సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్‌సీ) టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ కింద ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం థ్రెషోల్డ్ లిమిట్ రెగ్యులేషన్–2023ని రూపొందించింది.
ఈ మేరకు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 ప్రకారం.. కొత్త నిబంధనలతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ను కమిషన్ తయారు చేసింది. దీనిపై ఎవరికైనా సూచనలు, అభ్యంతరాలుంటే ఈ నెల 29లోగా తమ ప్రధాన కార్యాలయానికి మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది. ఈ గడువు ముగిసిన తర్వాత డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఖరారు చేస్తామని కమిషన్ తెలిపింది. ఈ రెగ్యులేషన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఏపీ ఈఆర్‌సీ పేర్కొంది.
రెండుసార్లు అడిగిన కేంద్రం
విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021 మార్చి 15న ఒక లేఖ విడుదల చేసింది. ఇందులో ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్ అభివృద్ధి కోసం టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్(టీబీసీబీ)ని ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. టీబీసీబీ ద్వారా ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్‌లను అందించడానికి గరిష్ట పరిమితిని తెలియజేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆగస్టు 21న ఏపీ ఈఆర్‌సీకి మరో లేఖ పంపింది. వీటిని పరిగణలోకి తీసుకుని 2020–21 నుంచి 2023–24 వరకు నాలుగు ఆర్థి క సంవత్సరాల్లో ఏపీ ట్రాన్స్‌కో స్టేట్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీకి మంజూరైన పెట్టుబడి అనుమతులను కమిషన్ పరిశీలించింది.
ఆమోదించిన 23 ప్రాజెక్ట్‌లలో 10 ప్రాజెక్ట్‌లు (43.5 శాతం) అమలు జరిగినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్ టారిఫ్‌ను తగ్గించడం, జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో ట్రాన్స్‌మిషన్ సేవల కోసం ఇప్పటికే అమలులో ఉన్న టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకోవడం, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధిలో పోటీని ప్రోత్సహించే పవర్ మార్గదర్శకాల అభివృద్ధి కోసం కొత్త డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ను కమిషన్ తీసుకువస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment