- ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో 174 కేసులు పరిష్కారం
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగుల నుండి రూ.70 వేలు వసూళ్లు
- ఎన్పీడీసీఎల్ సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్ రాజారావు
ఖమ్మం :విద్యుత్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు పరిష్కారం కాక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎన్పీడీసీఎల్ కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రసల్ ఫోరం ఉందని ఫోరం చైర్‌పర్సన్ రాజారావు తెలిపారు. ఈ ఫోరం పూర్తిగా వినియోగదారుల పక్షాన ఉంటుందన్నారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు ఆయన హాజరయ్యారు. రైతులు, ఇతర విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించారు. వీటిలో కొన్ని తక్షణమే పరిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003లో వచ్చిన విద్యుత్ చట్టంలో పొందుపరిచిన అంశాలను ఆధారంగా తీసుకొని 2004లో ఈ ఫోరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఫోరం ద్వారా విద్యుత్ వినియోగదారుల సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 79 విద్యుత్ సబ్‌డివిజన్లలో 66 సబ్‌డివిజన్లలో ఈ ఫోరం సమావేశాలు నిర్వహించిందన్నారు. ఫోరం ఏర్పాటు చేసిన సమావేశాలు, నేరుగా అందిన ఫిర్యాదులు కలిపి ఐదు జిల్లాల పరిధిలో 442 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 174 ఫిర్యాదులను పరిష్కరించామని, 274 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ప్రతి ఫిర్యాదుపై స్పందించాల్సిన అవసరం ఉందని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారి నుండి రూ. 9,200, వరంగల్ జిల్లాలో లైన్ మార్చడం కోసం జాప్యం చేసిన అధికారి నుండి రూ. 4,100, అదిలాబాద్ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్‌ల మంజూరులో జాప్యం చేసినందుకు రూ. 4,700 ఇలా 11 కేసులకు సంబంధించిన పనులకు అధికారుల నుండి రూ. 70 వేలు వసూలు చేసి వినియోగదారుల సర్వీసు బిల్లుల్లో జమచేశామని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ మార్చడం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల, ట్రాన్స్‌ఫార్మర్ మీద అధికలోడు ఉన్నా, లోపాలు ఉన్నా మీటర్ మార్చడం, కొత్త కనెక్షన్ అడిషనల్ లోడు ఇవ్వడం, సర్వీసు పేరు మార్పిడి, వాడకానికి మించి అధిక బిల్లు రావడం, సర్వీసు కేటగిరీ మార్పిడి, సర్వీసు క్యాన్సెల్ చేయడం వంటి సమస్యలను ఈ ఫోరం ద్వారా పరిష్కారిస్తామన్నారు.
ఫిర్యాదులను రాత పూర్వకంగా చేస్తే అందులో సర్వీసు నెంబర్, పూర్తి అడ్రస్‌తో సదస్సులు జరిగినప్పుడు నేరుగా కానీ, కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రసల్ ఫోరం విద్యుత్ భవన్, నక్కలగుట్టా హన్మకొండ, వరంగల్ పేరున పోస్టు ద్వారా కానీ, సంబంధిత అధికారులకు నేరుగా కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే రషీదు పొందాలని సూచించారు. వివరాల కోసం 0870-2461551, 9440811299 నెంబర్లు సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో సీజీఆర్‌ఎఫ్ సభ్యులు వెంకటనారాయణ, రవీందర్, సాయిరెడ్డి, ఖమ్మం ఎస్‌ఈ తిరుమలరావు పాల్గొన్నారు.
వినియోగదారుల పక్షానే..
Published Wed, May 13 2015 4:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement