Transformer repairs
-
చెట్టు ఊగితే.. విద్యుత్ కట్
సాక్షి, వింజమూరు (నెల్లూరు): గత నెల రోజులుగా వింజమూరు మండలంలో విద్యుత్తు కోతలు ఎక్కువయ్యాయి. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో సాయంత్రం ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. దీంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండలంలో వింజమూరులో రెండు, తమిదపాడు, గుండెమడకల్లో సబ్స్టేషన్లు ఉన్నాయి. నాలుగు సబ్స్టేషన్లు ఉన్నా ఇంకా ఓవర్‌లోడ్ సమస్య ఉంది. వింజమూరు సుజాతనగర్ కాలనీ వాసులు లోఓల్టేజీ సమస్యతో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మండలంలో 500 ట్రాన్స్ఫార్మర్లు, దాదాపు 11 వేల కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఎక్కడో ఒక చోట గాలివానకు చెట్టు విరిగిపడితే వింజమూరు పట్టణానికి రెండు మూడు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. పల్లెల్లో అయితే ఒక్కోసారి మూడు రోజుల వరకూ సరఫరాను పునరుద్ధరించడం లేదు. వేసవి కావడంతో ఎండ వేడిమికి సిబ్బంది సాయంత్రం 4 గంటల తర్వాత విద్యుత్‌ను ఆపి పనులు చేస్తున్నారు. దీంతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కాలిపోతున్న ఇన్సులేటర్లు ఆకాశం మేఘావృతమైతే వెంటనే విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. అక్కడక్కడా చెట్లు తీగలకు అడ్డంగా ఉండడంతో గాలి రాగానే రెండు తీగలు తగులుకుని ఫీజులు పోతున్నాయి. దీంతో ఎల్ఆర్ తీసుకుని ఫీజులు వేస్తున్నారు. ఎక్కడ వైరు తెగినా ఆ ఫీడరు మొత్తం విద్యుత్తు సరఫరా నిలచిపోతోంది. ఫలితంగా కొన్ని గ్రామాలు పూర్తిగా అంధకారంలో ఉంటున్నాయి. వింజమూరు పట్టణంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటైతే ఆ ప్రాంతంలో విద్యుత్తు సమస్య ఏర్పడనప్పుడు సరఫరాను అక్కడ మాత్రమే నిలిపి వేసి మిగతా ప్రాంతమంతా సరఫరా చేయవచ్చు. ఆత్మకూరు నుంచి డీసీ పల్లి మీదుగా గుండెమడకల సబ్‌స్టేషనుకు విద్యుత్తు మెయిన్‌లైన్ సరఫరా కొద్దిపాటి వర్షానికే లైన్ కట్ అవుతోంది. ఈ సబ్‌స్టేషన్ నుంచి శంఖవరం ఫీడరుకు విద్యుత్ సరఫరాలో రోజుల కొద్ది అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ లైన్ వెళ్లే నేల నల్లరేగడి కావడంతో వర్షానికి, గాలివానకు స్తంభాలు నేలకు వాలి పడిపోతున్నాయి. ఒకవేళ స్తంభాలు పడిపొతే కాంట్రాక్టర్ కోసం రెండు రోజులు వేచి ఉండి ఆ తర్వాత స్తంభాలు ఎత్తుతున్నారు. దానివల్ల రెండు మూడురోజుల పాటు ఆ లైన్ మొత్తం విద్యుత్ సరఫరా అవడం లేదు. నల్లగొండ్లలో గాలివానకు పడిపోయిన నాలుగు ట్రాన్స్ ఫార్మర్లను వారాల తరబడి అలాగే ఉంచారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలితో పాటు, ఉరుములు, మెరుపులు వచ్చిన వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు. ఇటీవల విపరీతంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సాయంత్రం పూట విద్యుత్తు సరఫరా లేక వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు మాత్రం కచ్చితంగా కట్టించుకుంటున్నారని సరఫరా మాత్రం సరిగా ఉండడం లేదని విద్యుత్తు సిబ్బంది తీరును జనం ఎండగడుతున్నారు. మెరుపులు, ఉరుములు వస్తే ఇన్సులేటర్లు కాలిపోతున్నాయని అందుకోసం సరఫరా నిలిపి వేస్తున్నట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా ఏఈ లేక ఇబ్బందులు మండలంలో గత నాలుగేళ్లుగా ఏఈ లేక విద్యుత్తు సరఫరాలో ఇబ్బంది వస్తే పర్యవేక్షణ జరిపి సిబ్బందితో పనిచేయించే వారు లేకుండా పోయారని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యూలర్ ఏఈని నియమించకుండా ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో కొన్ని గ్రామాలకు వారంలో మూడు రోజుల పాటు కూడా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా జరగడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు. స్తంభాలు పడిపోయినా స్పందించడం లేదు కొద్దిపాటి గాలివానలకు స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా కావడం లేదు. గ్రామంలో అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినా మరమ్మతులు చేయడానికి సిబ్బంది రావడం లేదు. రెగ్యూలర్ ఏఈని నియమించకపొతే సిబ్బంది సరిగా పని చేయరు. – బోగిరెడ్డి కృష్ణారెడ్డి, నల్లగొండ్ల -
విద్యుత్ ప్రమాదాల నివారణకు కదిలిన సర్కార్
ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. - పెలైట్ ప్రాజెక్ట్ కింద గజ్వేల్ ఎంపిక - వెల్లడించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి - ఎర్తింగ్ లోపాల నివారణకు మండలానికో రూ. లక్ష - సబ్స్టేషన్లను సందర్శించిన సీఎండీ గజ్వేల్: పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద సొంత మరమ్మతుల కారణంగా జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్న దుస్థితిపై సర్కారు ఎట్టకేలకు దృష్టిసారించింది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 15న జిల్లాలోని సమస్య తీవ్రతను ఎత్తిచూపుతూ ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో స్పందించిన ఎస్పీడీసీఎల్ (సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) సీఎండీ రఘుమారెడ్డి బుధవారం గజ్వేల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 33/11కేవీ, 133/33కేవీ సబ్‌స్టేషన ఆవరణలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పంటపొలాల్లో వేలాడుతున్న స్తంభాలు, వైర్లను సరిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. మరోవైపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ లోపాల నివారణకు మండలానికో లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఏఈ కార్యాలయాల్లో ఫిర్యాదుల రిజిష్టర్‌ను నిర్వహిస్తామని తెలిపారు. రైతులు, ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదును నమోదు చేస్తే పరిశీలన జరిపి వారంరోజుల్లో నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులు సొంతంగా మరమ్మతులు చేసి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని కోరారు. సిబ్బంది కొరత వల్ల గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమేనని వెల్లడించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాల్లో వేగంగా సేవలందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వచ్చిన వెంటనే రెండుగంటల్లోపు దానిని మరమ్మతు చేయించి ఇవ్వడం లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం చేస్తామన్నారు. మరమ్మతు కేంద్రాల్లో సేవలకు రైతులు ఒక్కరూపాయి కూడా ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. గజ్వేల్‌లో లోడింగ్, అన్లోడింగ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ రాములు, డీఈ యాదయ్య, గజ్వేల్ ఏడీఈ జగదీష్, ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
శిక్ష పడేనా?
* ట్రాన్స్‌కో స్టోర్‌లో కాపర్,అల్యూమినియం మాయం * నేడు విచారణకు రానున్న ఎస్ఈ * గతంలోనే నలుగురు అధికారుల సస్పెన్షన్ * సిబ్బంది, అధికారులలో చర్చ నిజామాబాద్ నాగారం: ట్రాన్స్‌కో స్టోర్‌లో లక్షల రూపాయల విలువ చే సే కాపర్, అల్యూమినియం మాయమైంది. ఏడు నెల ల క్రితం ఒక ఏడీఈ, నలుగురు ఏఈలు సస్పెండ్ అ య్యారు. శుక్రవారం ఎస్ఈ విచారణకు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ కుంభకోణం ట్రాన్స్‌కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షిస్తారా.. బయట పడేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులలో వెలువడిన కాపర్, అల్యూమినియంను అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్లు స్టోర్ రూమ్‌కు అప్పజెప్పి రసీదు తీసుకోవాలి. అప్పుడే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్లు కాపర్, అల్యూమినియంను స్టోర్‌రూమ్‌కు అందజేయకున్నప్పటికీ ముట్టజెప్పినట్లుగా రశీదు తీసుకున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారుల మధ్య అవగాహన ప్రకారమే ఈ తతంగం చా లా రోజులుగా కొనసాగినట్లు తెలిసింది. కాపర్‌ను బయటే అమ్ముకుని డబ్బులను పంచుకునేవారు. ఈ క్రమంలో 2011-12లో నిజామాబాద్‌లోని స్టోర్ ఏఈగా పని చేస్తున్న శ్రీహరి బదిలీపై కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. జిల్లాలోని నవీ పేట మండలం ఏఈగా పని చేస్తున్న ప్రశాంత్‌రెడ్డికి స్టోర్ ఏఈగా బదీలీ చేశారు. బాధ్యతలు తీసుకునే సమయంలో రికార్టులు అన్నీ సరి చూసుకుంటుండగా కాపర్, అల్యుమిని యం స్టాక్ తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీంతో బాధ్యత లు తీసుకోవడానికి ప్రశాంత్‌రెడ్డి నిరాకరించారు. ఒప్పందం ప్రకారం విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, కరీంనగర్ స్టోర్ ఏడీఈ ప్రకాశం, నిజామాబాద్ స్టోర్ ఏడీఈగా పనిచేస్తున్న రఘుకుమార్ రంగంలోకి దిగి, శ్రీహరి,ప్రశాంత్‌రెడ్డి మధ్య ఒప్పందం కుదిర్చారు. ఈ మేరకు శ్రీహరి రూ.10 లక్షలు ఇవ్వాలి. దీంతో పూర్తి బాధ్యత ప్రశాంత్‌రెడ్డి తీసుకుంటారు. ఒప్పందం ప్రకారం ముందుగా రూ.5 లక్షలు ప్రశాంత్ రెడ్డికి ముట్టాయి. ఇప్పటి వరకు కథ బాగానే నడిచింది. మిగతా రూ. 5 లక్షల చెల్లింపులో తీవ్ర జ్యాపం జరగడంతో ఇద్దరి మధ్య రగడ మొదలైంది. మళ్లీ కరీంనగర్ ఏడీఈ, నిజామాబాద్ స్టోర్ ఏడీఈ, ఏఈ శ్రీహరి, ఏఈ ప్రశాంత్‌రెడ్డి సమావేశ మయ్యారు. శ్రీహరి మరో రూ.2 లక్షలు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ అకౌంట్లోకి పంపించారు. ఈలోగా ఇక్కడ స్టోర్ ఏడీఈగా పని చేస్తున్న రఘుకుమార్ కామారెడ్డికి బదీలీపై వెళ్లారు. దోమకొండలో పనిచేస్తున్న ఏడీఈ వెంకటరమణ స్టోర్ ఏడీఈగా బదీలీపై వచ్చారు. దీంతో కొత్తగా వచ్చిన ఏడీఈకి సదరు కాంట్రాక్టర్ తన అకౌంట్లోకి రూ. రెండు లక్షలు ఏవిధంగా వచ్చాయో చెప్పాడు. స్టోర్ ఏడీఈ బాధ్యతలు తీసుకున్నప్పుడు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని సంతకం పెట్టిన వెంకటరమణ, తనకు అందాల్సిన వాటా రాకపోవడంతో అప్పటి ఎస్ఈకి విషయాన్ని చేరవేశారు. అప్పటికే దీనిపై ‘సాక్షి’ లో వరుస కథనాలు రావడంతో ఎస్ఈ విషయాన్ని సీఏండీ దృషికి తీసుకెళ్లారు. వెంటనే నలుగురు ఏఈలు, ఏడీలు, అనంతరం స్టోర్ ఏఈ సస్పెండయ్యారు. విచారణను నిలిపేందుకు యత్నాలు ఇదే విషయంలో వెనువెంటనే విచారణ చేయిస్తే మరింత మంది అధికారులు, కాంట్రాక్టర్లు బయటకు వస్తారని తెలి సింది. దీంతో అక్రమాల్లో భాగస్వాములు ఉన్నవారు విచారణను నిలిపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంత పెద్దమొత్తంలో కుంభకోణం జరగడం, ఇందులో కేవలం అధికారులను బలి చేయడం జరిగిపోయింది. కాంట్రాక్టర్లు తప్పు లు చేసినట్లు తెలిసినా అప్పటి ఎస్ఈ వారి పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టలేదు. వారిని వెనకేసుకు వచ్చారు. దీంతో సద రు కాంట్రాక్టర్లు అందుకు కానుకగా ఒక ఏసీని, ఒక టీవీ, విలువైన పర్నిచర్‌ను కార్యాలయానికి అందజేశారని సమాచారం. దీంతో పెద్దసారు సంతృప్తి చెంది వారిని ఏమీ అనలేదు. ఎస్ఈ బదీలీ అయ్యేంత వరకు అక్కడే ఉన్న టీవీ, మ రికొన్ని వస్తువులు కొత్త ఎస్ఈ వచ్చేలోగా మాయం చేశారు. నేడు విచారణలో ఏం జరుగుతుందో.. వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి ఎస్ఈ శుక్రవారం జిల్లాకు రానున్నారు. స్టోర్ ఏడీఈగా ఉన్న వెంకటరమణ, కామారెడ్డి ఎడీఈ రఘుకుమార్, కరీంనగర్ ఏఈ శ్రీ హరి, సస్పెండ్ అయిన ఏఈ ప్రశాంత్‌రెడ్డిపై విచారిస్తారు. అసలు ఏం జరిగింది. ఎంత మొత్తంలో అక్రమాలు జరి గాయి అన్ని విషయాలు తెలియాల్సి ఉంది. విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం లేకపోలేదు. -
రైతుమిత్ర కథ కంచికి!
- ఆన్లైన్ ఎంట్రీల నిలిపివేత - ఎన్పీడీసీఎల్ నుంచి ఆదేశాలు - ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు వస్తే పాత పద్ధతిలోనే ఫిర్యాదు పాలమూరు, న్యూస్‌లైన్: రైతాంగానికి ప్రయోజనం కలిగించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)ఏడాదిన్నర క్రితం ప్రవేశపెట్టిన రైతుమిత్ర కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది. ఆన్లైన్ ఎంట్రీ విధానాన్ని నిలిపివేయాలని ఎన్పీడీసీఎల్ నుంచి జిల్లా విద్యుత్ శాఖాధికారులకు సమాచారం అందింది. ఇక వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురైతే రైతులు నేరుగా ఫిర్యాదుచేసే ప్రత్యేకసెల్ సేవలు నిలిచిపోయాయి. ఇది తాత్కాలికమేనని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నా.. మళ్లీ ప్రారంభమవుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులకు కరెంట్ కష్టాల నుంచి విముక్తి కలిగించేందుకు ఎన్పీడీసీఎల్ సీఎండీ ఏడాదిన్నర కిందట రైతుమిత్ర పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం ఒక ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు గురైతే జిల్లాకేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లోని నంబర్‌కు ఫోన్‌చేసిన పక్షంలో ఫిర్యాదును స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన రైతు ఫోన్ చేసిన సెల్ నంబర్‌కు ఎక్నాలెడ్జ్మెంట్ పంపుతారు. 48 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ మార్పు లేనిపక్షంలో మరమ్మతు చేస్తారు. ప్రస్తుతం దీన్ని నిలిపేయడంతో ఇక పాత పద్ధతిలోనే అంటే రాతపూర్వకంగా ఫిర్యాదులను స్వీకరించనున్నారు. వచ్చేనెల మొదటివారంలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. పాత కష్టాలు మళ్లీ మొదలు.. జిల్లాలో 35 వేలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు ఉండగా.. ఆ సంఖ్యకు నాలుగు శాతం రోలింగ్ స్టాక్ (మరమ్మతుకు గురైన ట్రాన్స్ఫార్మర్కు బదులు మరో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు ఉన్న స్టాక్) అందుబాటులో ఉంచాలి. రోలింగ్ స్టాక్ ఉన్నప్పటికీ అందులో కొన్ని మాత్రమే పనిచేసేవి ఉన్నాయి. రైతుమిత్ర ఉన్నప్పుడే ఆన్లైన్ ఎంట్రీ చేస్తే రోజుల తరబడి మరమ్మతు చేసేవారు కాదని, ఇక రైతుమిత్ర నిలిపేయడంతో మా కష్టాలను పట్టించుకునే వారెవరని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 65 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం వరి పంట కొన్నిచోట్ల పొట్టదశలో ఉంది. ఈ పరిస్థితుల్లో నీళ్లు అందితేనే పంట చేతికొస్తుంది. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైతే మాత్రం రైతులకు కష్టాలు ఎదురవుతాయి. కేవలం రెండునెలలు మాత్రమే రైతు మిత్రను నిలిపేసినట్లు విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.