్షన్ వరకు ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల కాలంలో సత్తుపల్లి డివిజన్లోని నలుగురు విద్యుత్‌శాఖ ఉద్యోగులే ఏసీబీకి పట్టుబడ్డారు. బోనకల్, పెనుబల్లి, తల్లాడ, ఏఈలు మునీర్‌పాషా, ప్రవీణ్‌కుమార్, రాంరెడ్డిలు ఏసీబీ వలలో చిక్కారు. ఈ నెల మొదటివారంలో తల్లాడ ఏఈ శీలం రాంరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చివరికి సొంత శాఖ ఉద్యోగులను కూడా వదలకపోవడంతో సత్తుపల్లి లైన్‌మన్ పూర్ణచంద్రరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీఈఈ సుదర్శనాన్ని పట్టించటం సంచలనం సృష్టించింది. గతేడాది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై డీఈఈ కార్యాలయంలో ముగ్గురు సిబ్బందిపై వేటుపడింది. ఏసీబీకి పట్టుబడినా ఆరు నెలలకే మళ్లీ విధుల్లోకి చేరుతుండటంతో సస్పెన్షన్లు అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఆశాఖ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. హెచ్చరించినా అదే తీరు.. ఎన్పీడీసీఎల్ పరిధిలోని పలువురు అధికారులు, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఆశాఖ సీఎండీ వెంకటనారాయణ ఇటీవల జరిగిన సమావేశంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు రైతులు, వినియోగదారులు అధికారులు తమ వద్దనుండి లంచం అడుగుతున్నారని, డబ్బులు ఇవ్వనిదే పనిచేయడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎండీ జిల్లా ఉన్నతాధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలిసింది. జిల్లాలో గత నెలలో జరిగిన సమావేశంలోనూ సీఎండీ అవినీతిపై మాట్లాడారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇంత జరిగినా అధికారుల తీరు మారకపోవడం, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీకి చిక్కడం గమనార్హం. ఇటీవల కరీంనగర్లో జరిగిన సమావేశంలోనూ ‘తెలంగాణ పునర్నిర్మాణంలో మీ భాగస్వామ్యం కీలకం, మీకు కావాల్సినంత వేతనాలు ఇస్తున్నాం. అక్రమాలకు పాల్పడకండి..’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖల అధికారులకు సూచించారు. లంచం అడిగితే ఫోన్ చేయండి..అంటూ టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించడంతో అవినీతి అధికారులకు చెక్ పడుతోంది. -
స్విచ్చేస్తే షాక్!
త్వరలో పెరగనున్న విద్యుత్ చార్జీలు! 5.75 శాతం పెంచాలని ఎన్పీడీసీఎల్ ప్రతిపాదన గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు వెసులుబాటు సామాన్యులకు భారం తగ్గించే యోచనలో సర్కారు హన్మకొండ : విద్యుత్ చార్జీల మోత మోగనుంది. వినియోగదారులపై వడ్డ న తప్పేట్టుగా లేదు. ఆదాయ, వ్యయూలను బేరీజు వేసుకున్న ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) విద్యుత్ చార్జీలు పెంచాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు చార్జీల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌కు ఎన్పీడీసీల్ సమర్పించింది. ప్రస్తుతం ఉన్న చార్జీలపై 5.75 శాతం పెంచుతూ ప్రతిపాదన లు ఈఆర్సీకి సమర్పించినట్లు సమాచారం. చార్జీల పెంపు అంశాన్ని ఎన్పీడీసీఎల్ అధికారులు బహిర్గతం చేయడం లేదు. కాగా, పెరిగే విద్యుత్ చార్జీలు ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. నెలకు రూ.3 కోట్ల భారం జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెల దాదాపు వినియోగదారులు బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చార్జీలపై 5.75 శాతం చార్జీలు పెంచితే రూ.3 కోట్ల భారం జి ల్లా ప్రజలపై పడనుంది. అంటే ఏడాదికి జిల్లావాసులపై రూ.36 కోట్ల భారం పడనుంది. అయితే సామాన్య ప్రజలపై భారం పడుకుండా ఉండేందుకు గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు పాత చార్జీలనే వర్తింపజేయాలనే యో చనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చార్జీల పెంపు ప్రభా వం 100 యూనిట్లు పైగా వాడుకొన్న వారిపై పడనుంది. నడ్డి విరిగేది ఇలా.. {పస్తుతం 200 యూనిట్ల వరకు రెండు విధాలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించిన వారికి 50 యూనిట్ల వరకు రూ.1.45.. 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.2.60.. 101 నుంచి 200 వరకు రూ.3.60 వసూలు చేస్తున్నారు. నెలలో 200 యూనిట్లకు పైగా వినియోగించే వారికి స్లాబ్ రేట్లను పెంచి వసూలు చేస్తున్నారు. 50 యూనిట్ల వరకు రూ.2.60.. 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.25.. 101 నుంచి 150 వరకు రూ.4.88.. 151 నుంచి 200 వరకు రూ.5.63.. 201 నుంచి 250 వరకు రూ.6.38.. ఇలా చివరి స్లాబ్ 500 యూనిట్లకు పైగా వాడిన వారికి యూనిట్‌కు రూ.8.38 వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలపై ప్రస్తుతం రూపొందించిన ప్రతిపాదనల మేరకు 5.75 శాతం చార్జీలు పెరగనున్నాయి.ఇదే విధంగా కమర్షియల్, పరిశ్రమలు, కేటగిరీ-6లోని వీధి దీపాలు, నీటి సరఫరా పంపులకు, రైల్వే, లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఇవీ వర్తించనున్నాయి. {పస్తుతం జిల్లాలో ప్రతి నెల దాదాపు గృహ వినియోగదారులు బిల్లులు రూ.12.45 కోట్లు, కమర్షియల్ రూ.11.30 కోట్లు, పరిశ్రమల ద్వారా రూ.16 కోట్లు, వీధి దీపాలు, తాగు నీటి సరఫరా పథకాల ద్వారా రూ.3.78 కోట్లు, రైల్వే రూ.7 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రూ.1.50 కోట్లు, ఇతరత్రా మరో రూ.కోటికి పైగా బిల్లులు విధిస్తున్నారు. తాజా పెంపు ప్రతిపాదనలతో ఈ మొత్తం రూ.56 కోట్లకు చేరనుంది. జిల్లాలో ప్రస్తుతం గృహ వినియోగదారుల కనెక్షన్లు 8.40 లక్షలు, కమర్షియల్ కనెక్షన్లు 84వేలు, పరిశ్రమల కనెక్షన్లు 8 వేలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాల కనెక్షన్లు 9,500, కేటగిరీ-7లో ఆరు వేలు ఉన్నాయి. చార్జీలు పెంచొద్దు నా పేరు వై యూదగిరి. మాది జనగామ మండలం వెంకన్నకుంట. నేను కార్పెంటర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇప్పటికే ధరలు పెరిగి ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఇప్పుడు కరెంటు చార్జీలు పెంచితే బతకడం కష్టమే. పని కూడా గిట్టుబాటు కాదు. చార్జీల పెంపు నిర్ణయూన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యుత్ కనెక్షన్లు : 9,47,500 చార్జీల పెంపు : 5.75 శాతం ఏడాదికి వడ్డన : రూ.36 కోట్లు -
మిషన్ ‘బ్లాంకెట్’ బాగుంది !
ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకట్‌నారాయణ ఇందూరు : చలికాలన్ని దృష్టిలో ఉంచుకుని పేద బీసీ విద్యార్థులకు రక్షణ కల్పించడానికి శ్రీకారం చుట్టిన మిషన్ ‘బ్లాంకెట్’ కార్యక్రమం బాగుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకట్ నారాయణ, జిల్లా బీసీ సంక్షేమ సంఘాన్ని అలాగే దాతలను అభినందించారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక నాందేవ్‌వాడ బీసీ కళాశాల బాలుర వసతిగృహ విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ మిషన్ ‘బ్లాంకెట్’ కార్యక్రమాన్ని చూసి స్పందించిన విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈ సందర్భంగా కొనుగోలు చేసిన 140 దుప్పట్లను సీఎండీ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కన్న ఊరును విడిచిపెట్టి జిల్లా కేంద్రానికి చదువుకోవడానికి వచ్చి, వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులకు చాలా కష్టాలుంటాయన్నారు. ప్రభుత్వం తరపున అందాల్సిన వస్తువులు సకాలంలో అందకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని చలి కాలంలో విద్యార్థులకు రక్షణ కల్పించడానికి దాతలు మరింత ముందుకు రావాలని కోరారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే బీసీ నాందేవ్‌వాడ వసతిగృహ విద్యార్థులకు రాజ్‌కుమార్ అనే వ్యక్తి రూ.2వేలు విలువ చేసే క్రీడాసామగ్రి విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్. రేవంత్, పవర్ డిప్లామా కార్యదర్శి తోట రాజశేఖర్, రిటైర్డ్ ఎంపీడీఓ ఆంజనేయులు, ట్రాన్స్‌కో డీఈ ముక్తార్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కనెక్షన్లు కట్
మోర్తాడ్: గడచిన ఖరీఫ్ సీజనులో విద్యుత్ కోతలతో వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కోతలు తీవ్రం కావడంతో రైతులు ఆందోళనలకు దిగారు. ప్రస్తుతం మొదలు కానున్న రబీ సీజనులోనూ వ్యవసాయానికి కరెంటు అంతంత మాత్రమే సరఫరా అయ్యే అవాశముంది. అక్రమ కనెక్షన్లను తొలగిస్తే లోడ్‌ను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామాలలోని వ్యవసాయ క్షేత్రాలలో అనుమతి లేకుండా ఉన్న కనెక్షన్లను తొలగించాలని ఎన్పీడీసీఎల్ ఆదేశాలిచ్చింది. దీంతో ఏఈఈలు, సబ్ ఇంజనీర్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు రంగంలోకి దిగనున్నారు. అక్రమ కనెక్షన్ల తొలగింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ నుంచి క్షేత్రస్థాయి అధికారులకు జారీ చేసిన మెమోలో పేర్కొంది. రబీ పనులు మొదలు కాకముందే ఈ పనులు పూర్తి కావలసి ఉంది. దీంతో తమకు గ్రామాలలో ఇబ్బందులు తలెత్తుతాయని ఉద్యోగులు చెబుతున్నారు. అపుడు కోతలు విధించి అక్రమ కనెక్షన్లతో సీజనులో రోజుకు 25 మెగావాట్ల విద్యుత్ అధికంగా వినియోగమవుతోంది. ఖరీఫ్‌లో వ్యవసాయ పనులు ఎక్కువగా సాగినపుడు రోజుకు 600మె గావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే 400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అయ్యింది. అప్పుడు గృహ అవసరాలకు, వ్యవసాయానికి కోతలు విధించి విద్యుత్‌ను సరఫరా చేశారు. అక్రమ కనెక్షన్లతో ఏర్పడిన లోడ్‌ను తగ్గిస్తే వ్యవసాయానికి కొంత మెరుగ్గా విద్యుత్‌ను సరఫరా చేసేవారమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వ్యవసాయ పనులు మందగించడం తో జిల్లాలో రోజుకు 200 మెగావాట్ల విద్యుత్ విని యోగమవుతోంది. రబీ పనులు మొదలైతే విద్యుత్ డిమాండ్ ఎక్కువ అవుతుంది. అందుకే అక్రమ కనెక్షన్ల తొలగించాలనే కఠిన నిర్ణయాన్ని యాజమాన్యం తీసుకుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. -
మళ్లీ కరెంట్ కోతలు
- నేటి నుంచి అమలు - ఆదేశాలు జారీ చేసి ఎన్పీడీసీఎల్ సీఅండ్ ఎండీ మంథని/జగిత్యాల అగ్రికల్చర్ : మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యూరుు. ఈమేరకు శుక్రవారం ఎన్పీడీసీఎల్ సీఅండ్ ఎండీ ఆదేశాలు జారీచేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు( సబ్‌స్టేషన్ హెడ్‌క్వార్టర్)ల్లో 8 గంటలు, కార్పొరేషన్లలో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటల కోత ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయూనికి 7 గంటల సరఫరా జరుగుతుండగా పెరిగిన డిమాండ్ కారణంగా అరుుదు గంటల సరఫరా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోతలు ఇలా... మున్సిపాలిటీలు (సబ్‌స్టేషన్ హెడ్‌క్వార్టర్), మండల కేంద్రాలు: ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్పొరేషన్లు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామాలు: ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (12 గంటల కోత) గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఇలా... ఎ-గ్రూప్‌లో ఉదయం 3 గంటల నుంచి 8 గంటల వరకు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు బి- గ్రూప్‌లో ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు. రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు సి- గ్రూప్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు. రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు డి- గ్రూప్‌లో రాత్రి 10 నుంచి 3 గంటల వరకు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు -
కేబుల్ కుంభకోణంలో కదలిక
హన్మకొండ : ఎన్పీడీసీఎల్లో కలకలం రేపిన కేబుల్ కుంభకోణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రాథమిక విచారణ పూర్తి కాగా... కేబుల్ వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నలుగురు కన్స్ట్రక్షన్ డీఈలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యూరుు. అంతేకాకుండా... కేబుల్ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఇతర డిస్కంల కంటే ఎక్కువ ధర పెట్టారంటూ అప్పటి పర్చేసింగ్ విభాగం సీఈ, ఎస్ఈ, డీఈ, ఏడీఈలకు నోటీసులు ఇచ్చారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని రిస్ట్రక్టడ్ అక్యులరేటేడ్ పవర్ డెవలప్మెంట్ అండ్ రీఫామ్స్ ప్రోగ్రాం (ఆర్‌ఏపీడీఆర్‌పీ) పథకంలో విద్యుత్ సరఫరాకు కొత్త లైన్ల ఏర్పాటు నిమిత్తం కేబుల్ కొనుగోలు చేశారు. 2010, 2011, 2012 ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేసిన 11 కేవీ కేబుల్‌లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. కేబుల్‌ను బిగించిన వెంటనే కాలిపోవడంతో నాణ్యత లేదనే విషయం వెల్లడైంది. ఈ మేరకు గత ఏడాది జూలైలో ఈ విషయూన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ప్రాథమిక విచారణకు ఆదేశాలిచ్చారు. ఆపరేషన్స్ విభాగం సీజీఎం యూనస్‌ను విచారణాధికారిగా నియమించారు. వారం రోజులపాటు సాగిన విచారణలో ఆయన కేబుల్ టెండర్లు, ఒప్పందాలు, నిబంధలన్నీ పరిశీలించారు. కేబుల్ వినియోగించిన సమయం లో సర్టిఫై చేసిన అధికారుల నుంచి వివరణ తీసుకోవడంతోపాటు అప్పటి రిపోర్టును స్వాధీనం చేసుకున్నారు. కేబుల్‌తోపాటు ఏబీ స్విచ్‌లు, కాసారాలు, ఇన్సులేటర్లు, హెచ్‌జీ ఫ్లగ్‌లు, కటవుట్స్ మొత్తం నాసిరకమేనని విచారణలో వెల్లడైంది. సాంకేతిక కారణాలను సైతం ఆయన ఎత్తిచూపారు. సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడమూ కారణమని, ఎర్తింగ్ అనువుగా ఇవ్వకపోవడంతో కేబుల్ ఫెయిలైనట్లు తేల్చారు. కేబుల్ కొనుగోళ్లలో పర్చేసింగ్ విభాగం నిర్లక్ష్యం వహించడమే కాకుండా, కొనుగోలు సమయంలో 180 కి.మీల కేబుల్‌కు రూ. 60 లక్షల ఎక్కువ ధర పెట్టినట్లు విచారణలో బహిర్గతమైంది. ఈ వ్యవహా రంలో ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి పర్చేసింగ్ డెరైక్టర్ రాజేశ్వర్‌రావు రాజీ నామా చేశారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ పూర్తి కాగా.. ఈ వ్యవహారంలో సం బంధమున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. పక్కదారి పట్టించేందుకేనా... ప్రాథమిక విచారణ ఏనాడో పూర్తి అయినప్పటికీ... ఒత్తిళ్లతో ఫైల్‌ను తొక్కిపెట్టినట్లు ఎన్పీడీసీఎల్లో ప్రచారం జరుగుతోంది. కొంతమంది డీఈ లను ఉద్దేశపూర్వకంగా తప్పించడంతోపాటు పూర్తిస్థారుు విచారణను పక్కదారి పట్టించే కుట్ర అని గుసగుసలు వినిపిస్తున్నారుు. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ డెరైక్టర్ సుదర్శన్ పూర్తిస్థారుు విచారణ చేపట్టారు. ఇందులో అసలు విషయాలు బయటకు రాకుండా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. -
రావుగారు వెనక్కి...
హన్మకొండ : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫ రా సొసైటీ లిమిటెడ్ (సెస్) ఎండీ రంగారావు తిరిగి పాత స్థానానికే బదిలీ అయ్యారు. ఈనెల 21న జరిగిన ఎస్ఈల బదిలీల్లో ప్రాజెక్టు జీఎం గా ఉన్న రంగారావు సెస్ ఎండీగా నియమితులయ్యారు. అయితే గతంలో సెస్ ఎండీగా పని చేసిన సమయంలో రంగారావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ స్థానం లో రంగారావును నియమించడంపై విమర్శ లు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను తిరిగి పాత చోటికే బదిలీ చేశారు. సెస్ ఎండీగా ఆపరేషన్స్ విభాగంలో జీఎంగా ఉన్న రామకృష్ణను నియమిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రావుగారి కథ.. 2007-10 మధ్య కాలంలో సెస్ ఎండీగా రంగారావు పని చేశారు. అప్పుడు రూ.4 కోట్ల సొ మ్ము దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడేళ్ల కాలంలో ఇంప్రూవ్మెంట్ వర్క్స్ పేరిట చేపట్టిన పనుల్లో నిధులు పెద్ద మొత్తంలో దుర్వినియోగమయ్యాయనే ఫిర్యాదులు అందాయి. ఈ బాగోతం విచారణ నిమిత్తం అప్పటి చీఫ్ ఇంజనీర్ కె.కృష్ణయ్యను విచారణ అధికారిగా ఎన్పీడీసీఎల్ నియమించింది. రంగారావు హయాంలో సెస్ పరిధిలో ఇంప్రూవ్మెంట్, డిపాజిట్ కంట్రిబ్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్, మైనర్ ఎక్స్టెన్షన్ విభాగాలుగా మొత్తం 3,207 పనులు జరిగాయి. అందులో కేవలం 1,837 పనులను విచారణ కమిటీ తనిఖీ చేసింది. మిగతా 1,370 పనుల ను సెస్ అధికారులు రికార్డులు సమర్పించకపోవడంతో తనిఖీ చేయలేకపోయినట్లు విచారణ నివేదికలో పేర్కొంది. ఇంప్రూవ్మెంట్ వర్క్స్‌లోనే భారీగా దుర్వినియోగం అయ్యాయంటూ గమనించారు. అగ్రిమెంట్లు చేసుకోకుండానే ఏడీఈ, డీఈలు కాంట్రాక్టర్లతో పనులు చేయిం చి ఏకంగా బిల్లులు చెల్లించినట్లు విచారణ కమి టీ నిర్ధారించింది. కేవలం 89 పనులకు సంబంధించిన బిల్లులను కమిటీ పరిశీలించింది. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.7.56 లక్షలు అదనంగా చెల్లింపులు జరిగినట్లు బయటపడింది. సెక్షన్ ఆఫీసర్లు స్టోర్ నుంచి తీసుకున్న మెటీరియల్‌లో కొంత మొత్తం వినియోగించి పక్కదారి పట్టించినట్లు వేలెత్తిచూపింది. పలువురు ఏడీఈ, డీఈలతో పాటు ఏఏఓ, ఏఓలు, సెక్షన్ ఆఫీసర్లకు ఇందులో ప్రమేయం ఉందని, అప్పటి ఎండీ రంగారావు పర్యవేక్షణ లోపం ఉందని విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఈనెల 21న రంగారావును సెస్ ఎండీగా నియమించడంతో పాత ఫైల్ బయటకు వచ్చింది. విజిలెన్స్, డిపార్ట్మెంట్ విచారణ నివేదికలను సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. రంగారావును అక్కడ నుంచి తప్పించాలని, మరిన్ని పనులపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని, ఆయన అక్కడ ఉంటే విచారణకు అడ్డుగా ఉంటుందని అధికారులకు సూచించారు. -
ఎన్పీడీసీఎల్ సీఎండీ బదిలీకి డీల్!
హన్మకొండ : ఎన్పీడీసీఎల్ సీఎండీ బదిలీపై డీల్ మొదలైంది. సీఎండీ కార్తికేయ మిశ్రాను బదిలీ చేయడం... ఓ సీజీఎంను ఇక్కడికి సీఎండీగా తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుత సీఎండీని బదిలీ చేసేందుకు గత ఏడాది కూడా సంస్థలోని పలు ఇంజినీరింగ్ యూనియన్లు భారీ ఎత్తున పైరవీలు చేశాయి. అప్పుడే రూ. 2 కోట్లకు బేరం పెట్టారు. తాజాగా .... కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. సీఎండీ, డెరైక్టర్ పోస్టు కోసం ఆశతో ఉన్న అధికారుల తరఫున ఇద్దరు మంత్రుల వద్ద ఇప్పటికే రాయబారం నడుపుతున్నారు. దీనిపై ఇప్పటికే కాంట్రాక్టర్లు ఇద్దరు మంత్రులను కలిశారు. వారి వెంట సీఎండీ కుర్చీ కోసం ఆశపడుతున్న ఓ అధికారిని తీసుకెళ్లినట్లు సమాచారం. నిజామాబాద్‌లో మంత్రి సన్నిహితుడిగా ఉన్న ఓ ఏడీఈ... పౌల్ట్రీ వ్యాపారం నిర్వహించినప్పుడు మరో మంత్రితో సంబంధాలున్న ఓ ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్‌తోపాటు ురో సీనియర్ కాంట్రాక్టర్ ఇటీవల రాయబారం నడిపినట్లు తెలిసింది. అందుకే.. టార్గెట్ ఎన్పీడీసీఎల్లో ఇటీవల సబ్స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సందర్భంలో ధరలు పెంచాలని కాంట్రాక్టర్లు పట్టుబట్టిన విషయం తెలిసిందే. మిశ్రా ఇందుకు ఒప్పుకోకపోవడంతో టెండర్లు ఫైనల్ కాలేదు. అంతేకాకుండా పనుల పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపులు చేయూలని, పనులు పూర్తికాకుంటే చెల్లించొద్దని సీఎండీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలువురు ఐఏఎస్‌లు, రాజకీయ నేతలతో కాంట్రాక్టర్లు ఆయనపై ఒత్తిడి సైతం తీసుకొచ్చారు.అయినప్పటికీ సీఎండీ ఫైళ్లను పెండింగ్‌లో పెడుతుండడంతో ఆయనను కాంట్రాక్టర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను బదిలీ చేయించి... తమకు అనుకూలంగా ఉండే వారిని సీఎండీగా రప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రూ. 3 కోట్ల నుంచి రూ.4 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కుర్చీ కోసం పోటీ సీఎండీ కుర్చీ కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఎన్పీడీసీఎల్లో డెరైక్టర్‌గా పనిచేసి గత ఏడాది కేబుల్ కొనుగోలులో ఆరోపణలు ఎదుర్కొన్న డెరైక్టర్‌తోపాటు ప్రస్తుతం సీజీఎంలుగా పనిచేస్తున్న ఇద్దరు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కంపెనీలోని మరో సీనియర్ డెరైక్టర్ కూడా సీఎండీ పోటీలో ఉన్నట్లు సమాచారం. జెన్కో తరహాలోనే ఎన్పీడీసీఎల్కు ఈసారి ఐఏఎస్ అధికారిని కాకుండా ఇంజినీరింగ్, నాన్ ఐఏఎస్‌లకు సీఎండీ పోస్టు అప్పగించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులు సీఎండీ పోస్టుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా... సీఎండీ కార్తికేయ మిశ్రా బదిలీపై వెళ్లేందుకు ఇప్పటికే పలుమార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నారని... ఈసారి ఎలాగైనా బదిలీ చేయించుకుంటారని.. లేనిపక్షంలో కొన్ని రోజులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఇక ‘కట్’కటే..
ఖమ్మం : వేసవి కాలం అయిపోయింది.. తొలకరి చినుకులు కురుస్తున్నాయి...ఇక విద్యుత్ గండం నుంచి గట్టెక్కినట్టేనని సంతోషపడుతున్నారా ..? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వేసవి ముగిసిన వెంటనే ఎడాపెడా కోతలకు విద్యుత్ శాఖ రంగం సిద్ధం చేసింది. వేసవికాలంలో ఎన్నికలు ఉండడంతో గృహ వినియోగదారులపై కొంత ‘కరుణ’ చూపినా.. ఇప్పుడు తన పని తాను చేసుకుపోతోంది. విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించిన దాని ప్రకారమే విచ్చలవిడి విద్యుత్ కోతలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి కానున్నారు. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభమై, వినియోగం పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనలవి కాదు. అధికారికంగానే ఆరేసి గంటల చొప్పున కోతలు ప్రకటిస్తున్న విద్యుత్ శాఖ అనధికారికంగా మరింత కోత విధించే అవకాశం ఉంది. దీనికి తోడు చిన్నపాటి వర్షానికే విద్యుత్ వైర్లు తెగిపడటం, షార్ట్ సర్క్యూట్లు, లైన్ల మరమ్మతు వంటి కారణాలతో ఇంకెన్ని ఇబ్బందులోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అమలు... నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) అధికారుల నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే జిల్లాలో గురువారం నుంచే విద్యుత్ కోతలు అమల్లోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో గంట, మున్సిపల్, మండల కేంద్రాల్లో రెండు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అయితే ఇంకా ఎండల ప్రభావం తగ్గకపోవడంతో ఇప్పటి వరకు వ్యవసాయ సీజన్ ప్రారంభం కాలేదు. దీంతో జిల్లాకు కేటాయించే విద్యుత్ కంటే వినియోగం తక్కువగానే ఉంది. గత మూడు, నాలుగు రోజులుగా జిల్లాకు సగటున సుమారు 5.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. వినియోగం మాత్రం రోజుకు సగటున 5.4 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ఇప్పుడు విద్యుత్ కోతలు విధించాల్సిన అవసరం లేదు. కానీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల సగటు విద్యుత్ వినియోగం సరఫరా కంటే అధికంగా ఉంది. ఈ పరిస్థితిలో అన్ని జిల్లాల సగటు వినియోగం, సరఫరాను లెక్కేసి విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ జిల్లాల పరిధిలో వ్యవసాయ విద్యుత్ వినియోగం గణనీయంగానే ఉంటుంది. మరి ఇప్పుడే ఆరు గంటల కోత విధిస్తే.. ఖరీఫ్ ప్రారంభమై వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగితే మరిన్ని గంటల పాటు కోతలు తప్పవని విద్యుత్ శాఖ వర్గాలే చెపుతున్నాయి. వ్యవసాయానికి 6 గంటలే.. వ్యవసాయానికి ఆరు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గ్రూప్ ఏ ప్రాంతానికి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 వరకు, గ్రూప్- బి ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు, రాత్రి 12 నుంచి 2 వరకు, గ్రూప్-సీ ప్రాంతానికి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు, తిరిగి రాత్రి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తారు. అయితే ఇచ్చే ఆరుగంటలు కూడా నిరంతరం సరఫరా చేయకుండా సగం ఉదయం, సగం రాత్రి వేళల్లో ఇస్తే మడి కూడా తడవదని, అర్ధరాత్రి విద్యుత్‌తో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. -
ఆడిట్.. అభ్యంతరాలు
హన్మకొండ, న్యూస్‌లైన్ : ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ లో ఏటా నిర్వహించే ఆడిట్ చేసే కాగ్ ఈసారి పలు అం శాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హన్మకొండలోని విద్యుత్ భవన్లో దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆడిట్‌కు కాగ్ తరఫున ఢిల్లీ, హైదరాబాద్ నుంచి రెండు బృందాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయా బృందా ల అధికారులు తమ పరిశీలనలో పలు విభాగాల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సమాధానాలు కోరారు. ప్రధానంగా ధరల పెంపుదల, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించడమే కాకుండా పలు సామగ్రి కొనుగోళ్లలో ఎక్కువ ధరలు పెట్టినట్లు అనుమానిస్తూ వాటి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అయితే, వీటిలో కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన ఎన్పీడీసీఎల్ అధికారులు మరికొన్నింటిని దాటవేశారు. కాగా, ఆడిట్ విభాగం అడిగిన ప్రశ్నలకు సమాధానాల కోసం ఉన్నతాధికారులు పాత రికార్డులను వెలికి తీస్తుండగా, ఆయా విభాగాల్లో పని చేసిన అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఈ సందర్భంగా కాగ్ బృందాలు వ్యక్తం చేసిన కొన్ని అభ్యంతరాల వివరాలు... కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం జిల్లాలో హెచ్‌వీడీఎస్, ఆర్ఏపీడీఆర్పీతో పాటు జైకా పనుల్లో కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆడిట్ విభాగం తప్పు పట్టింది. ఏళ్లు గడిచినా పనులు ఎందుకు పూర్తి కావడం లేదని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారని మందలించింది. దీనిలో భాగంగానే ఆర్ఏపీడీఆర్పీలో పార్ట్-ఏ ఐటీ పనులు చేయడంలో ఆలస్యం చేసిన టీసీఎస్ సంస్థ పనితీరు, అధికారుల పర్యవేక్షణ ను ఆడిట్ అధికారులు తప్పు పట్టారు. ఇప్పటి వరకు 30 శాతం పనులు కూడా చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ నే సంస్థకు 17సార్లు నోటీసులు జారీ చేసి ఎలాంటి చ ర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అదే విధం గా హెచ్వీడీఎస్లో ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్ల పనులు చేస్తున్న యూడబ్ల్యూటీతో పాటు మరో కాంట్రాక్ట్ సంస్థ పనుల ఆలస్యంపై సైతం వివరాలు అడిగారు. ధరల పెంపు సబ్స్టేషన్ల నిర్మాణానికి 29 శాతం ధరలు పెంచడాన్ని కూడా కాగ్ ఆడిట్ విభాగం తప్పు పట్టింది. ఏ ప్రాతిపదికగా ధరలు పెంచారని ప్రశ్నిస్తూ.. ధరలు పెంచినా కాంట్రాక్టర్లు టెండర్లు వేయకపోవడం, దీనిపై అధికారులు తీసుకున్న చర్యలపై నివేదిక కోరారు. అదే విధంగా ఐఆర్డీఏ మీటర్ల కొనుగోలు వ్యవహారంలో ఎక్కువ ధర పెట్టిన వైనంపై విచారణ ఎక్కడి వరకు వచ్చిందని, విచారణ నివేదికల ప్రకారం ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ఎన్పీడీసీఎల్లో గత ఏడాది వెలుగులోకి వచ్చిన కేబుల్ వ్యవహారంలో ఇంకా ఎన్ని రోజులు విచారణ చేస్తారని ఆరా తీశారు. కాగ్ ఆడిట్ ప్రశ్నలకు ఎన్పీడీసీఎల్ అధికారులు కొన్ని సమాధానాలు ముందుంచారు. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడితే... పనులు సాగడం కష్టమవుతుందని నివేదించారు. అదే విధంగా కేబుల్ వ్యవహారంలో విచారణ సాగుతుందని సమాధానం ఇచ్చారు. మిగిలిన వాటిపై అధికారులు ఇంకా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. -
200 యూనిట్లు దాటితే బిల్లు బాంబే
ఇళ్లకు భారీ షాక్.. విద్యుత్ చార్జీల వడ్డనకు ఈఆర్సీ ప్రతిపాదనలు * 50 యూనిట్లలోపు వారికి 50 పైసల భారం * వాణిజ్య సంస్థలకు 29 పైసల పెంపు * కొత్త ప్రభుత్వాల అనుమతికై ఎదురుచూపులు * తెలంగాణలో రూ.2,500 కోట్లు, సీమాంధ్రలో రూ.3,500 కోట్ల బాదుడు సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ చార్జీల వడ్డనకు రంగం సిద్ధమయ్యింది. ఇరు ప్రాంతాల ప్రజలపై మొత్తం రూ.6 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ప్రజలపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్ర ప్రజలకు రూ.3,500 కోట్ల షాక్ తగలనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ముందుంచనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చార్జీలపై నిర్ణయం తీసుకోనున్నారుు. ప్రభుత్వాలు అనుమతించిన వెంటనే కొత్త విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ ఆదేశాలు వెలువడతాయి. జూన్ నెల నుంచే ఈ చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈఆర్సీ ప్రతిపాదనలను పరిశీలిస్తే.. తాజా పెంపు గృహ వినియోగదారులపై పెను భారం మోపనుంది. 50 యూనిట్లలోపు వినియోగించే పేద వినియోగదారులకూ షాక్ కొట్టనుంది. ఇక నెలకు 200 యూనిట్లు దాటితే బిల్లు బాంబులా పేలిపోనుంది. 200 యూనిట్లు దాటి వినియోగిస్తే... మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ 5.56 చొప్పున చెల్లించాల్సి రానుంది. ఇక వాణిజ్య సంస్థలకు సంబంధించి యూనిట్‌కు 29 పైసల చొప్పున పెంపుదల ఉండనుండగా... పరిశ్రమలకు 29 పైసల నుంచి రూ.2.41 వరకూ చార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి గత ఏప్రిల్ 1 నుంచే కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్, ఆ తర్వాత రాష్ట్ర విభజన వల్ల గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రెండు రాష్ర్ట ప్రభుత్వాలకు ఈ మేరకు విడివిడిగా ఈఆర్సీ ప్రతిపాదనలు పంపనుంది. సీమాంధ్రపైనే అధిక భారం! విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల వారీగా పడనున్న విద్యుత్ చార్జీల భారం లెక్క తేలిం ది. తెలంగాణలోని వినియోగదారులపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్రలోని వినియోగదారులపై రూ.3,500 కోట్ల భారం పడనుంది. సీమాంధ్రలో గృహ కనెక్షన్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లు సేవలు అందిస్తున్నాయి. సీమాంధ్రలో ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు విద్యుత్ పంపిణీ చేపడుతున్నాయి. అయితే సీమాంధ్రలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ సీపీడీసీఎల్ విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల పరిధిని ఎస్‌పీడీసీఎల్‌లోకి చేర్చారు. దీంతో ఈ రెండు జిల్లాల్లోని ఉచిత విద్యుత్, ఇతర వర్గాల సబ్సిడీ భారాన్ని సీమాంధ్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుం దని లెక్కకట్టారు. ఉచిత విద్యుత్‌తో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.2,800 కోట్లు చెల్లించాల్సి రానుంది. కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలుపుకుని సీమాంధ్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.3,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్కకట్టారు. క్రాస్ సబ్సిడీతో తెలంగాణకు తగ్గిన భారం! వాస్తవానికి ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తెలంగాణలోనే అధికం. మొత్తం 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో తెలంగాణలోనే 18 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అయినప్పటికీ సబ్సిడీ భారం తక్కువగా ఉంది. పరిశ్రమలు క్రాస్ సబ్సిడీ కింద చెల్లిస్తున్న మొత్తం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అదేవిధంగా ఇక్కడ వాణిజ్య వినియోగదారులు అధికంగా ఉన్నారు. వీరు కూడా క్రాస్ సబ్సిడీ కింద మిగిలిన వర్గాల చార్జీల భారాన్ని భరిస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో క్రాస్ సబ్సిడీ ఆదాయం ఎక్కువగా ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ భారం తగ్గిందన్నమాట. 200 దాటితే ఇల్లు గుల్లే: కొత్త చార్జీల నేపథ్యంలో నెలకు 200 యూనిట్లు దాటి విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లు పెద్ద షాకివ్వడం ఖాయం. ఎందుకంటే 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువగా వాడినా మొదటి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు 5.56 చొప్పున వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వినియోగిస్తే... పెరగనున్న చార్జీల మేరకు (మొదటి 50 యూని ట్లకు యూనిట్‌కు రూ.3.10 చొప్పున, 51-100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.75 చొప్పున, 101-150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున, 151-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.5.94 చొప్పున) మొత్తం రూ.908.50 చెల్లించాల్సి ఉంటుంది. 201 యూనిట్లు వినియోగిస్తే మాత్రం ఏకంగా (మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ.5.56 చొప్పున రూ.1112తో పాటు ఒక యూనిట్‌కు రూ. 6.69 మేరకు మొత్తం రూ.1118.69 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక యూనిట్ అదనంగా వాడినందుకు ఏకంగా రూ. 210.19 అదనంగా చెల్లించాల్సి రానుంది. మొత్తం బిల్లుకు సర్వీసు, ఇతర చార్జీలు అదనం.