రైతుమిత్ర కథ కంచికి!
- ఆన్‌లైన్ ఎంట్రీల నిలిపివేత
- ఎన్‌పీడీసీఎల్ నుంచి ఆదేశాలు
- ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు వస్తే పాత పద్ధతిలోనే ఫిర్యాదు
పాలమూరు, న్యూస్‌లైన్: రైతాంగానికి ప్రయోజనం కలిగించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్)ఏడాదిన్నర క్రితం ప్రవేశపెట్టిన రైతుమిత్ర కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది. ఆన్‌లైన్ ఎంట్రీ విధానాన్ని నిలిపివేయాలని ఎన్‌పీడీసీఎల్ నుంచి జిల్లా విద్యుత్ శాఖాధికారులకు సమాచారం అందింది. ఇక వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైతే రైతులు నేరుగా ఫిర్యాదుచేసే ప్రత్యేకసెల్ సేవలు నిలిచిపోయాయి. ఇది తాత్కాలికమేనని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నా.. మళ్లీ ప్రారంభమవుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రైతులకు కరెంట్ కష్టాల నుంచి విముక్తి కలిగించేందుకు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ ఏడాదిన్నర కిందట రైతుమిత్ర పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం ఒక ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు గురైతే జిల్లాకేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లోని నంబర్‌కు ఫోన్‌చేసిన పక్షంలో ఫిర్యాదును స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన రైతు ఫోన్ చేసిన సెల్ నంబర్‌కు ఎక్‌నాలెడ్జ్‌మెంట్ పంపుతారు. 48 గంటల్లో ట్రాన్స్‌ఫార్మర్ మార్పు లేనిపక్షంలో మరమ్మతు చేస్తారు. ప్రస్తుతం దీన్ని నిలిపేయడంతో ఇక పాత పద్ధతిలోనే అంటే రాతపూర్వకంగా ఫిర్యాదులను స్వీకరించనున్నారు. వచ్చేనెల మొదటివారంలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
పాత కష్టాలు మళ్లీ మొదలు..
జిల్లాలో 35 వేలకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా.. ఆ సంఖ్యకు నాలుగు శాతం రోలింగ్ స్టాక్ (మరమ్మతుకు గురైన ట్రాన్స్‌ఫార్మర్‌కు బదులు మరో ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చేందుకు ఉన్న స్టాక్) అందుబాటులో ఉంచాలి. రోలింగ్ స్టాక్ ఉన్నప్పటికీ అందులో కొన్ని మాత్రమే పనిచేసేవి ఉన్నాయి. రైతుమిత్ర ఉన్నప్పుడే ఆన్‌లైన్ ఎంట్రీ చేస్తే రోజుల తరబడి మరమ్మతు చేసేవారు కాదని, ఇక రైతుమిత్ర నిలిపేయడంతో మా కష్టాలను పట్టించుకునే వారెవరని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 65 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం వరి పంట కొన్నిచోట్ల పొట్టదశలో ఉంది. ఈ పరిస్థితుల్లో నీళ్లు అందితేనే పంట చేతికొస్తుంది. ఒకవేళ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైతే మాత్రం రైతులకు కష్టాలు ఎదురవుతాయి. కేవలం రెండునెలలు మాత్రమే రైతు మిత్రను నిలిపేసినట్లు విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.