సాక్షి, హైదరాబాద్: ఇంటి బిల్లుకు, పంట బిల్లుకు లంకె వేయడం కుదరదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఈఆర్‌సీ రెగ్యులేషన్స్-2004లో సవరణలు చేసింది. పంట బిల్లు చెల్లించలేదని ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగించడం కుదరదని స్పష్టంచేసింది. ఇందుకు అనుగుణంగా 2004లోని రెగ్యులేషన్స్‌ను మార్పులు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయ కనెక్షన్లకు 2004 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేశారు. ప్రతినెలా రూ.20 చొప్పున సర్వీసు చార్జీలను చెల్లించాలని పేర్కొన్నారు. అయితే, ఈ మొత్తాన్ని కూడా ఆయన హయంలో ఏనాడూ వసూలు చేయలేదు. వైఎస్ మరణం తర్వాత వ్యవసాయ కనెక్షన్లకు సర్వీసు చార్జీని రూ.20 నుంచి రూ.30కి పెంచారు.
అంతేకాకుండా 2004 నుంచి వసూలు చేయని మొత్తాన్ని కూడా చెల్లించాలని పేర్కొంటూ రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి బిల్లుకు లంకె పెట్టి వ్యవసాయ సర్వీసు చార్జీలను చెల్లించాలని డిస్కంలు బిల్లులు జారీచేయడం మొదలుపెట్టాయి. పాత సర్వీసు చార్జీలను చెల్లించనివారి ఇంటి విద్యుత్ కనెక్షన్లు తొలగించాయి. ఇది సరికాదంటూ గతంలో అనేకసార్లు ‘సాక్షి’ సవివరంగా వార్తలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ కనెక్షన్లకు సర్వీసు చార్జీలను చెల్లించని పక్షంలో అదే వినియోగదారుడికి చెందిన ఇతర విద్యుత్ కనెక్షన్లు తొలగించరాదని పేర్కొంటూ ఈఆర్‌సీ తాజాగా ఆదేశాలు జారీచేసింది. అయితే, తాజా ఆదేశాలతో వ్యవసాయ కనెక్షన్లు తొలగించే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ చట్టాన్ని డిస్కంలు కచ్చితంగా అమలుచేసేలా ఈఆర్‌సీ దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. కాగా.. విద్యుత్ చట్టం-2003 ప్రకారం కూడా వినియోగదారునికి బకాయి ఉన్న విషయాన్ని రెండేళ్లలోపు తెలియచేసి, వాటిని వసూలు చేసుకునే అవకాశం ఉంది. కానీ, బకాయి ఉన్న విషయాన్ని తెలపకుండా బిల్లు వసూలు చేయకూడదు.
పంటకు,ఇంటికి లంకె కుదరదు!
Published Tue, Aug 6 2013 4:34 AM | Last Updated on Sat, Jun 2 2018 5:07 PM
Advertisement