ట్రాన్స్‌కో..కాస్కో | Corrupt officials To ACB fibrillation | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో..కాస్కో

Published Fri, Apr 24 2015 2:34 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Corrupt officials To ACB fibrillation

ఖమ్మం/ సత్తుపల్లి: జిల్లాలోని ఎన్‌పీడీసీఎల్‌లో పనిచేస్తున్న అవినీతి అధికారులకు ఏసీబీ దడ పట్టుకుంది. ఎప్పుడు ఏసీబీ దాడులు జరుగుతాయో..ఎవరు ట్రాప్ అవుతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. వేలాది రూపాయల వేతనాలు వస్తున్నా అవినీతి సొమ్ముకు ఎన్‌పీడీసీఎల్ అధికారులు ఆశపడుతుండటంపై విమర్శలు సైతం వస్తున్నాయి.జిల్లాతో పాటు ఎన్పీడీసీఎల్ విస్తరించి ఉన్న అన్ని జిల్లాల్లో రోజు ఏదో ఒకచోట అవినీతి అధికారులు పట్టుపడుతుండటం గమనార్హం.

అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఇటీవల ఆశాఖ ఉన్నతాధికారి ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. విద్యుత్ వినియోగదారుల వద్దనే కాకుండా సొంతశాఖ సిబ్బంది నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఏసీబీకి పట్టుబడుతుండటం గమనార్హం.  
 
వరుస దాడులు
గడిచిన రెండు నెలల్లో ఎన్పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో తల్లాడ, సత్తుపల్లి ప్రాంతాల్లో అధికారులు ఏసీబీకి చిక్కారు. గతంలో కూడా ఇదే సత్తుపల్లి సబ్‌డివిజన్ పరిధిలోని బోనకల్లు, వేంసూరు, పెనుబల్లి ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులు ఏసీబీ పట్టుబడ్డారు. విద్యుత్‌శాఖలో మరికొన్ని అవినీతి చేపలున్నాయని వారిని కూడా పట్టుకొని తీరుతామని ఏసీబీ హెచ్చరిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
 
సత్తుపల్లి డివిజన్‌లో మరీ అధికం..
విద్యుత్‌శాఖ అధికారులు ప్రతి పనికి అనధికారికంగా ఒక రేటు ఫిక్స్‌చేసి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ నుంచి సామాన్యుల ఇంటి కనెక్షన్ వరకు ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల కాలంలో సత్తుపల్లి డివిజన్‌లోని నలుగురు విద్యుత్‌శాఖ ఉద్యోగులే ఏసీబీకి పట్టుబడ్డారు. బోనకల్, పెనుబల్లి, తల్లాడ, ఏఈలు మునీర్‌పాషా, ప్రవీణ్‌కుమార్, రాంరెడ్డిలు ఏసీబీ వలలో చిక్కారు.

ఈ నెల మొదటివారంలో తల్లాడ ఏఈ  శీలం రాంరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చివరికి సొంత శాఖ ఉద్యోగులను కూడా వదలకపోవడంతో సత్తుపల్లి లైన్‌మన్ పూర్ణచంద్రరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీఈఈ సుదర్శనాన్ని పట్టించటం సంచలనం సృష్టించింది. గతేడాది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై డీఈఈ కార్యాలయంలో ముగ్గురు సిబ్బందిపై వేటుపడింది. ఏసీబీకి పట్టుబడినా ఆరు నెలలకే మళ్లీ విధుల్లోకి చేరుతుండటంతో సస్పెన్షన్లు అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఆశాఖ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
 
హెచ్చరించినా అదే తీరు..
ఎన్పీడీసీఎల్ పరిధిలోని పలువురు అధికారులు, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఆశాఖ సీఎండీ వెంకటనారాయణ ఇటీవల జరిగిన సమావేశంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ సమావేశంలో  జిల్లాకు చెందిన పలువురు రైతులు, వినియోగదారులు అధికారులు తమ వద్దనుండి లంచం అడుగుతున్నారని, డబ్బులు ఇవ్వనిదే పనిచేయడంలేదని ఫిర్యాదు చేశారు.
 
దీనిపై సీఎండీ జిల్లా ఉన్నతాధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలిసింది.  జిల్లాలో గత నెలలో జరిగిన సమావేశంలోనూ సీఎండీ అవినీతిపై మాట్లాడారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇంత జరిగినా అధికారుల తీరు మారకపోవడం, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీకి చిక్కడం గమనార్హం. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన సమావేశంలోనూ ‘తెలంగాణ పునర్నిర్మాణంలో మీ భాగస్వామ్యం కీలకం, మీకు కావాల్సినంత వేతనాలు ఇస్తున్నాం. అక్రమాలకు పాల్పడకండి..’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖల అధికారులకు సూచించారు. లంచం అడిగితే ఫోన్ చేయండి..అంటూ టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించడంతో అవినీతి అధికారులకు చెక్ పడుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement