కొత్తగా రెండు విద్యుత్‌ డివిజన్లు | Two new divisions of power | Sakshi
Sakshi News home page

కొత్తగా రెండు విద్యుత్‌ డివిజన్లు

Published Fri, Sep 16 2016 12:39 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Two new divisions of power

  •  డీఈలకు ఇంచార్జీ ఎస్‌ఈల బాధ్యత
  • జిల్లా స్థాయి డీఈ పోస్టుల రద్దు
  • కొనసాగనున్న ఆపరేషన్‌ డీఈలు
  • జిల్లాల పునర్విభజనతో మార్పులు
  •  
    హన్మకొండ : కొత్త జిల్లాల ఏర్పాటుతో విద్యుత్‌ శాఖలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల(ఎన్పీడీసీఎల్‌ సర్కిల్‌)కు సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు(ఎస్‌ఈ) జిల్లా ప్రధాన అధికారిగా ఉండనున్నారు. కొత్త జిల్లాలకు ఎస్‌ఈలను నియమించాలంటే ఆ మేరకు కొత్తగా పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు కొత్త పోస్టులు మంజూరు చేసే అవకాశం లేనందున ఉన్న అధికారులను సర్దుబాటు చేయనున్నారు. అలాగే, పరిధి ఎక్కువగా ఉన్న డివిజన్ల నుంచి కొన్ని ప్రాంతాలతో కలిపి రెండు నూతన డివిజన్లు ఏర్పాటుచేయనున్నారు.
     
    ప్రస్తుతం ఆరు డివిజన్లు
    జిల్లాలో ప్రస్తుతం వరంగల్‌ అర్భన్, వరంగల్‌ రూరల్, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగులో ఎన్పీడీసీఎల్‌ అపరేషన్‌ డివిజన్లు ఉన్నాయి. ఇందులోని జనగామ డివిజన్‌ 12 మండలాలతో అతి పెద్ద డివిజన్‌గా ఉంది. ఈ డివిజన్‌లోని ఆరు మండలాల్లో హెడ్‌క్వార్టర్‌ జనగామతో సహా నాలుగు మండలాలు యాదాద్రిలో, రెండు మండలాలు కొత్తగా ఏర్పడనున్న సిద్ధిపేట జిల్లాలో కలువనున్నాయి. అలా యాదాద్రి, సిద్దిపేట జిల్లాలో కలిసే మండలాలను ఎస్పీడీసీఎల్‌ పరిధిలోకి వెళ్తాయి. మిగతా అరు మండలాలు రఘునాథపల్లి, ధర్మసాగర్, పాలకుర్తి, జఫర్‌గఢ్‌, స్టేషన్‌ ఘన్‌పూర్, నర్మెట మండలాలు ఎన్పీడీసీఎల్‌లో ఉంటాయి. ఈ ఆరు మండలాలు కలిపి స్టేషన్‌ ఘన్‌పూర్‌ కేంద్రంంగా కొత్తగా డివిజన్‌ ఏర్పాటు చేయాలని యోచనలో ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఉంది. దీంతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న జయశంకర్‌ జిల్లాలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానున్న భూపాలపల్లి కేంద్రంగా మరో డివిజన్‌ ఏర్పాటు చేస్తారు.
     
    కొత్త రద్దు.. మరికొన్ని బాధ్యతలు బదలాయింపు
    విద్యుత్‌ శాఖకు సంబధించి జిల్లా స్థాయిలో అయిదు డిప్యూటీ(డివిజనల్‌) ఇంజనీర్‌(డీఈ) పోస్టులు ఉంటాయి. వీరితో పాటు ప్రతీ ఆపరేషన్‌ డివిజన్‌లో ఉన్నతాధికారిగా డీఈ పోస్టు ఉంటుంది. ఇలా ప్రస్తుతం జిల్లాలో ఆరు డివిజన్లకు అరుగురు డీఈలున్నారు. వీరితో పాటు జిల్లా స్థాయిలో డీఈ టెక్నికల్, డీఈ కన్‌స్ట్రక‌్షన్, డీఈ డీపీఈ, డీఈ ఎంన్‌పీ, డీఈ ట్రాన్స్‌ఫార్మర్స్‌ ఉంటారు. ప్రస్తుత మార్పుల ప్రకారం సర్కిల్‌ కార్యాలయంలోని డీఈ టెక్నికల్, డీఈ ఎంఎన్‌పీ పోస్టులు రద్దుచేసి డీఈ టెక్నికల్‌ నిర్వర్తిస్తున్న బాధ్యతలు ఎస్‌ఈకి బదలాయించనున్నారు. రద్దు కానున్న డీఈ ఎంఎన్‌పీ విభాగాన్ని డీఈ ట్రాన్స్‌ఫార్మర్స్‌ విభాగంలోకి బదలాయించనున్నట్లు సమాచారం. అలాగే డీఈ కన్‌స్ట్రక‌్షన్‌ పోస్టు రద్దు చేసి ఏ డివిజన్‌లో సబ్‌స్టేషన్‌ నిర్మిస్తే ఆ డివిజన్‌ ఆపరేషన్‌ డీఈకే బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా రద్దు కానున్న డీఈ పోస్టులను కొత్త డివిజన్లకు సర్దుబాటు చేయడంతో పాటు ఇందులో సీనియర్‌ డీఈలను పూర్తి అదనపు బాధ్యతలతో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు సూపరిటెండెంట్‌ ఇంజనీర్లుగా నియమించాలని ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలిసింది.
     
    రెవెన్యూలోనూ మార్పులు
    ఆపరేషన్‌ విభాగంతో పాటు ఎన్పీడీఎల్‌ రెవెన్యూ విభాగంలో మార్పులు జరుగనున్నాయి. జిల్లా సర్కిల్‌ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ విభాగం ఉన్నతాధికారిగా ఉంటారు. సదరు అధికారితో పాటు మరో ఇద్దరు అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ ఉంటారు. అకౌంట్స్‌ ఆఫీసర్‌(రెవెన్యూ), అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఎక్స్‌పెండేచర్‌). కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నందున పని భారం తగ్గనుంది. దీంతో జిల్లాలో సర్కిల్‌ కార్యాలయానికి ఒక్క సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ను మాత్రమే కొనసాగించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అకౌంట్స్‌ పోస్టులు రద్దు చేసి కొత్త జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. కొత్త జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న సర్కిల్‌ కార్యాలయాల్లోను ప్రస్తుతం అకౌంట్స్‌ ఆఫీసర్లుగా పని చేస్తున్న వారిలో సీనియర్లకు ఇన్‌చార్జిగా పూర్తి అదనపు బాధ్యతలతో సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు సమాచారం. ఇంకా మిగిలిన ఉద్యోగులను కూడా సర్దుబాటు చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement