హన్మకొండ : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫ రా సొసైటీ లిమిటెడ్ (సెస్) ఎండీ రంగారావు తిరిగి పాత స్థానానికే బదిలీ అయ్యారు. ఈనెల 21న జరిగిన ఎస్‌ఈల బదిలీల్లో ప్రాజెక్టు జీఎం గా ఉన్న రంగారావు సెస్ ఎండీగా నియమితులయ్యారు. అయితే గతంలో సెస్ ఎండీగా పని చేసిన సమయంలో రంగారావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ స్థానం లో రంగారావును నియమించడంపై విమర్శ లు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను తిరిగి పాత చోటికే బదిలీ చేశారు. సెస్ ఎండీగా ఆపరేషన్స్ విభాగంలో జీఎంగా ఉన్న రామకృష్ణను నియమిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రావుగారి కథ..
2007-10 మధ్య కాలంలో సెస్ ఎండీగా రంగారావు పని చేశారు. అప్పుడు రూ.4 కోట్ల సొ మ్ము దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడేళ్ల కాలంలో ఇంప్రూవ్‌మెంట్ వర్క్స్ పేరిట చేపట్టిన పనుల్లో నిధులు పెద్ద మొత్తంలో దుర్వినియోగమయ్యాయనే ఫిర్యాదులు అందాయి. ఈ బాగోతం విచారణ నిమిత్తం అప్పటి చీఫ్ ఇంజనీర్ కె.కృష్ణయ్యను విచారణ అధికారిగా ఎన్పీడీసీఎల్ నియమించింది. రంగారావు హయాంలో సెస్ పరిధిలో ఇంప్రూవ్‌మెంట్, డిపాజిట్ కంట్రిబ్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్, మైనర్ ఎక్స్‌టెన్షన్ విభాగాలుగా మొత్తం 3,207 పనులు జరిగాయి. అందులో కేవలం 1,837 పనులను విచారణ కమిటీ తనిఖీ చేసింది. మిగతా 1,370 పనుల ను సెస్ అధికారులు రికార్డులు సమర్పించకపోవడంతో తనిఖీ చేయలేకపోయినట్లు విచారణ నివేదికలో పేర్కొంది. ఇంప్రూవ్‌మెంట్ వర్క్స్‌లోనే భారీగా దుర్వినియోగం అయ్యాయంటూ గమనించారు.
అగ్రిమెంట్లు చేసుకోకుండానే ఏడీఈ, డీఈలు కాంట్రాక్టర్లతో పనులు చేయిం చి ఏకంగా బిల్లులు చెల్లించినట్లు విచారణ కమి టీ నిర్ధారించింది. కేవలం 89 పనులకు సంబంధించిన బిల్లులను కమిటీ పరిశీలించింది. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.7.56 లక్షలు అదనంగా చెల్లింపులు జరిగినట్లు బయటపడింది. సెక్షన్ ఆఫీసర్లు స్టోర్ నుంచి తీసుకున్న మెటీరియల్‌లో కొంత మొత్తం వినియోగించి పక్కదారి పట్టించినట్లు వేలెత్తిచూపింది. పలువురు ఏడీఈ, డీఈలతో పాటు ఏఏఓ, ఏఓలు, సెక్షన్ ఆఫీసర్లకు ఇందులో ప్రమేయం ఉందని, అప్పటి ఎండీ రంగారావు పర్యవేక్షణ లోపం ఉందని విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఈనెల 21న రంగారావును సెస్ ఎండీగా నియమించడంతో పాత ఫైల్ బయటకు వచ్చింది. విజిలెన్స్, డిపార్ట్‌మెంట్ విచారణ నివేదికలను సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. రంగారావును అక్కడ నుంచి తప్పించాలని, మరిన్ని పనులపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని, ఆయన అక్కడ ఉంటే విచారణకు అడ్డుగా ఉంటుందని అధికారులకు సూచించారు.
రావుగారు వెనక్కి...
Published Mon, Jun 30 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM
Advertisement
Advertisement